Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రికార్డు స్థాయికి టోకు ధరల ద్రవ్యోల్బణం
న్యూఢిల్లీ : కరోనా, లాక్డౌన్ నిబంధనలతో ఇప్పటికే ప్రజలు ఆర్థికంగా సతమతమవుతుంటే మరోవైపు అధిక ధరలు సామాన్యుల బతుకులను మరింత చిద్రం చేస్తోన్నాయి. పెట్రోల్, డీజిల్ మంటతో ప్రస్తుత ఏడాది మేలో టోకు ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం (డబ్ల్యుపీఐ) సూచీ ఇది రికార్డ్ స్థాయిలో 12.49 శాతానికి ఎగిసింది. దీంతో ప్రభుత్వ గణంకాల ప్రకారం వరుసగా ఐదో మాసంలోనూ ధరల పెరుగుదల కొనసాగింది. ఇంతక్రితం ఏప్రిల్‌లో టోకు ద్రవ్యోల్బణం సూచీ 10.49 శాతానికి చేరి.. 11 ఏండ్ల గరిష్ట స్థాయి వద్ద నమోదైంది. 2020 మేలో ఈ సూచీ 3.37 శాతంగా చోటు చేసుకుంది. ముఖ్యంగా ముడి చమురు ధరలు, పెట్రోల్, డీజిల్, నాఫ్తా, ఫర్నేస్ వంటి మినరల్ ఆయిల్స్‌తో పాటు తయారీ వస్తువుల ధరలు పెరగడంతో మే నెలలో టోకు ధరలు రికార్డు స్థాయిలో ఎగబాకాయని వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ సోమవారం ఓ రిపోర్ట్‌లో పేర్కొంది. ఇక తయారీ వస్తువుల ద్రవ్యోల్బణం ఏప్రిల్‌లో 9.6శాతం పెరగ్గా, మేలో 10.8శాతం ఎగిసింది. మోడీ ప్రభుత్వం పెట్రో ఉత్పత్తులపై అమాంతంగా పెంచుతున్న పన్నుల భారం ధరలకు ఆజ్యం పోస్తోందని.. ఇకనైనా కట్టడి చేయకపోతే ప్రజల కొనుగోలు శక్తి అమాంతం హరించుకుపోయి.. దేశ ఆర్థిక వ్యవస్థకే ప్రమాదకరంగా మారనుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. గడిచిన మేలో రిటైల్ ద్రవ్యోల్బణం సూచీ 6.3 శాతానికి పెరిగి.. ఆరు మాసాల గరిష్ట స్థాయి వద్ద నమోదయ్యింది. ఇంతక్రితం ఏప్రిల్‌లో ఇది 4.23 శాతంగా చోటు చేసుకుంది.