Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నిరసనల నడుమ లక్షద్వీప్‌లో అడ్మినిస్ట్రేటర్ పర్యటన
- 'బ్లాక్‌డే' పాటించిన ఎస్‌ఎల్‌ఫ్
కొచ్చి : లక్షద్వీప్ అడ్మినిస్ట్రేటర్ ప్రఫుల్ ఖోడా పటేల్ సోమవారం లక్షద్వీప్‌కు చేరుకున్నారు. ఆయన రాకకు వ్యతిరేకంగా ఈ ద్వీపంలో నిర సనలు వెల్లువెత్తాయి. అలాగే నిరసనకారులు బ్లాక్ డే ను పాటించారు. సంస్కరణల పేరిట లక్షద్వీప్‌లో ప్రఫుల్ పటేల్ తీసుకొచ్చిన చర్యలు తీవ్ర వివాదాస్పదం అయిన విషయం విదితమే. అక్కడి రాజకీయపార్టీలు, సంస్థలు, ఇతర ప్రముఖులు ఈ చర్యలను వ్యతిరేకిస్తున్నారు. చివరకు బీజేపీ నాయకులు కూడా రాజీనామాలతో తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు. దాద్రానగర్ హవేలీ, డామన్-డయూలకు కూడా అడ్మినిస్ట్రేటర్ అయిన ప్రఫుల్ పటేల్.. తన వారం రోజుల పర్యటనలో భాగంగా మధ్యాహ్నం అగట్టికి చేరుకున్నారు. అనంతరం ఉన్నతాధికారులను కలుసుకొని వివిధ 'అభివృద్ధి' ప్రాజెక్టులపై పురోగతిని సమీక్షించారు. అయితే, ఆయన కొచ్చి మీదుగా లక్షద్వీప్‌కు వెళ్తారని అంతా భావించారు. ఇందులో భాగంగా ఈ ప్రజా వ్యతిరేక సంస్కరణలను వ్యతిరేకిస్తూ పటేల్‌ను కలవడానికి కేరళకు చెందిన ఇద్దరు కాంగ్రెస్ ఎంపీలు టీఎన్ ప్రతాపన్, హిబీ ఈడెన్‌లు కొచ్చి అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్లారు. కానీ, పటేల్ గోవా మార్గం గుండా వెళ్లడంతో ఇది కార్యరూపం దాల్చలేదు. పటేల్ చర్యలను వ్యతిరేకిస్తున్న వివిధ రాజకీయపార్టీలు, సంస్థల వేదిక అయిన సేవ్ లక్షద్వీప్ ఫోరం (ఎస్ఎల్ఎఫ్) కార్యకర్తలు నల్ల ముసుగులు ధరించారు. వారి ఇండ్లపై నల్ల జెండాలు ఎగురవేసి 'బ్లాక్ డే'ను పాటించారు. ''విచిత్రమైన, సామాజిక వ్యతిరేక, ప్రజా వ్యతిరేక సంస్కరణలను వెనక్కి తీసుకోవాలి'', ''ప్రఫుల్ పటేల్ గోబ్యాక్'' అంటూ ఎస్ఎల్ఎఫ్ కార్యకర్తలు నినాదాలు చేశారు. ''మన రాజ్యాంగంలో ప్రజాస్వామ్య విలువలు అత్యున్నత సిద్ధాంతాలు. వీటిపై దాడి జరిగితే అదే స్థాయిలో ఎస్ఎల్ఎఫ్ పోరాడుతుంది'' అని లక్షద్వీప్ ఎంపీ పీపీ మొహమ్మద్ ఫైజల్ అన్నారు. ''ఇకపై లక్షద్వీప్ ప్రజలు ఫాసిజాన్ని సహించరు'' అని పటేల్ విధానాలకు వ్యతిరేకంగా ఆందోళనలో ముందంజలో ఉన్న లక్షద్వీప్ చిత్ర నిర్మాత ఈషా సుల్తానా అన్నారు. ''మేం నిరంకుశ విధానాలకు వ్యతిరేకంగా నిలబడతాం. లక్షద్వీప్‌పై ఈ ముట్టడిని మేం ఎదుర్కొంటాం'' అని తెలిపారు.