Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నల్ల చట్టాలు రద్దుచేసేదాకా పోరు
- ఉద్యమాన్ని నీరుగార్చేలా బీజేపీ కుట్రలు... మడమతిప్పేదేలేదు : రైతుసంఘాలు
- హక్కుల పరిరక్షణకు ఉద్యమం : అశోక్ ధావలే
నల్ల చట్టాలను రద్దుచేయాలని కోరుతూ ఢిల్లీ సరిహద్దులో దీక్ష షురూ చేసి సోమవారానికి 200 రోజులైంది. కానీ మోడీ సర్కార్ మొండికేస్తూనే ఉన్నది.కార్పొరేట్ల చేతుల్లోకి సేద్యాని పెట్టే నిర్ణయాలకు వ్యతిరేకంగా పోరుబాట పట్టారు. ఈ ఉద్యమానికి కర్షకులు ఊపిరిపోసి.. ఏడునెలలకు చేరువవుతున్నా.. వెనక్కితగ్గటంలేదు. ఉద్యమాన్ని నీరుగార్చేలా బీజేపీ ప్రభుత్వం ఎన్ని ఎత్తుగడలేసినా..అన్నదాత మడమతిప్పేదేలేదంటున్నాడు. మీ వెంటే మేం.. అంటూ కరోనా సెకండ్వేవ్లోనూ రైతులు కదిలివస్తున్నారు. వారికి అండగా కార్మిక,ప్రజా సంఘాలు మమేకమవుతూనే ఉన్నాయి.
న్యూఢిల్లీ : రైతుల ఉద్యమం ఉధృతంగా కొనసాగుతుంది. కర్శకులకు మద్దతుగా సోమవారం కార్మికులు భారీ ర్యాలీ నిర్వహించారు. సోమవారం నాడు సీఐటీయూ ఆధ్వర్యంలో వేలాది మంది కార్మికులు సింఘు సరిహద్దుకు భారీ ప్రదర్శన చేపట్టారు. కిసాన్ మజ్దూర్ ఎక్తా జిందాబాద్ అంటూ నినాదాలతో కార్మికులు హోరెత్తించారు. సింఘు సరిహద్దుకు చేరుకున్న కార్మికులు ర్యాలీకి సంయుక్త కిసాన్ మోర్చా నేతలు స్వాగతం పలికారు. సీఐటీయూ హర్యానా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జై భగవాన్, ఉపాధ్యక్షులు ఆనంద్ శర్మ, కత్మచారి సంఘం ఉపాధ్యక్షులు రామ్ మాలిక్ తదితరులు పాల్గొన్నారు.
టిక్రీలో భారీ బహిరంగ సభ
టిక్రీ సరిహద్దు వద్ద జరిగిన భారీ బహిరంగ సభలో ఏఐకేఎస్ అధ్యక్షులు అశోక్ ధావలే మాట్లాడారు. ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణకు ఉద్యమించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. తమ ఆందోళనకు మద్దతిచ్చిన వారిపై బీజేపీ కక్షసాధింపు చర్యలకు పూనుకుంటున్నదనీ విమర్శించారు. ప్రభుత్వాన్ని విమర్శించిన వారిపై క్రూరమైన కేసులు బనాయిస్తున్నదని ఆరోపించారు. ప్రభుత్వం అరెస్టుచేసిన మానవ హక్కుల కార్యకర్తలు, మేధావులు, విద్యార్థులందరినీ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం యూఏపీఏ, ఎన్ఎస్ఏ, దేశద్రోహ చట్టం వంటి క్రూరమైన చట్టాల కింద 16 మందిని అరెస్టు చేశారు. భీమా కోరెగావ్ మానవ హక్కుల కార్యకర్తలు, జేఎన్యూ విద్యార్థులు, ఏఎమ్యూ, జామియా మిలియా, జర్నలిస్టులు, ఫిల్మ్ మేకర్స్, కార్టూనిస్టులు, ప్రభుత్వాన్ని విమర్శించిన వారిపై క్రూరమైన కేసులు బనాయించారని ఆరోపించారు. రైతుల ప్రస్తుత చారిత్రాత్మక పోరాటానికి పూర్తిగా మద్దతు ఇస్తూ, మోడీ-షా ప్రభుత్వం ఫాసిస్ట్, అధికార, మత, కార్పొరేట్ అనుకూల, ప్రజా వ్యతిరేక విధానాలను ఖండించారు. విచారణ లేకుండా, చార్జిషీట్లు కూడా లేకుండా అన్యాయంగా అరెస్టు చేసిన వారందరినీ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. జూన్ 26 'సేవ్ అగ్రికల్చర్, సేవ్ డెమోక్రసీ' దేశవ్యాప్తంగా ఎస్కేఎం పిలుపును విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. జూన్ 26న రైతు పోరాటం ఏడు నెలలు పూర్తి అవుతుందనీ, అలాగే అదే రోజున 1975లో అత్యవసర పరిస్థితిని ప్రకటించారని తెలిపారు. ఆ రోజున ప్రస్తుత అప్రకటిత అత్యవసర పరిస్థితులకు వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు. భారీ వర్షం పడినప్పటికీ వందలాది మంది మహిళ రైతులు హాజరయ్యారు. ఈ బహిరంగ సభలో బీకేయూ అధ్యక్షుడు జోగిందర్ సింగ్ ఉగ్రహాన్ అధ్యక్షత వహించారు. షాహీద్ భగత్ సింగ్ మేనల్లుడు, ప్రొఫెసర్ జగ్మోహన్ సింగ్, ప్రముఖ రచయితలు, నాటక రచయితలు డాక్టర్ సుఖ్దేవ్ సింగ్ సిర్సా, డాక్టర్ సాహిబ్ సింగ్, నవసరన్ కౌర్, గుల్జార్ పాంధర్, జస్పాల్ మంఖేరా, ఎన్ కె జీత్, ఏఐకేఎస్ ఆర్థిక కార్యదర్శి పి కష్ణ ప్రసాద్ తదితరులు హాజరయ్యారు.
200వ రోజు కొనసాగిన రైతు ఆందోళన
మూడు రైతు వ్యతిరేక చట్టాలు రద్దు చేయాలనీ, కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేస్తూ దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో జరుగుతున్న రైతుల ఉద్యమం ఉధతంగా కొనసాగుతుంది. ఆందోళనల్లో భాగస్వామ్యం అయ్యేందుకు భారీగా అన్నదాతల కదులుతున్నారు. వివిధ రాష్ట్రాల నుంచి వేలాది మంది రైతులు సరిహద్దులకు చేరుకుంటున్నారు. గత కొన్ని రోజులుగా ప్రతిరోజూ భారీగా రైతులు సరిహద్దులకు చేరుకుంటున్నారు. రైతు ఉద్యమం సోమవారం నాటికి 200వ రోజుకు చేరింది. సింఘు, టిక్రీ, ఘాజీపూర్, షాజాహన్పూర్, పల్వాల్ సరిహద్దుల్లో వేలాది రైతులు ఆందోళనల్లో వందలాది మంది రైతులు భాగస్వామ్యం కొనసాగుతుంది.