Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సుప్రీంకోర్టు చెప్పినా పట్టించుకోని కేంద్రం
- పౌర సేవా కేంద్రాల ద్వారా వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్లు 3 లక్షలు
- మొత్తం రిజిస్ట్రేషన్లలో ఇది 0.5శాతం..
- పెరుగుతున్న అసమానతలు : రాజకీయ విశ్లేషకులు
గ్రామాలు, పట్టణాలు, నగరాలు..అనే తేడా లేకుండా కరోనా రెండోవేవ్ భారత్‌లో విజృంభిస్తోంది. ఎంతోమంది ప్రాణాల్ని బలితీసుకుంది. వ్యాక్సిన్ తీసుకోవాలని ఎంత ప్రయత్నించినా కోవిన్ వెబ్‌పోర్టల్‌లో స్లాట్ దొరకటం లేదు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల పరిస్థితి మరింత దయనీయం. జూన్ 12నాటికి మొత్తం వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్లు 28.5కోట్లుకాగా, ఇందులో గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చినవి 3లక్షలు మాత్రమే (0.5శాతం) ఉన్నాయని లెక్కతేలింది. ఈ గణాంకాలు మనదేశంలో వ్యాక్సిన్ అసమానతల్ని చూపుతోందని, ఇకనైనా మనం జాగ్రత్తపడాలని రాజకీయ విశ్లేషకులు సూచిస్తున్నారు.
న్యూఢిల్లీ : కరోనా వ్యాక్సిన్ తీసుకోవాలంటే కచ్చితంగా 'కోవిన్' వెబ్‌పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందే. ఇంటర్నెట్ సౌకర్యం, స్మార్ట్‌ఫోన్ వినియోగం తెలియని గ్రామీణ ప్రజల సంగతేంటి? అని సుప్రీంకోర్టు నెలరోజుల క్రితం కేంద్రాన్ని ప్రశ్నించింది. గ్రామీణ ప్రజలు, నిరక్షరాస్యులు..సైతం వ్యాక్సిన్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకునేలా చర్యలు తీసుకోవాలని సుప్రీం ఆదేశించింది. ఈనేపథ్యంలో వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్ సౌకర్యాన్ని విస్తరిస్తున్నట్టు తెలిపింది. ఈసేవా, మీసేవా, పౌర సేవా కేంద్రాల (సీఎస్సీ) ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చునని కేంద్రం ఒక ప్రకటనలో తెలిపింది. అయితే ఇది అమల్లోకి వచ్చినప్పటికీ..గ్రామీణ ప్రాంతాలవారికి వ్యాక్సినేషన్ అందుబాటులోకి రాలేదని ఆరోపణలున్నాయి. సీఎస్సీ కేంద్రాల ద్వారా నమోదైన వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్లు 3లక్షలు మాత్రమేనని ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి.
కోవిన్ పోర్టల్‌లో ఇప్పటివరకూ (జూన్ 12నాటికి) వ్యాక్సిన్ పొందటానికి జరిగిన రిజిస్ట్రేషన్లు 28.5కోట్లు. పట్టణాలు, నగరాల్లో ఉన్నవారు ఎక్కువగా స్మార్ట్ఫోన్ల ద్వారా స్లాట్ బుక్ చేసుకుంటున్నారు. ఇంటర్నెట్, డిజిటల్ సేవలు గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా లేకపోవటంతో అక్కడివారికి వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్ కష్టతరంగా మారింది. మే 11నాటికి దేశంలో 17కోట్లమంది రిజిస్ట్రేషన్ చేసుకోగా, ఇందులో గ్రామీణ ప్రాంతాలవారివి కేవలం 1.7లక్షలు ఉన్నాయి. అత్యంత తీవ్రమైన సంక్షోభం ముంగిట ఉన్న మనదేశంలో, వ్యాక్సినేషన్ కార్యక్రమం ఎంత నత్తనడకన సాగుతోందో దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు.
ఎందుకిలా?
ప్రధానంగా వ్యాక్సినేషన్ కార్యక్రమం పట్టణాలు, నగరాల్లోనే కేంద్రీకృత మైంది. కేంద్రం సరఫరా చేస్తున్న వ్యాక్సిన్ డోసులు సరిపోక..గ్రామాలకు పంపలేకపోతున్నామని రాష్ట్రాలు చెబుతున్నాయి. ఈసేవా, మీసేవా, పౌర సేవా కేంద్రాల వద్ద గంటల తరబడి నిలబడ్డా టోకెన్లు దొరకటం లేదని..దాంతో గ్రామాల్లో రిజిస్ట్రేషన్‌కు ముందుకు రావటం లేదని తేలింది. ఒకవేళ టోకెన్లు పొందినా...వారందరికీ వ్యాక్సిన్ డోసులు అందటం లేదు. ఏదో ఒక గ్రామంలో కొద్దిమందికి వ్యాక్సిన్ ఇచ్చేసి..అందరికీ ఇచ్చినట్టు పాలకులు ప్రచారం చేస్తున్నారని విమర్శలున్నాయి.