Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సెకండ్‌వేవ్‌లో యువత, థర్డ్‌వేవ్‌లో పిల్లలు.. కేవలం భయాందోళనలే !
- అందరూ జాగ్రత్తగా ఉండాలి: నిపుణులు
న్యూఢిల్లీ: దేశంలో కరోనా ప్రభావం పెరుగుతున్న నేపథ్యంలో అధిక ప్రభావం యువత, పిల్లలపై ఉన్నదనే అభిప్రాయం సర్వత్రా వినిపించింది. అయితే, ఇదంతా అపోహేనంటూ తాజా కరోనా డేటాతో స్పష్టమైంది. ఎందుకంటే మొదటి, సెకండ్ వేవ్ కరోనా డేటా ఈ విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తుంది. వివిధ వయస్సుల వారీగా కరోనా బారినపడిన వ్యక్తుల నిష్పత్తిలో గణనీయమైన మార్పు లేదు. కరోనా సెకండ్ వేవ్‌లో (మార్చి 15 నుంచి మే 25వరకు) కరోనా సోకిన వారిలో 22.7 శాతం మంది 31-40 ఏండ్ల సమూహంలో ఉన్నారు. అదే, మొదటి వేవ్‌లో (గతేడాది జులై నుంచి డిసెంబర్ మధ్య) ఇదే సమూహంలో కరోనా సోకినవారు 21.2 శాతం మంది ఉన్నారు. స్వల్పంగానే పెరుగుదల ఉంది. గతేడాది అత్యధికంగా ప్రభావితమైన 21-30 ఏండ్ల సమూహంలో కరోనా సోకిన వారు 21.2 శాతం ఉన్నారు. సెకండ్ వేవ్‌లో ఈ సమూహంలోని వారు 22.5 శాతంగా ఉన్నారు. వీరి తర్వాత మొదటి, సెకండ్ వేవ్‌లలో 41-50 వయస్సు సమూహంలోని వారు 17.3 శాతంగా ఉన్నారు.
అలాగే, ఒకటి నుంచి పదేండ్ల సమూహంలో ఉన్నవారు మొదటివేవ్లో 3.3 శాతంగా, సెకండ్ వేవ్‌లో 3 శాతంగా ఉన్నారు. అంటే మొదటి, సెకండ్‌వేవ్‌లో కరోనా సోకిన చిన్నారుల గణాంకాల్లో పెద్దగా మార్పులేదు. 11-20 ఏండ్లలోపు వారు మొదటివేవ్లో 8 శాతం, సెకండ్ వేవ్‌లో 8.6 శాతం ఉన్నారు. 61-70 ఏండ్ల సమూహంలో మొదటి వేవ్‌లో 9.1శాతం, సెకండ్‌వేవ్‌లో 8.2 శాతం మంది ఉన్నారు. మొత్తంగా మొదటి, సెకండ్‌వేవ్ గణాంకాలు యువత, పిల్లలపై అధిక ప్రభావం ఉందనేది నిజం కాదని స్పష్టం చేస్తున్నాయి. అన్ని వయస్సుల వారిపై కరోనా ప్రభావం ఉంటుందనీ, అందరూ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
దీనిపై కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ మాట్లాడుతూ.. వయస్సుల వారీగా కరోనా ప్రభావంపై ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి. ఎక్కువగా యువతపై సెకండ్‌వేవ్ ప్రభావం చూపిందనీ, రాబోయే థర్డ్‌వేవ్‌లో పిల్లలపై పంజా విసురుతుందనే భయాలు నెలకొన్నాయి. ఇది వాస్తవం కాదనీ ప్రస్తుత డేటా స్పష్టం చేస్తోందన్నారు. ప్రతిఒక్కరూ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. ప్రస్తుత కరోనా ఆయుధం టీకా ఒక్కటేననీ, అందరూ తీసుకోవాలని కోరారు. కాగా, దేశంలో ఇప్పటివరకు మొత్తం 26 కోట్ల టీకా డోసులు వేయగా, అందులో 17.2 కోట్ల మంది 45 ఏండ్లకు పైబడిన వారు ఉన్నారు. 18-44 ఏండ్ల మధ్య వారికి 4.5 కోట్ల టీకా డోసులు అందించారు.