Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఫిచ్ ప్రతికూల రేటింగ్
- మూడో రోజూ మార్కెట్లో నష్టాలు
న్యూఢిల్లీ : దేశంలోని అనేక నౌకాశ్రయాలను తన గుప్పిట్లో పెట్టుకుంటున్న అదానీ గ్రూపునకు చెందిన అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్స్ లిమిటెడ్ (ఏపీఎస్‌ఈజడ్)కు ఎదురుదెబ్బ తగిలింది. ఆ కంపెనీ పరపతికి కోత పెడుతున్నట్టు ఫిచ్ రేటింగ్స్ ప్రకటించింది. దీర్ఘకాలిక పరపతి సామర్థ్యంపై 'బీబీబీ మైనస్' ప్రతికూల రేటింగ్‌ను ఇచ్చింది.
ఇంతక్రితం ఇది 'బీబీబీ'గా ఉంది. ఈ కంపెనీకి దీర్ఘకాలిక విదేశీ రుణాల చెల్లింపు కష్టమయ్యే అవకాశం ఉందని ఫిచ్ అనుమానాలు వ్యక్తం చేసింది. అదే జరిగితే విదేశీ మారక ద్రవ్య రుణాల సేకరణపై తీవ్ర ప్రభావం చూపుతుందని సంకేతాలు ఇచ్చింది.
గుజరాత్, అహ్మాదాబాద్ కేంద్రంగా పని చేస్తోన్న అదానీ గ్రూప్‌లో భాగమైన ఏపీఎస్‌ఈజడ్ రాజకీయ, ఆర్థిక బలంతో 2014 నుంచి అనేక పోర్టులను స్వాధీనం చేసుకుంటూ వస్తోంది. అదే ఏడాది తొలిసారి ఒడిస్సాలోని ధమ్రా పోర్టును కొనుగోలు చేసింది. 2018లో చెన్నరు సమీపంలోని కట్టుపల్లి పోర్టును ఎల్‌అండ్‌టి నుంచి రూ.1,950 కోట్లతో కొనేసింది. గడిచిన ఫిబ్రవరిలో మహారాష్ట్రలోని డిఘి పోర్టును స్వాధీనం చేసుకుంది. ఏడాది కాలంలో ఆంధ్రప్రదేశ్‌లోని గంగవరం పోర్టు, కష్ణపట్నం పోర్టును స్వాధీనం చేసుకుంది. గడిచిన ఐదారు మాసాల్లోనే మూడు అతిపెద్ద స్వాధీనాలు చేపట్టింది. దీంతో ఈ రంగంలో గుత్తాధిపత్యాన్ని పెంచుకుంటున్న విషయం తెలిసిందే.
అదానీ పోర్ట్స్ దీర్ఘకాలిక వ్యాపార అవకాశాలపైనా తాజాగా ఫిచ్ రేటింగ్స్ అనుమానాలు వ్యక్తం చేసింది. కంపెనీ ప్రకటిస్తున్న వ్యాపార అవకాశాల లక్ష్య సాధన అంత తేలిగ్గా నెరవేర లేదని విశ్లేషించింది. సరుకుల ఎగుమతి, దిగుమతి లక్ష్యంపైనా అనేక అనుమానాలు వ్యక్తం చేసింది.
వెంటాడుతున్న హవాలా భయాలు..!
గౌతం అదానీ కంపెనీల్లో డొల్ల సంస్థల పెట్టుబడుల వార్తలతో మూడో రోజూ అదానీ గ్రూపు కంపెనీల షేర్లు నేల చూపులు చూశాయి. అదానీ కంపెనీల్లో రూ.43,000 కోట్ల పెట్టుబడులు పెట్టిన మారిషస్‌కు చెందిన ఒకే చిరునామా కలిగిన మూడు విదేశీ కంపెనీల ఖాతాలను స్తంబింపజేయలేదని నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్ (ఎన్ఎస్డీఎల్) ప్రకటించినప్పటికీ మదుపర్లలో విశ్వాసం కలగలేదు. దీంతో బుధవారం సెషన్లోనూ బీఎస్ఈలో అదానీ ఎంటర్ప్రైజెస్ షేర్ 5.77 శాతం లేదా రూ.88.75 పతనమై రూ.1,449.30కు పడిపోయింది. అదానీ పవర్ సూచీ 4.97 శాతం క్షీణించి రూ.127.25 వద్ద ముగిసింది. అదానీ ట్రాన్స్మిషన్ సూచీ 5 శాతం నష్టంతో రూ.1,369.35కు పడిపోయింది. అదానీ గ్రీన్ ఎనర్జీ 3.10 శాతం కోల్పోయి రూ.1,171.25 వద్ద, అదానీ పోర్ట్స్ 7.17 శాతం నష్టంతో రూ.706.85కు, అదానీ టోటల్ గ్యాస్ సూచీ 5 శాతం పతనంతో రూ.1,394 వద్ద ముగిశాయి. గడిచిన మూడు సెషన్లలో ఈ సూచీలు 16 శాతం వరకు నష్టపోయాయి.