Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: దేశంలో ఇంధన ధరలు రికార్డు స్థాయిలో పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే భారీగా పెరిగిన చమురు ధరలతో గగ్గొలు పెడుతున్న వాహనదారుల నడ్డి విరుస్తూ.. మళ్లీ ధరలు పెంచి చమురు కంపెనీలు షాక్ ఇచ్చాయి. లీటరు పెట్రోల్‌పై 25 పైసలు, డీజిల్‌పై 15 పైసల వరకు పెంచాయి. దీంతో దేశంలోని చాలా రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. మే 4 నుంచి ఇప్పటివరకు మొత్తంగా 26 సార్లు చమురు ధరలు పెరిగాయి. అప్పటి నుంచి బుధవారం వరకు చమురు కంపెనీలు లీటరు పెట్రోల్ పై రూ.6.34, డీజిల్‌పై రూ.6.63 వరకు పెంచాయి. దీంతో ప్రస్తుతం దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో లీటరు పెట్రోల్ ధర రూ.102.08, లీటరు డీజిల్ ధర రూ.94.84కు పెరిగింది. దేశ రాజధాని ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ.96.66, డీజిల్ ధర రూ.87.41కి చేరింది. దేశంలోనే అత్యధికంగా రాజస్థాన్‌లోని శ్రీగంగానగర్‌లో లీటర్ పెట్రోల్రూ.107.79, లీటర్ డీజిల్రూ.100.51గా ఉంది. కోల్‌కతాలో లీటరు పెట్రోల్ ధర రూ.96.58, డీజిల్ ధర రూ.90.25కు చేరింది. చెన్నైలో లీటర్ పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా రూ.97.91, రూ.92.04కు పెరిగాయి. బెంగళూరులో లీటరు పెట్రోల్ ధర రూ.99.89, డీజిల్ రూ.92.66గా ఉంది. ఇదివరకే చమురు ధరల పెంపుతో దేశంలోని చాలా రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. తాజా పెంపుతో ఇంధన ధరలు కొత్త రికార్డుల నెలకోల్పుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పలుచోట్ల లీటరు పెట్రోల్ ధర సెంచరీ దాటింది. ఇదిలా ఉండగా, అంతర్జాతీయంగా రికవరీ డిమాండ్ కారణంగా చమురు ధరలు బుధవారం పెరిగాయి. ప్రస్తుతం బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 74.68 డాలర్లుకు చేరింది. మంగళవారంతో పోలిస్తే 0.9శాతం పెరిగింది. కాగా, పెరుగుతున్న ఇంధన ధరలు భారత టోకు ద్రవ్యోల్బణాన్ని మే నెలలో 12.94 శాతానికి పెంచాయి. ఏప్రిల్ నెలతో పోలిస్తే మే నెలలో డబ్ల్యూపీఐ సూచిలో నెలవారీ మార్పు 0.76 శాతంగా ఉంది. ఇంధన, విద్యుత్ విభాగంలో మేలో 37.61 శాతం పెరుగుదల నమోదైంది. ఏప్రిల్ నెలలో ఇది 20.94 శాతంగా ఉంది. తయారీ వస్తువులలో ద్రవ్యోల్బణం మే నెలలో 10.83 శాతానికి పెరిగింది. అంతకుముందు నెలలో ఇది 9.01 శాతంగా ఉంది.