Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బ్యాంకులను మోసం చేసిన రుచి గ్లోబల్
- కంపెనీ డైరెక్టర్లపై సీబీఐ కేసు నమోదు
న్యూఢిల్లీ : బ్యాంకులను బురిడి కొట్టించి కోట్లను కాజేసిన సంస్థల జాబితాలో మరో సంస్థ చేరింది. ముంబయికి చెందిన రుచి గ్లోబల్ లిమిటెడ్ అనే సంస్థ నాలుగు బ్యాంకులతో కూడిన కన్సార్టియంను మోసగించి రూ.188.35 కోట్ల మేరకు ఎగనామం పెట్టింది. దీంతో ఆ సంస్థ డైరెక్టర్లపై కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) బుధవారం కేసు నమోదు చేసింది. కంపెనీ అసోసియేట్ సంస్థ రుచి సోయా ఇండిస్టీస్ లిమిటెడ్ 21 సంస్థల కన్సార్టియంతో కలిసి మొత్తం రూ.8,323 కోట్లను రుణంగా తీసుకుంది. 2018 ఆగస్టులో ఈ ఖాతాను మోసపూరితమైనదిగా ప్రకటించి, ఐడీబీఐ బ్యాంక్ (ఇండోర్) సీబీఐకి ఫిర్యాదు చేసింది. ఎఫ్ఐఆర్లో రుచి గ్లోబల్ లిమిటెడ్‌తో పాటు ఉమేష్ షాహ్రా, ఇండోర్ వాసులు సాకేత్ బరోడియా, అశుతోష్ మిశ్రాలను నిందితులుగా పేర్కొన్నారు. రుచి గ్రూప్ ఆఫ్ ఇండిస్టీస్కు ఈ కంపెనీ అనుబంధ సంస్థగా పనిచేస్తోంది. లోహాలు, ఖనిజాలు, పప్పు ధాన్యాలు, తృణ ధాన్యాల టోకు వ్యాపారాలు చేస్తోంది. బ్యాంక్ ఆఫ్ బరోడా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, జమ్మూ కాశ్మీర్ బ్యాంక్, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్‌ల నుండి ఈ కంపెనీ రుణాలు తీసుకుంది. బకాయిలను చెల్లించకపోవడంతో ఆ ఖాతాను నిరర్ధక ఆస్తిగా ప్రకటించారు. పలు కంపెనీలతో వ్యాపార లావాదేవీల సాకుతో నిధులు మళ్లించడంతో సహా పలు ఆర్థిక అవకతవకలకు పాల్పడినట్లు ఫోరెన్సిక్ ఆడిట్లో వెల్లడైంది. ఈ కంపెనీల్లో చాలావాటికి ఒకే అడ్రస్ వుంది. ఆ సంస్థల డైరెక్టర్లు కొంతమంది రుచి గ్లోబల్ లిమిటెడ్ ఉద్యోగులుగా తేలారని ఎఫ్ఐఆర్ పేర్కొంది. ఆ గ్రూపులోని మరో కంపెనీ ఆర్ఎస్ఎఎల్ స్టీల్ ప్రైవేట్ లిమిటెడ్ ఖాతాను కూడా 2019 మార్చిలో మోసపూరితమైనదిగా ప్రకటించినట్టు ఎఫ్ఐఆర్ పేర్కొంది. సీబీఐ వద్ద ఫిర్యాదు కూడా దాఖలైంది. ఆ కేసులో రూ.49.43 కోట్ల వరకు బకాయిలు పేరుకుపోయాయి.