Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కోవీషీల్డ్ వ్యవధి రెట్టింపుపై ఎన్టీఏజీఐ ప్యానెల్ మెంబర్స్
- శాస్త్రీయమైన డేటా ఆధారంగానే నిర్ణయం : కేంద్రం
న్యూఢిల్లీ: కరోనా టీకా కోవీషీల్డ్ డోసుల వ్యవధిని రెట్టింపు చేయాలని మేం చేప్పలేదని తాము సిఫారసు చేయలేదని నేషనల్ టెక్నాలజీ అడ్వైజరీ గ్రూప్ ఆన్ ఇమ్యూనైజేషన్ (ఎన్టీఏజీఐ)కు చెందిన పలువురు సభ్యులు ఓ జాతీయ మీడియాకు తెలిపారు. 8-12 వారాలకు మాత్రమే పెంచాలని తాము సిఫారసు చేశామని తెలిపారు. కానీ 12-16 వారాలకు పెంచుతూ ప్రభుత్వమే నిర్ణయం తీసుకుందని ఎన్టీఏజీఐ సభ్యులు కొందరు వెల్లడించారు. దీనిపై మీడియాల్లో విస్తృతంగా కథనాలు వస్తున్నాయి. అయితే, టీకాల డిమాండ్ అనుగుణంగా వ్యాక్సిన్ల సరఫరా లేకపోవడం, దేశవ్యాప్తంగా కేసులు భారీగా పెరుగుతున్న తరుణంలో కేంద్రం ఈ నిర్ణయం ప్రకటించడం గమనార్హం. బ్రిటన్ నుంచి వచ్చిన డేటా అధారంగా డోసుల వ్యవధిని ఎన్టీజీఐ సిఫారసు చేసింది. మొత్తం 14మంది ప్రధాన సభ్యులతో ఉన్న ఈ ప్యానెల్లో ముగ్గురు సభ్యులు ''డోసుల మధ్య వ్యవధిని పెంచడానికి సిఫారసు చేసేందుకు అవసరమైన డేటా లేదని'' తెలిపారు. ఇదే విషయంపై నేషనల్ హెల్త్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎపిడెమియాలజీ మాజీ డైరెక్టర్ ఎండీ. గుప్తే మాట్లాడుతూ.. ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచనలతో కోవీషీల్డ్ డోసుల మధ్య వ్యవధిని 8-12 వారాలకు పెంచడానికి ఎన్టీజీఐ సిఫారసు చేసింది కానీ వ్యవధిని పెంచడం, దాని ప్రభావానికి సంబంధించి ఈ బృందం వద్ద ఎటువంటి డేటా లేదని అన్నారు.డోసుల వ్యవధి పెంపు నిర్ణయం వివాదాస్పదం కావడంతో పాటు దేశవ్యాప్తంగా కొత్త చర్చకు తెరలేపింది. డోసుల మధ్య వ్యవధి పెంచితే ప్రయోజనం ఉంటుందనే దానిపై ఎటువంటి డేటా లేకుండానే ఈ నిర్ణయం ఎలా తీసుకుంటారని ప్రభుత్వంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. వ్యాక్సిన్ల కొరత కారణంగానే కోవీషీల్డ్ డోసుల వ్యవధిని ప్రభుత్వం పెంచిందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. కొత్త వేరియంట్లు తీవ్రంగా విజృంభిస్తున్న ప్రభుత్వ స్పందన అంతంతమాత్రంగానే ఉందని ప్రతిపక్షాలతో పాటు వైద్యారోగ్య నిపుణులు, పరిశోధకులు పేర్కొంటుండటం గమనార్హం. డోసుల మధ్య వ్యవధి అంశం వివాదాస్పదం కావడం, కేంద్రంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతుండటంతో తాజాగా ప్రభుత్వం దీనిపై వివరణ ఇచ్చింది. శాస్త్రీయపరమైన డేటా ఆధారంగానే వ్యాక్సిన్ డోసుల మధ్య వ్యవధిని పెంచామని కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ తెలిపారు. అత్యంత ముఖ్యమైన విషయాలను సైతం రాజకీయం చేయడం దురదృష్టకరమంటూ ఆయన ట్వీట్ చేశారు. అలాగే, ఎన్టీఏజీఐ చైర్మెన్ డాక్టర్ ఎస్కే. అరోరా సైతం ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. శాస్త్రీయత ఆధారంగా టీకా డోసుల మధ్య వ్యవధి పెంపు నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. దీనిపై మీడియాలో వస్తున్న కథనాలను ఆయన ఖండించారు.