Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఫిర్యాదులకు సిద్ధమైన సీఎం
- యడ్డి అసమ్మతి వర్గం..
- రాజీకి యత్నిస్తున్న అధిష్టానం
బెంగళూరు : కర్నాటక ముఖ్యమంత్రి యడియూరప్పపై అసమ్మతి వర్గం రగిలిపోతోంది. రాష్ట్ర బీజేపీ ఇన్చార్జి అరుణ్‌సింగ్ బెంగళూరు పర్యటన నేపథ్యంలో సీఎంపై ఫిర్యాదుల వర్షం కురిపించేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో అసమ్మతి వర్గంతో చర్చలు జరిపేందుకు బీజేపీ అధిష్టానం యత్నిస్తోంది. బుధవారం కోర్‌కమిటీ సమావేశంలో అరుణ్‌సింగ్ అసమ్మతి నేతలతో చర్చించనున్నారు. ఉత్తరప్రదేశ్‌లో మాదిరిగా వరుసగా పలు సమీక్ష సమావేశాలను ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం.
కొంతమంది బీజేపీ ఎమ్మెల్యేలు బహిరంగంగానే యడియూరప్పపై విమర్శలకు దిగుతున్నారు. వీరిలో గతంలో యడియూరప్ప సన్నిహితులుగా వ్యవహరించిన కెఎస్.ఈశ్వరప్ప ఒకరు. శివమొగ్గ జిల్లా నుండి ఎమ్మెల్యేగా గెలుపొందిన ఈశ్వరప్ప.. సీఎం క్యాబినెట్లో గ్రామీణాభివృద్ధి మంత్రిగా వ్యవహరిస్తున్నారు. తన వ్యవహారాల్లో సీఎం జోక్యం చేసుకుంటున్నారంటూ గవర్నర్ వాజుభారు వాలాకు ఇటీవల ఈశ్వరప్ప ఫిర్యాదు చేశారు. యడియూరప్ప తన అధికార హోదాను చూపిస్తున్నారంటూ ఆ లేఖలో ఘాటుగా విమర్శించారు. జాతీయ నేత అయిన అరుణ్‌సింగ్‌కు తమ ఫిర్యాదులను తెలుపుతామనీ.. అనంతరం ఆయన ఎటువంటి నిర్ణయం తీసుకున్నా.. దానికి తామంతా కట్టుబడి ఉంటామని ఈశ్వరప్ప పేర్కొన్నారు. ''అరుణ్ సింగ్ జాతీయ నేత. అందరి అభిప్రాయాలనూ వింటారు. తుది నిర్ణయం తీసుకుంటారు. పార్టీ కార్యకర్తలందరూ క్రమశిక్షణతో ఉంటారు'' అని ఈశ్వరప్ప అన్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పూర్తి మెజారిటీని సాధించలేదనీ.. కేవలం 104 స్థానాలు మాత్రమే గెలుచుకున్నదని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందనీ, ఆ గందరగోళం ఇంకా కొనసాగుతూనే ఉన్నదన్నారు. అనంతరం 17 మంది జనతాదళ్ సెక్యులర్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరారని అన్నారు.
అయితే అధిష్టానం యడియూరప్పకు అనుకూలంగా ఉన్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. ఇటీవల యడియూరప్పను ప్రశంసిస్తూ.. అరుణ్‌సింగ్ ఫోన్ చేసినట్టు సమాచారం. కరోనా సంక్షోభాన్ని అరికట్టడంలో సీఎం చేసిన కృషి ప్రశంసనీయమని, అందరు మంత్రులు, పార్టీ అందరూ సమిష్టిగా ఈ సంక్షోభాన్ని ఎదుర్కొన్నారని అరుణ్‌సింగ్ పేర్కొన్నట్టు తెలుస్తోంది. అలాగే సీఎంగా యడియూరప్ప తన పదవీకాలాన్ని పూర్తి చేస్తారని హామీ ఇచ్చినట్టు సమాచారం. కాగా, లింగాయత్ నేత కర్నాటకలో మొదటిసారిగా ముఖ్యమంత్రిగా పూర్తికాలం కొనసాగడం పార్టీకి లాభం చేకూరుతుందని బీజేపీ భావిస్తోంది. అలాగే అరుణ్‌సింగ్ ప్రశంసలు కొత్త ఉత్సాహాన్నిచ్చాయనీ, తన పదవీకాలం పూర్తయ్యేలోపు రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా నడిపించేందుకు కృషి చేస్తానని యడియూరప్ప పేర్కొన్నారు. అంటే అధిష్టానం తనపై విశ్వాసం కలిగిఉందన్న ధీమాతోనే.. అధిష్టానం తనను రాజీనామా చేయమని ఆదేశిస్తే.. వెంటనే పదవికి రాజీనామా చేస్తానని ఇటీవల యడియూరప్ప ప్రకటించినట్టు విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు యడియూరప్ప ముఖ్యమంత్రిగా ఎక్కువకాలం కొనసాగలేరంటూ గతేడాది బీజేపీ నేత బసన్‌గౌడ పాటిల్ యత్నాల్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.