Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ . మూడు రైతు వ్యతిరేక చట్టాలు రద్దు చేయాలనీ, కనీస మద్దతు ధరకు చట్ట బద్ధత కల్పించాలని డిమాండ్ చేస్తూ దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో జరుగుతున్న రైతుల ఉద్యమం ఉధృతంగా కొనసాగుతుంది. ఆందోళనల్లో భాగస్వామ్యం అయ్యేందుకు అన్నదాతలు వివిధ రాష్ట్రాల నుంచి భారీగా తరలివస్తున్నారు. రైతు ఉద్యమం బుధవారం నాటికి 202వ రోజుకు చేరింది. సింఘూ, టిక్రీ, ఘాజీపూర్, షాజాహన్ పూర్, పల్వాల్ సరిహద్దుల్లో వేలాది మంది రైతులు ఆందోళనల్లో పాల్గొన్నారు.
మరోవైపు వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతు ధరలను పొందడానికి వివిధ రాష్ట్రాల్లో స్థానిక ఆందోళనలు కొనసాగిస్తున్నారు. తెలంగాణలోని జొన్న రైతుల ఆందోళన జరగగా, మహారాష్ట్రలో పాల రైతులు కూడా ఆందోళనలు సాగిస్తున్నారు.
ఎక్కువ మంది నిరసనకారులు ఢిల్లీ సరిహద్దుల్లో వేర్వేరు వేదికలకు చేరుకొని నిరసన శిబిరాలను ఏర్పాటు చేసుకుంటున్నారు.
బీకేయూ తికాయత్ ఆధ్వర్యంలో రైతులు భారీగా ఉత్తర ప్రదేశ్‌లోని బులంద్‌షహర్ నుంచి ఘాజీపూర్ సరిహద్దుకు బయలుదేరారు. 90 కిలోమీటర్లపైగా కాలినడకన రైతులు ఘాజీపూర్ కు పాదయాత్రలో తరలివస్తుండటం విశేషం. డెమొక్రటిక్ టీచర్స్ ఫ్రంట్ ఆఫ్ పంజాబ్ ఆధ్వర్యంలో వేలాది మంది ఉపాధ్యాయులు బుధవారం టిక్రీ సరిహద్దుకు చేరుకున్నారు. అలాగే అనేక ప్రాంతాల్లో కార్పొరేట్ వర్గాల అవుట్ లెట్లు, టోల్ ప్లాజాలు, ఇతర ప్రదేశాలలో స్థానిక నిరసనలు కొనసాగుతున్నాయి. పంజాబ్‌లో 100కి పైగా ప్రదేశాలలో ఇటువంటి ఆందోళనలు కొనసాగుతున్నాయి. చాలా చోట్ల ఆందోళనలు 250 రోజులకు పైగా పూర్తి చేసుకున్నాయని రైతు నేతలు తెలిపారు. హర్యానాలోని జింద్ జిల్లాలో ఖాట్కర్ టోల్ ప్లాజా వద్ద జరుగుతున్న ఆందోళనలో రైతు మరణించారు.