Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మొత్తం 27 కమిటీల్లో.. మూడింటిలో చోటు
- రిజర్వేషన్ ప్రకారం చూసినా.. 8 కమిటీల్లో ఉండాలి : రాజకీయ విశ్లేషకులు
- పార్లమెంట్లో వారి అధికారాన్ని, ప్రభావాన్ని పరిమితం చేస్తున్న మోడీ సర్కార్
న్యూఢిల్లీ : ప్రస్తుత 17వ లోక్‌సభలో సభ్యుల సంఖ్య 543. ఇందులో ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాలకు చెందిన ఎంపీల సంఖ్య 138. మొత్తం సభ్యుల్లో వీరి సంఖ్య 25.4శాతమని గణాంకాలు చెబుతున్నాయి. అయితే ఇదే నిష్పత్తిలో పార్లమెంట్ స్టాండింగ్ కమిటీల్లో ఎస్సీ, ఎస్టీ ఎంపీలకు చోటు దక్కుతుందా? అంటే..లేదనే చెప్పాలి. మొత్తం 27 పార్లమెంట్ కమిటీల్లో ఎస్సీ, ఎస్టీ ఎంపీలున్న కమిటీలు మూడు మాత్రమే. ఈనేపథ్యంలో పార్లమెంట్ కమిటీల్లో ఎస్సీ, ఎస్టీలకు సరైన ప్రాతినిథ్యం ఉండటం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 15వ(2009-14), 16వ(2014-19) లోక్‌సభా కాలంలోనూ ఎస్సీ, ఎస్టీ ఎంపీలకు కమిటీల్లో చోటు దక్కలేదని గణాంకాలు చెబుతున్నాయి. పార్లమెంట్‌పై పలు నివేదికలు రూపొందించే 'మాధ్యం' అనే సంస్థ వ్యవస్థాపకురాలు మానసీ వర్మా పై సమాచారాన్ని మీడియాకు విడుదల చేశారు. పార్లమెంట్లో ఎస్సీ, ఎస్టీ ఎంపీల పని, వారి ప్రభావం, అధికారాన్ని మోడీ సర్కార్ తగ్గించిందని, కొన్ని అంశాలకే వారిని పరిమితం చేసిందని ఆమె ఆరోపించారు. ఈ దేశంలో అణచివేత, వివక్షకు గురవుతున్న వర్గాల ప్రతినిధులు లేకుండా ప్రభుత్వ విధానాలు తీసుకురావటం సరైంది కాదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
కొత్త చట్టాల రూపకల్పన, పాత చట్టాల సవరణ, ప్రభు త్వ విధానాలపై సమీక్ష.. మొదలైనవాటిలో ఎస్సీ,ఎస్టీ ఎంపీ ల పాత్ర లేకపోతే సరైన ఫలితాలు రావని, పార్ల మెంటరీ రాజకీయాల్ని ఇది పరిపూర్ణం చేయదని విశ్లేషకులు భావిస్తు న్నారు. పార్లమెంట్లో మొత్తం కమిటీలు 27కాగా, ఇందులో కనీసం 8 కమిటీల్లో (రిజర్వేషన్ల నిష్పత్తి ప్రకారం) ఎస్సీ, ఎస్టీ ఎంపీలను ఎంపికచేయాలి.
అయితే గత ఏడుదశాబ్దాల పార్లమెంట్ చరిత్రలో ఏనాడూ కమిటీల ఎంపిక న్యాయ బద్ధంగా, చట్టబద్ధంగా లేదని విశ్లేషకులు చేబుతున్నారు.
అత్యంత కీలకం!
మనదేశంలో అత్యున్నత చట్టసభ పార్లమెంట్. దేశ రాజకీయాలకు, ప్రభుత్వ పాలనకు కేంద్రం. కొత్త చట్టాలు చేయాలన్నా, పాత చట్టాల్ని సవరించాలన్నా..అంతా ఇక్కడే. ప్రభుత్వ విధానాలు ఎలా అమలవుతున్నాయి? ప్రభుత్వ వ్యయం పారదర్శకమేనా? లేదా? అన్నది కూడా పార్లమెంటే పరిశీలన చేయాలి. ఇందుకోసం ఏర్పాటుచేసుకున్న వ్యవస్థ 'పార్లమెంట్ కమిటీ'లు. 24 ప్రభుత్వ శాఖల్లో అనేక కమిటీలను పార్లమెంట్ నియమిస్తుంది. ప్రభుత్వ విధానాల లోపాల్ని సరిచేసుకునే వ్యవస్థ 'పార్లమెంటరీ కమిటీ'లు. ఇంత కీలకమైనవాటిల్లో ఎస్సీ, ఎస్టీ సభ్యుల సంఖ్య ఉండాల్సి నంత లేదని, పార్లమెంట్లో వారి రిజర్వేషన్ (24.13 శాతం)ను కూడా పరిగణలోకి తీసుకోవటం లేదని తేలింది.
ప్రభుత్వంలో 24 విభాగాలకు చెందిన 'శాఖాపరమైన స్టాండింగ్ కమిటీ'లు, ప్యానెళ్లలో సభ్యుల్ని లోక్‌సభ స్పీకర్, రాజ్యసభ చైర్పర్సన్లు ఎంపికచేస్తారు. మొత్తం 24 కమిటీల్లో 16 లోక్‌సభ, 8 రాజ్యసభ పరిధిలోకి వస్తాయి. ఇవిగాక మరో మూడు ఆర్థిక కమిటీలుంటాయి. అవి.. అంచనాలు, ప్రభుత్వ ఖాతాలు, ప్రభుత్వరంగ సంస్థలు. వీటిలో ప్రభుత్వ వ్యయంపై సమీక్ష జరుపుతారు. ఈ మూడు కమిటీల సభ్యుల్ని లోక్‌సభ, రాజ్యసభ ఎంపీలు ఎంపికచేస్తారు. కమిటీలో సభ్యుల కాలపరిమితి ఒక ఏడాది.
వీళ్లేం చేస్తారు?
ఉదాహరణకు సామాజిక న్యాయ శాఖను తీసుకుంటే, ఇందులోని కమిటీ ముందుగా ప్రభుత్వ బిల్లుల్ని, సాంకేతిక అంశాల్ని సమీక్షిస్తుంది. సంబంధిత శాఖలో ప్రభుత్వ నిధుల కోసం డిమాండ్ ఏవిధంగా ఉంది, గ్రాంట్లు ఎలా విడుదలవుతున్నాయి అనేది చూస్తారు. కమిటీలో చర్చలకు చైర్పర్సన్ నేతృత్వం వహిస్తారు.
చట్టాల రూపకల్పన, సవరణలోనూ వీరి పాత్ర అత్యంత కీలకమైంది. పార్లమెంట్ నిర్దేశించిన అంశాలపై కమిటీలు, ప్యానెళ్లు కూలంకుశంగా అధ్యయనం చేయాలి. సంక్లిష్టమైన విషయాల్లో కేంద్ర ప్రభుత్వానికి పలు సూచనలు, సలహాలు ఇవ్వాలి.