Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కంపెనీల షేర్లు కాకవికలం
- గౌతమ్‌కు రూ.66 వేల కోట్ల దెబ్బ
న్యూఢిల్లీ : అదానీ గ్రూప్‌లో డొల్ల సంస్థల హవాలా పెట్టుబడుల అంశం ఆ కంపెనీ షేర్లను కాకవికలం చేస్తోంది. స్టాక్ మార్కెట్లలో వరుసగా నాలుగో రోజూ అదానీ కంపెనీలు భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి. దీంతో రోజు రోజుకు గౌతం అదానీ సంపద వేల కోట్లు ఆవిరవుతోంది. వరుస నష్టాలతో ఈ వారంలో అదానీ గ్రూపు కంపెనీలకు చెందిన రూ.1.59 లక్షల కోట్ల మదుపు విలువ కరిగిపోయింది. గురువారం సెషన్లోనూ అదానీ గ్రూపు ఆరు కంపెనీల షేర్ల నష్టాలు కొనసాగాయి. అదానీ పవర్, అదానీ టోటల్ గ్యాస్, అదానీ ట్రాన్స్మిషన్ సూచీలు ఐదు శాతం పైగా పడిపోయి లోహర్ సర్క్యూట్‌ను తాకాయి. అదానీ గ్రీన్ ఎనర్జీ 4.95 శాతం నష్టపోయింది. ప్రస్తుత వారంలో ఈ అదానీ గ్రూపులోని ఆరు కంపెనీలు 9 శాతం నుంచి 22 శాతం వరకు పతనమయ్యాయి. అదానీ కంపెనీల్లో రూ.43,000 కోట్ల పెట్టుబడులు పెట్టిన మారిషాస్కు చెందిన ఒకే చిరునామా కలిగిన మూడు విదేశీ కంపెనీల ఖాతాలను నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్ (ఎన్ఎస్డిఎల్) స్తంబింపజేసిందని వచ్చిన రిపోర్ట్‌లతో సోమవారం నుంచి ఈ కంపెనీ షేర్లు నేల చూపులు చూస్తున్నాయి. దీనిపై ఎన్ఎస్డిఎల్, అదానీ గ్రూపు వివరణ ఇచ్చినప్పటికీ మదుపర్లు విశ్వసించకపోవడం విశేషం.
అదానీ సంపద గిలగిల..
అదానీ గ్రూపులో డొల్ల కంపెనీల పెట్టుబడుల వార్తలతో ఆయా కంపెనీల షేర్లు వరుసగా పడిపోతుండటంతో మూడు రోజుల్లోనే గౌతం అదానీ సంపద 9 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.66వేల కోట్లు) హరించుకుపోయిందని బ్లూమ్‌బర్గ్ బిలియనీర్ ఇండెక్స్ తెలిపింది. బుధవారం నాటికి ఈ మొత్తం నష్టపోవడంతో అదానీ సంపద 67.6 బిలియన్ డాలర్ల (రూ.4.95 లక్షల కోట్లు)కు పరిమితమయ్యిందని పేర్కొంది. మారిషాస్ కేంద్రంగా పని చేస్తోన్న ఆ కంపెనీల యాజమానులు ఎవరో స్పష్టత వస్తే కానీ అదానీ కంపెనీలపై మదుపర్లు విశ్వాసం చూపకపోవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు.