Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ ఉధతి తగ్గుముఖం పట్టింది. ఏప్రిల్, మే నెలల్లో దేశాన్ని కరోనా సెకండ్ వేవ్ గడగడలాడించినప్పటికీ.. అనంతరం కేసుల ఉధృతి కొంత తగ్గింది. అయితే ఐదు రాష్ట్రాల్లో వైరస్ తన విజృంభణను కొనసాగిస్తోంది. ఈ ఐదు రాష్ట్రాల్లో లక్ష మందికి పైగా కరోనాతో పోరాడుతున్నారు. వీటిలో నాలుగు రాష్ట్రాలు దక్షిణాదివే కావడం గమనార్హం. జూన్ 1 నుంచి 14 వరకు గణాంకాలను పరిశీలిస్తే తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర, కర్నాటక, ఆంధ్రప్రదేశ్లలో లక్షకు పైగా కేసులు నమోదయ్యాయి. లక్షకు పైగా కేసులు నమోదు అవుతున్న ఈ ఐదు రాష్ట్రాలకు రాబోయే రెండు వారాలు ఎంతో కీలకమని నిపుణులు సూచిస్తున్నారు. లాక్డౌన్ నిబంధనలు మరింత కఠినంగా అమలు చేయాలని పేర్కొంటున్నారు. అలాగే వ్యాక్సినేషన్ ప్రక్రియను కూడా వేగవంతం చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. కరోనా సెకండ్ వేవ్ మహారాష్ట్రపై అత్యధిక ప్రభావం చూపించింది. సెకండ్ వేవ్ మొదలైనప్పటి నుంచి గత రెండు రోజుల వరకు మహారాష్ట్రలోనే అత్యధిక కేసులు నమోదయ్యాయి. అయితే తాజాగా ఆ స్థానం తమిళనాడుకు మారింది. గత రెండు వారాల్లో తమిళనాడులో 2.43 లక్షల కేసులు నమోదు అవగా, ఏపీలో 1.1 లక్షల కొత్త కేసులు నమోదయ్యాయి. కాగా, సెకండ్ వేవ్ తీవ్రతకు చిగురుటాకులా వణికిపోయిన ఢిల్లీ ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. ఆక్సిజన్ లభించక వందలాది మంది మరణించడంతో తీవ్రత ఎంత ఉధృతంగా ఉందో తెలుస్తోంది. అయితే కఠిన లాక్డౌన్ విధించిన అనంతరం ఢిల్లీలో కేసులు తగ్గుముఖం పట్టాయి. మే రెండో వారంలో 14 వేల కేసులు నమోదు కాగా, జూన్ మొదటి వారంలో ఆ సంఖ్య 4,407కు పడిపోయింది. గోవాలో కూడా కేసుల సంఖ్య 15,555 నుంచి 5,226కి తగ్గింది.