Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నిందితులను అరెస్టు చేయని పోలీసులు
- కేసును నీరుగార్చేందుకేనన్న భీమ్ ఆర్మీ సభ్యులు
భోపాల్: దేశంలో నిత్యం ఏదోఒక చోట దళితులపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఇటీవల మధ్యప్రదేశ్లో ఓ దళిత కుటుంబంపై పలువురు అగ్రకులస్తులు దాడికి తెగబడ్డారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదైనప్పటికీ పోలీసులు నిందితులను ఇంకా అరెస్టు చేయలేదు. వివరాల్లోకెళ్తే.. మధ్యప్రదేశ్లోని సెహౌర్ జిల్లాలో ఓ దళిత కుటుంబం ఇంటి ముందర అగ్రకులస్తులు చెత్తవేస్తున్నారు. చెత్తవేయవద్దని వారితో చెప్పినందుకు ఆ కుటుంబంపై అగ్రకులాలకు చెందిన ఆరుగురు దాడి చేశారు. ఈ ఘటనలో దళిత కుటుంబానికి చెందిన హరినాథ్ సింగ్, అతని కుమారుడు శోబల్సింగ్పై కర్రలతో దాడి చేయడంతో వారు తీవ్రంగా గాయపడ్డారు. అడ్డుకున్న కుటుంబ సభ్యులను సైతం కొట్టారు. అలాగే, వారిని కులం పేరుతో దూషించారు. ఈ ఘటన జూన్ 12న జరిగింది. జవార్ పోలీసు స్టేషన్లో పలు సెక్షన్ల కింద కేసు నమోదైంది. తమను చంపేస్తామంటూ బెదిరించారని బాధితులు ఫిర్యాదులో పేర్కొన్నారు.
అయితే, నిందితులు నారాయన్ సింగ్ సేందవ్, రాజేంద్ర సింగ్, విజేంద్ర సింగ్, భైరు సింగ్ సెంధవ్, లోకేంద్ర సెంధవ్, మనోహర్ సెంధవ్.. ఆరుగురిని పోలీసులు ఇంకా అరెస్టు చేయలేదు. దీనిపై పోలీసులు మాట్లాడుతూ.. శోబల్సింగ్ ఇంటి సమీపంలో ఉన్న కంపోస్టు పిట్పై వాదన జరిగి.. ఇది ఘర్షణకు దారి తీసిందని చెప్పారు. రెండు వైపులా ఫిర్యాదులు అందాయనీ, దీనిపై దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. కాగా, మొదటి నుంచి ఈ కేసును తప్పుదొవ పట్టించాలని పోలీసులు ప్రయత్నిస్తున్నారని బాధితులు ఆరోపించారు. ఫిర్యాదు చేయడానికి వెళ్లినప్పుడు కూడా కేసు నమోదు చేయలేదనీ.. దళిత సంఘాలు ఆందోళన వ్యక్తం చేయడంతో కేసు నమోదుచేశారని తెలిపారు. భీమ్ ఆర్మీ సభ్యుడు సునీల్ అస్తే మాట్లాడుతూ.. కేసును పోలీసులు నీరుగార్చేందు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. తమ జోక్యం తర్వాతే కేసు నమోదు, బాధితులను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారన్నారు. ఎఫ్ఐఆర్లో బాధిత కుటుంబం ఇంటికి నిందితులు నిప్పుపెట్టిన అంశాన్ని ప్రస్తావించకపోడంతో పాటు బాధితులను బెదిరిస్తున్నారని తెలిపారు.