Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పోలీసులను ఆదేశించిన వయనాడ్ కోర్టు
తిరువనంతపురం : ముడుపులు ఇవ్వజూపడంతో పాటు మరికొన్ని ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ కేరళ చీఫ్ కె. సురేంద్రన్, జనాధిపత్య రాష్ట్రీయ సభ (జెఆర్‌ఎస్) నేత సికె జానుపై కేసు నమోదు చేయాలని పోలీసులను వయనాడ్‌లోని కోర్టు ఆదేశించింది. ఏప్రిల్‌లో అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఎన్డీఏలోకి తిరిగి వచ్చేందుకు జానుకు 10 లక్షలు ఇచ్చినట్లు సురేంద్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దీనిపై ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (ఐయూఎంఎల్) స్టూడెంట్ విభాగం ముస్లిం స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు పికె నవాస్ దాఖలు చేసిన పిటిషన్‌పై కల్పెట్ట ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు విచారణ చేపట్టింది. ఐపీసీలోని 171బీ, 171ఈ, 171 ఎఫ్ కింద వీరిపై కేసు నమోదు చేయాలని కోర్టు ఆదేశించింది. అంతకముందు పిటిషనర్ రాష్ట్ర పోలీస్ చీఫ్‌ను కలిసి, వీరిపై కేసు నమోదు చేయాలని కోరినా... చేయకపోవడంతో.. కోర్టును ఆశ్రయించారు. కాగా, అంతకముందు ఎన్డీఏలోకి తిరిగి వచ్చేందుకు సురేంద్రన్ను జాను రూ.10 కోట్లు చెల్లించాలని డిమాండ్ చేసినట్టు జెఆర్‌ఎస్ రాష్ట్ర కోశాధికారి ప్రసీతా అజికోడ్ తెలిపారు. చివరకు రూ.10 లక్షలు ఇచ్చారనీ, ఎన్డీఏ అభ్యర్థిగా వయనాడ్‌లోని సుల్తాన్ బథేరీ నుండి పోటీ చేసినప్పటికీ ఓడిపోయారన్నారు. ఈ ఒప్పందానికి సంబంధించిన సురేంద్రన్, ప్రసీతాల మధ్య జరిగిన సంభాషణ బహిర్గతం చేశారు. త్రిసూర్‌లో హైవేపై భారీ నగదు లూటీ జరగ్గా... అందులో బీజేపీ నేతల హస్తమున్నట్టు కోర్టుకు పోలీసులు వాంగ్మూలమిచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై ధర్మరాజు అనే బాధితుడు దాఖలు చేసిన మరో పిటిషన్‌ను ఈ నెల 23న కోర్టు విచారణ చేపట్టే అవకాశాలున్నాయి.