Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కరోనా రెండో దశ ప్రభావం
- పడిపోయిన గ్రామీణ డిమాండ్
- ముప్పు వీడలేదు : ఆర్బీఐ రిపోర్ట్
న్యూఢిల్లీ : కరోనా రెండో దశ వల్ల ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశ ఆర్థిక వ్యవస్థకు రూ.2 లక్షల కోట్ల నష్టం వాటిల్లిందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తెలిపింది. చిన్న పట్టణాలు, పల్లెలకు వైరస్ పాకడంతో గ్రామీణ డిమాండ్ పడిపోయిందని విశ్లేషించింది. దేశంలోని పలు ప్రాంతాల్లో కరోనా, లాక్డౌన్ ఆంక్షలు వినిమయాన్ని ప్రభావితం చేశాయని ఆర్బీఐ తన జూన్ మాసం రిపోర్ట్‌లో పేర్కొంది. ఇప్పుడిప్పుడే కరోనా ఆంక్షల నుంచి దేశం బయటపడుతుందని పేర్కొంది. అయినప్ప టికీ భారత ఆర్థిక వ్యవస్థకు ఇంకా కరోనా 2.0 ముప్పు పొంచే ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. రెండో దశ వైరస్ విజృంభన ప్రధానంగా దేశీయ డిమాండ్‌పై తీవ్ర ప్రభావమే చూపిందని పేర్కొంది. ''దేశీయ డిమాండ్ తగ్గినా.. వ్యవసాయ, స్పర్శరహిత సేవల వద్ధి బాగానే ఉంది. గతేడాది కరోనా ఆంక్షల సమయంతో పోలిస్తే ఈసారి పారిశ్రామిక ఉత్పత్తి, ఎగుమతులు బాగానే ఉన్నాయి. రానున్న రోజుల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ ఎంత వేగంగా జరుగుతుందన్న దానిపైనే ఆర్థిక వ్యవస్థ రికవరీ ఆధారపడి ఉంటుంది. టీకా పంపిణీని వేగవంతం చేయడం ద్వారా అవరోధాల నుంచి బయటపడేందుకు అవకాశాలున్నాయి. పలు సూక్ష్మ గణంకాలను విశ్లేషిస్తే దేశ ఆర్థిక వ్యవస్థ పెరుగుదల 2019 ద్వితీయ త్రైమాసికం నుంచే దిగజారింది. దేశం ఆర్థిక ఉద్దీపనల వల్ల సర్దుబాటు మార్గంలో పయనిస్తుంది.'' అని ఆర్బీఐ తన రిపోర్ట్‌లో విశ్లేషించింది.