Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జీ-7 హామీ అమలు జరిగేనా?
- టీకాల కోసం పోరాడుతున్న పేద దేశాలు
న్యూఢిల్లీ : దక్షిణాసియా దేశాలు కోవిడ్ వ్యాక్సిన్ల కోసం పోరాడాల్సి వస్తోంది. ఎగుమతులను ఆపేయాలని భారత్ తీసుకున్న తాత్కాలిక వైఖరితో సమస్య మరింత జఠిలంగా మారింది. అంతర్జాతీయంగా సాయం అందించేందుకు జి -7 దేశాలు హామీ ఇచ్చినప్పటికీ పేద దేశాలకు వ్యాక్సిన్లు అందేందుకు గల అవకాశాలు పరిమితంగా వున్నాయి. మరోవైపు అంతర్జాతీయ సరఫరాలో ఎక్కువ భాగం సంపన్న దేశాలకే అందుతున్నాయి. పేదదేశాలకు కోట్లాది డోసులు అందచేస్తామని ఇటీవల జరిగిన సమావేశంలో జీ-7 దేశాల నేతలు హామీ ఇచ్చారు. అయినా 1100 కోట్ల డోసులు అవసరమవుతాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలియచేసింది. కరోనా మహమ్మారితో పోరు సల్పుతున్న దక్షిణాసియా దేశాలు వ్యాక్సిన్ల కోసం కూడా అదే స్థాయిలో యుద్ధం చేయాల్సి వస్తోంది. జీ 7 దేశాలు ఇచ్చిన హామీ ఎప్పటికి నెరవేరేనో తెలియని పరిస్థితి. లక్షలాదిమంది తక్షణ అవసరాలు తీర్చేలా ఆ హామీ లేదని ఆరోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు. భారత్ విరాళంగా ఇచ్చిన డోసులు, సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా నుండి కొనుగోలు చేసిన వాటితో భారత్ పొరుగు దేశాలు ఈ ఏడాది వ్యాక్సినేషన్లను ఆరంభించాయి. మార్చిలో భారత్‌లో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోవడంతో మోడీ ప్రభుత్వం ఎగుమతులను నిలిపివేసింది. ఫలితంగా కొవాక్స్‌కు ఇచ్చిన హామీలు, ద్వైపాక్షిక ఒప్పందాలను సీరం ఉపసంహరించుకోవాల్సి వచ్చింది. ప్రపంచంలోని నిరుపేద దేశాలకు వ్యాక్సిన్ల పంపిణీ కోసం ఉద్దేశించిన అంతర్జాతీయ కార్యక్రమమే కొవాక్స్. నేపాల్‌లో 65ఏండ్లు.. అంతకు పైబడినవారు దాదాపు 14లక్షల మంది సెకండ్ డోస్ కోసం వేచి వున్నారు. సాయం చేయాలంటూ నేపాల్ ప్రభుత్వం ఇప్పటికే బ్రిటన్, డెన్మార్క్, దక్షిణ కొరియా, అమెరికాలను కోరింది. నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంకలకు చైనా నుంచి వ్యాక్సిన్ విరాళాలు అందాయి. అయితే శ్రీలంక, నేపాల్‌కు సెకండ్ డోస్ కోసం మరిన్ని టీకాలు అవసరంగా వున్నాయి. శ్రీలంకకు సాయం చేయడానికి జపాన్ ముందుకు రాగా, అమెరికా నుంచి బంగ్లాదేశ్ సాయం ఆశిస్తోంది.