Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్యాకేజీ, ఇల్లు కేటాయించలేదనే అఘాయిత్యం : మృతుని కుటుంబ సభ్యులు
- అన్ని ప్యాకేజీలు ఇచ్చాం.. సొంతింటిని విడవలేకే దారుణం : అధికారులు
నవతెలంగాణ-తొగుట
విశాలమైన ఇల్లు మల్లన్నసాగర్ ప్రాజెక్ట్‌లో మునిగిపోయింది.. వారసత్వంగా కాపాడుకుంటూ వచ్చిన సంపదంతా ప్రాజెక్ట్ పేరుతో ప్రభుత్వం లాక్కున్నది. దాంతో అద్దె ఇంట్లో బతకాల్సిన దుస్థితి వచ్చింది. నెలలు గడిచినా అధికారులు సొంతింటిని కేటాయించడం లేదు. 'నాడు విశాలంగా ఉన్న ఇంటిని ప్రాజెక్ట్‌కు ఇచ్చి.. నేడు కిరాయి ఇండ్లల్లో బతుకుతున్నాం' అంటూ ఓ నిర్వాసితుడు తీవ్రంగా కలత చెందాడు. సొంతింటి మీద ఉన్న మమకారాన్ని వదులుకోలేక.. కూలగొట్టిన ఇంటి ఆవరణలోనే తనకు తానే చితి పేర్చుకున్నాడు. సొంతింటి కట్టలతో చేసుకున్న ఆ చితికి నిప్పంటించి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ హృదయ విదారకర ఘటన సిద్దిపేట జిల్లా తొగుట మండలం మల్లన్నసాగర్ ముంపు గ్రామమైన వేములఘాట్‌లో జరిగింది. గ్రామస్తులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం..వేములఘాట్‌కు చెందిన తూటికూర మల్లారెడ్డి (70) వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. ఆయనకు ముగ్గురు కూతుర్లు కాగా.. పెద్ద కూతురు రాజవ్వను భగవాన్‌రెడ్డితో వివాహం జరిపించి ఇల్లరికం ఉంచుకున్నాడు. భగవాన్ రెడ్డి 20 ఏండ్ల కిందటే చనిపోవడంతో రాజవ్వ కూలీ పనులు చేస్తూ తల్లిదండ్రుల దగ్గరే ఉంటుంది. ఈ క్రమంలో మూడేండ్ల కిందట రాజవ్వ కూడా మృతి చెందింది. ఆమె ఇద్దరి అమ్మాయిలకు వివాహం జరగడంతో.. ఆమె కుమారుడు తిరుపతిరెడ్డి అమ్మమ్మ, తాతలతో కలిసి ఉంటున్నాడు. ఈ క్రమంలో మూడేండ్ల కిందట మల్లారెడ్డి భార్య క్యాన్సర్‌తో అనారోగ్యానికి గురైంది. దాంతో హైదరాబాద్‌కు వలస వెళ్లిన చిన్నకూతురు భాగ్యలక్ష్మి ఆమె భర్తతో కలిసి వేములఘాట్‌కు వచ్చింది. తల్లికి సేవలు చేస్తూ ఇక్కడే ఉండిపోయారు. ఈ క్రమంలో మల్లన్నసాగర్ ప్రాజెక్ట్‌లో వేములఘాట్ ముంపు గ్రామంగా తేలింది. దాంతో ఆ గ్రామస్తులందరినీ ఇతర ప్రాంతాలకు అధికారులు తరలిస్తున్నారు. అయితే మల్లారెడ్డి మనుమడు తిరుపతి రెడ్డికి 18ఏండ్లు నిండటంతో ప్యాకేజీ రూ. 5 లక్షలు, ప్లాటు రిజిస్ట్రేషన్‌ను అధికారులు ఇచ్చారు. మల్లారెడ్డికి గతంలో ఆర్అండ్ఆర్ ప్యాకేజీ కింద రూ.7.50 లక్షలు వచ్చాయి. అంతేకాకుండా ఇంటికి సంబంధించి రూ.5.04 లక్షలు రాగా.. తనకు ఇల్లు కట్టించి ఇవ్వాలని ఆ డబ్బులను ప్రభుత్వం దగ్గర ఉంచాడు. అయితే ముంపు గ్రామాల ప్రజలందరూ వెంటనే గ్రామాలను ఖాళీ చేయాలని అధికారులు సూచించడంతో చిన్నకూతురుతో కలిసి పిడిచెడ్ గ్రామంలో ఓ అద్దె ఇంట్లో ఉంటున్నాడు. రోజులు గడుస్తున్నా అధికారులు మల్లారెడ్డికి సొంతింటిని కేటాయించట్లేదు. ఈ క్రమంలో తీవ్ర మనస్తాపానికి గురైన అతను గురువారం ఉదయం వేములఘాట్‌కు వచ్చాడు. విశాలమైన తన ఇంటిని వదిలి నేడు అద్దె ఇంట్లో ఉండే దుస్థితి వచ్చిందని ఆవేదన చెందాడు. సొంతింటి మమకారాన్ని వదులుకోలేక ఆ ఇంటి కట్టెలనే చితిగా పేర్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ దారుణానికి పాల్పడటంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కాగా, ఆర్అండ్ఆర్ కాలనీలోని 848 నెంబర్ గల ఇంటిని మృతునికి కేటాయించినట్టు అధికారులు చెబుతున్నారు. అయితే మృతుని మనువడికి తల్లిదండ్రులు లేకపోవడంతో అనాథ పేరుతో ఆ ఇంటిని తిరుపతిరెడ్డికి కేటాయించారనీ, అది మల్లారెడ్డికి కేటాయించిన ఇల్లు కాదని మృతుని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. మంటల్లో మల్లారెడ్డి శరీరం పూర్తిగా కాలిపోయింది. రెండు కాళ్ళు, తల భాగం పూర్తిగా కాలినా కొద్దిపాటి గుర్తుగా ఉండటంతో వాటిని స్థానిక పోలీసులు పంచనామా నిర్వహించి పోస్టుమార్టం కోసం సిద్దిపేట ఏరియాస్పత్రికి తరలించారు.
మల్లారెడ్డి ఆత్మహత్య అత్యంత బాధాకరం..అనంత రెడ్డి, ఆర్డీవో, సిద్దిపేట
గ్రామాన్ని విడిచివెళ్తున్నామన్న ఆవేదనతో మల్లారెడ్డి ఆత్మహత్య చేసుకోవడం చాలా బాధాకరం. ప్రభుత్వం నుంచి ఆయనకు ఇవ్వాల్సిన ఆర్అండ్ఆర్ ప్యాకేజీ రూ.7.50 లక్షల చెక్కును అందజేశాం. సర్వే నెంబర్ 614లో గల 2.14 ఎకరాల భూమికి ఎకరాకు రూ.6 లక్షల చొప్పున అతనికి పరిహారం అందించాం. ఆర్అండ్ఆర్ కాలనీలోని 848 ఇంటి నెంబర్‌ను ఆయనకు కేటాయించాం. నిర్వాసితులు పరిహారాల విషయంలో కలెక్టర్, ఆర్డీవో, స్థానిక తహసీల్దార్‌ను సంప్రదించాలి. కానీ ఇలాంటి ఆత్మహత్యలకు పాల్పడొద్దు.