Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: యూఏపీఏ కేసులో ముగ్గురు విద్యార్థి నేతలు దేవంగణ కలిత, నటాషా నర్వాల్, ఆసిఫ్ ఇక్బాల్ తన్హాలకు బెయిల్ మంజూరు చేస్తూ ఇటీవల ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై జోక్యం చేసుకునేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. అయితే ఈ కేసుకు సంబంధించి హైకోర్టు ఈ నెల 15న ఇచ్చిన తీర్పును ఏ కోర్టులోనూ 'ఉటంకించే తీర్పు'గా పరిగణించలేమని ఈ సందర్భంగా పేర్కొంది. ప్రస్తుత పరిస్థితుల్లో విద్యార్థి నేతలు బెయిల్పై విడుదల కావడంపై జోక్యం చేసుకోలేమని జస్టిస్ హేమంత్ గుప్తా, వి.రామసుబ్రహ్మణియన్లతో కూడిన ధర్మాసనం శుక్రవారం స్పష్టం చేసింది. ఢిల్లీ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. 'రాజ్యాంగంతో పాటు యుఎపిఎ చట్టం కూడా ఉల్టా అయింది' అని తీర్పుపై అభ్యంతరం వ్యక్తం చేశారు. యుఎపిఎ కింద అరెస్టైన వారు ఢిల్లీ హైకోర్టు తీర్పును బెయిల్ పొందేందుకు అవకాశం ఉందని వాదించారు. జస్టిస్ గుప్తా స్పందిస్తూ.. ఈ అంశం చాలా ముఖ్యమైనదని, దేశవ్యాప్తంగా ప్రభావం కలిగినదని అన్నారు. ''యూఏపీఏను హైకోర్టు వివరించిన విధానాన్ని అర్థం చేసుకున్నాం. దీనిపై పరిశీలన చేయాల్సి ఉంది'' అని పేర్కొన్నారు. విద్యార్థి నేతల తరపు సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదనలు వినిపిస్తూ.. 'సొలిసిటర్ జనరల్ చాలా చెప్పాలనుకుంటున్నారు.. మేం కూడా అంతే చెప్పాలని అనుకుంటున్నాం' అని కోర్టుకు తెలిపారు. దీంతో సవాల్ పిటిషన్పై తదుపరి విచారణను వచ్చే నెల 19కు సుప్రీంకోర్టు వాయిదా వేసింది. సీఏఏ వ్యతిరేక ఆందోళనల సందర్భంగా ఈ ముగ్గురు విద్యార్థి నేతలపై పోలీసులు చట్టవిరుద్ధ కార్యకలాపాలన నిరోధక చట్టం(యూఏపీఏ) కింద అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అయితే యూఏపీఏ కింద వీరు నేరానికి పాల్పడ్డారన్న దానికి పోలీసుల ఆధారాలు చూపకపోవడంతో ఢిల్లీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో విద్యార్థి నేతలు గురువారం తీహార్ జైలు నుంచి విడుదలయ్యారు. నిరసనలు అనేది ఉగ్రవాద చర్యల కింద రావని, నిరసన తెలపడం ఈ దేశంలోని ప్రతి పౌరుడి ప్రాథమిక హక్కు అని హైకోర్టు బెయిల్ తీర్పులో స్పష్టం చేసింది.