Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అనేక రాష్ట్రాల్లో 900కన్నా తక్కువగా ఎస్ఆర్బీ
న్యూఢిల్లీ : గత మూడు..నాలుగేండ్లుగా దేశంలో బాలికా జననాలు గణనీయంగా తగ్గిపోతున్నాయి. అనేక రాష్ట్రాల్లో ప్రతి వెయ్యిమంది మగ శిశుజననాలకు..ఆడ శిశుజననాలు 900 దాటడం లేదని తాజాగా 'సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ ఫర్ 2019' నివేదిక పేర్కొంది. 2019 సంవత్సరానికి సంబంధించి 'సెక్స్ రేషియో ఎట్ బర్త్' (ఎస్ఆర్బీ) అంశంలో నమోదైన గణాంకాలు ఆందోళన కరమని సామాజిక నిపుణులు భావిస్తున్నారు. దాదాపు అన్ని రాష్ట్రాలూ, కేంద్ర పాలిత ప్రాంతాల్లో లింగ నిష్పత్తి తేడా గణనీయంగా పెరిగింది. 2018, 2017తో పోల్చితే గణాంకాలు మరింత దిగజారాయని తేలింది. సహజంగా గిరిజనులు ఎక్కువగా ఉన్న రాష్ట్రాలు లింగ నిష్పత్తిలో మెరుగైన గణాంకాలు నమోదుచేస్తాయి. అట్లాంటిది ఛత్తీస్‌గఢ్ ఎస్ఆర్బీ 968 నుంచి (2017లో) 931కి (2019లో) పడిపో యింది. తెలంగాణలో ఎస్ఆర్బీ 915 నుంచి 953కు, ఉత్తరాఖండ్ లో 929 నుంచి 960కు పెరిగింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనాల ప్రకారం, దేశంలో ఎస్ఆర్బీ 952 దాటిన రాష్ట్రాలు ఆరుండగా, ఇందులో మూడు ఈశాన్యా రాష్ట్రాలున్నాయి. కేరళలో ఎస్ఆర్బీ 960, మిజోరాంలో 975, నాగాలాండ్‌లో 1001, అరుణాచల్‌ప్రదేశ్ (దేశంలోనే అత్యధికం)లో 1024 నమోదైంది. జనన వివరాలు సరిగా నమోదు చేయకపోవటం, ఆలస్యం కారణంగా బీహార్, జార్ఖాండ్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల గణాంకాల్ని ' సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ ఫర్ 2019 'లో పొందుపర్చలేదని తెలిసింది.