Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మూడో వేవ్‌లో పిల్లలపైనే ప్రభావం అనడానికి ఆధారాల్లేవు : సీరో సర్వే మధ్యంతర నివేదిక
న్యూఢిల్లీ : కరోనా మొదటి వేవ్..రెండో వేవ్ చూశాం. ఇది ఇక్కడితోనే ఆగిపోవాలని అందరమూ కోరుకుంటున్నాం. ఒకవేళ మూడో వేవ్ వస్తే..పిల్లలపై వైరస్దాడి ఎక్కువగా ఉంటుందన్న వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే దీంట్లో నిజం లేదని తాజా అధ్యయనం ఒకటి తేల్చింది. వైరస్ సోకే అవకాశం, దాని ప్రభావం పిల్లలు, వయోజనుల్లో దాదాపు సమానంగా ఉందని, ప్రత్యేకంగా పిల్లలు పెద్దసంఖ్యలో వైరస్‌బారిన పడతారని చెప్పడానికి శాస్త్రీయ ఆధారాల్లేవని 'సీరో సర్వే' మధ్యంతర నివేదిక పేర్కొంది.
'ప్రపంచ ఆరోగ్య సంస్థ', 'ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్' (ఎయిమ్స్) నేతృత్వంలో జరిగిన 'సీరో సర్వే'లో పై విషయాలు వెల్లడయ్యాయి. ఈ పరిశోధనలో ఎయిమ్స్ చీఫ్ రణదీప్ గులేరియా సహా ప్రముఖ వైద్య నిపుణులు భాగస్వాములయ్యారు. 'మెడ్రిక్సీవ్' అనే ఆన్లైన్ పోర్టల్ 'సీరో సర్వే'కు సంబంధించి కొన్ని విషయాల్ని బహిర్గతం చేసింది. సీరో సర్వే పూర్తిస్థాయి అధ్యయనం ఇంకా జరగాల్సివుందని సమాచారం.
వైరస్ సోకే అవకాశం సమానం
తాజా అధ్యయనంలో తేలిన ముఖ్యమైన విషయం..మూడో వేవ్‌లో కరోనా వైరస్ సోకే అవకాశం పిల్లలు, వయోజనుల్లో సమానమని పరిశోధకులు భావిస్తున్నారు. సీరో పాజిటివిటీ 18ఏండ్లలోపువారిలో 55.7శాతం నమోదుకాగా, 18ఏండ్లుదాటినవారిలో 63.5శాతం నమోదైంది. పాజిటివిటీరేటు కాస్త అటూఇటూగా ఒకే స్థాయిలో ఉందని అధ్యయనం తెలిపింది.
వైరస్ వ్యాప్తిని అంచనావేయటంలో ఆయా దేశాలు ప్రామాణికంగా తీసుకుంటున్న సర్వే 'సీరాలజీ టెస్టులు'. అంటే ఎవరి శరీరంలోనైతే 'యాంటీబాడీలు' ఏర్పడుతాయో వారు వైరస్‌ను ఎదుర్కొన్నారని అర్థం. ఎంపిక చేసుకున్న ప్రదేశం, వయస్సు, సామాజిక వర్గాల్లో ఈ సీరాలజీ టెస్టులు నిర్వహిస్తారు. తద్వారా వైరస్ ప్రభావాన్ని వైద్యులు అంచనావేస్తారు. డబ్ల్యూహెచ్ఓ, ఎయిమ్స్ వైద్యుల నేతృత్వంలో తాజాగా జరిపిన 'సీరో సర్వే' కూడా యాంటిబాడీల గుర్తింపు ఆధారంగా చేసిందే.
4509 మందిపై సీరో టెస్టులు జరిగాయి. ఇందులో 700 మంది 2-17ఏండ్లవారుకాగా, 3,809మంది 18ఏండ్లు, ఆపైన వయస్సువారున్నారు. ఢిల్లీ అర్బన్ రీసెటల్మెంట్ కాలనీ, ఢిల్లీ రూరల్, గోరఖ్‌పూర్ రూరల్, అగర్తలా రూరల్ నుంచి రక్త నమూనాలు తీసుకున్నారు. గ్రామీణప్రాంతాల్లో వయోజనులతో పోల్చితే పిల్లల్లో సీరో పాజిటివిటీ రేటు కాస్త తక్కువగా ఉంది.