Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లైట్ తీసుకుంటున్న మోడీ సర్కార్
- సెకండ్‌వేవ్‌లో ఎన్నికలు.. ఇపుడు సోషల్‌మీడియాపై దృష్టి
- కరోనా కట్టడిలో కేంద్రం నిర్లక్ష్యం
- భయాందోళనల్లో జనం
అందితే జుట్టు.. అందకపోతే అబద్ధం.. ఇప్పుడు మోడీ సర్కార్ అనుసరిస్తున్న తీరిది. కోవిడ్ విజృంభించిన తొలివేవ్‌లో హఠాత్తుగా లాక్డౌన్.. సెకండ్‌వేవ్‌లో ఎన్నికలు. థర్డ్ వేవ్ డేంజర్ అని ఇప్పుడు నిపుణులు చెబుతున్నా బీజేపీ ప్రభుత్వం పట్టించుకునే దాఖలాలు కనిపించటంలేదు. సోషల్‌మీడియాపై పెత్తనం చేయటమెలా..! అని తర్జనభర్జనపడుతున్నది. దేశప్రజల ఆరోగ్య సంరక్షణ.. ప్రాణాల గురించి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
న్యూఢిల్లీ : దేశంలో కరోనా సృష్టించిన బీభత్సం అంతా ఇంతాకాదు. సెకండ్‌వేవ్ కోరలు విప్పాక.. ప్రాణనష్టం భరించలేనిది. కానీ మోడీ ప్రభుత్వం ప్రతిసారీ ఏదో ఒక అబద్ధం చెబుతూ రాజకీయంగా నెట్టుకొస్తున్నది. వ్యాక్సిన్ల విషయంలో కేంద్రం ఎలా మాటమార్చిందో.. వైద్య నిపుణులతోనే మాట్లాడి రాయిటర్స్ పత్రిక తేటతెల్లంచేసింది.
డోసులమధ్య గ్యాప్..
వ్యాక్సిన్ డోసుల మధ్య గ్యాప్ 12 నుంచి 16 వారాలు పెంచుతూ మే 13న నిర్ణయం తీసుకున్నారు. వాస్తవానికి అంతకు ముందు 6-8 వారాలుగా కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇదే విషయాన్ని పీఐబీ ప్రకటించింది. తమకు వైద్య నిపుణులు ఇచ్చిన సూచన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని కేంద్రం ప్రకటించింది. అయితే రాయిటర్స్ వైద్య నిపుణులను సంప్రదించగా అలా చెప్పలేదని వెల్లడించటం గమనార్హం. వాస్తవానికి వ్యాక్సిన్ల కొరత కారణంగా మోడీ ప్రభుత్వం అబద్ధాన్ని ఆశ్రయించింది. దీనికనుగుణంగానే డోసుల మధ్య గ్యాప్‌ను పొడిగించిందని స్పష్టమవుతున్నది. మోడీ మాటలకు అర్థాలేవేరులే అన్నట్టుగా.. దేశప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్నది. వారి ఆరోగ్యాలను బేఖాతరు చేస్తున్నదనే ఆందోళన సర్వత్రావ్యక్తమవుతున్నది.
డబ్ల్యూహెచ్ఓ ప్రకారం డోసుల మధ్య అంతరం 8 నుంచి 12 వారాల వరకు ఉండొచ్చు. కానీ అంతకు మించి పెంచాలన్న నిర్ణయం ఔచిత్యం కాదు. అలా పెంచవచ్చని అపెక్స్ కూడా సిఫారసు చేయలేదని ఎండీ గుప్తా..మాజీ డైరెక్టర్ (నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏపిడీమీలాజీ (ఎన్టీఏజీఐ), మాధ్యు వర్గీస్ (ఎన్‌టీఏజీ సభ్యుడు) తెలిపారు.
12 నుంచి 16 వారాల పాటు డోసుల మధ్య గ్యాప్ ఉంటే ఎలా ఉంటుందని కమిటీలో చర్చించామనీ, కానీ దాన్నే అమలు చేయాలని నిర్ణయం తీసుకోలేదని కమిటీ సభ్యులు డాక్టర్ ఎన్ కే ఆరోరా (ఐఎన్సీఎల్ఈఎన్ ట్రస్ట్) రాయిటర్స్‌కు తెలిపారు. దీన్నిబట్టి చూస్తే.. కమిటీ నిర్ణయాలను పట్టించుకోకుండా కేంద్రం డోసుల మధ్యగ్యాప్ పెంచేసింది. వైద్యుల భుజాలపై నుంచి బుల్లెట్ ప్రయోగించినట్టుగా మోడీ ప్రభుత్వం దేశప్రజల ఆరోగ్యంపై గురిపెట్టింది. బీజేపీ సర్కార్ తప్పించుకోవటానికి.. అబద్ధపుమాటల్ని వైద్యుల మాటలుగా ప్రకటించింది.
ఆలస్యంగా వ్యాక్సిన్ల ఆర్డర్లా..!
అమెరికా, బ్రిటన్ లాంటి దేశాలు గతేడాది వ్యాక్సినేషన్ తయారీకి మే, జూన్‌లోనే ఆర్డర్లిచ్చాయి. భారత్‌లో 130 కోట్లమంది ప్రజానీకం ఉంటే.. ఎన్నికల ప్రచారాలయ్యాక.. ఈ ఏడాది జనవరి 21న మోడీ సర్కార్ వ్యాక్సినేషన్‌కు ఆర్డర్లిచ్చింది. అప్పటికే దేశంలో సెకండ్‌వేవ్ ఎంతో ప్రళయం సృష్టించింది. భారీ సంఖ్యలో మరణాలు సంభవించాయి. కుటుంబాలకు కుటుంబాలే దిక్కులేని అనాధలుగా మారటానికి కేంద్రం నిర్లక్ష్యమే కారణమైంది.
జనం చస్తుంటే..
కరోనా తొలిసారి విజృంభించినపుడు గో కరోనా..లైట్లు ఆఫ్ చేసి వెలిగించాలన్న మోడీ సర్కార్. సెకండ్ వేవ్ ఉధృతమవుతుంటే ఎలాంటి వ్యాక్సిన్ లేకుండా కరోనాపై విజయం సాధించామంటూ దేశప్రజలనుద్దేశించి ప్రధాని మోడీ మాట్లాడటం గమనార్హం.
కరోనా వ్యాక్సిన్‌పై మోడీ ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించిందనటానికి సాక్ష్యమే కాష్టాల ముందు క్యూలు.. శ్మశానవాటికల్లో కోవిడ్ మృతులకు అంత్యక్రియలు చేయలేక గంగా నదితో పాటు రోడ్లపక్కన పడేస్తే కుక్కలు తిన్న ఘటనలు బీజేపీ పాలితరాష్ట్రాల్లో దర్శనమిచ్చాయి.
ఆయుష్మాన్ భారత్ ఎక్కడ..?
ఆయుష్మాన్ భారత్ కింద చాలా తక్కువమంది ప్రయోజనం పొందినట్టు సమాచార హక్కు చట్టం కింద వెల్లడైంది. 2018లో సుమారు 50 కోట్ల మంది భారతీయులకు ఉపయోగపడేలా షురూ చేశారు. పేదలకు సరైన వైద్యం అందించాలన్న ఉద్దేశంతో.. ప్రతి ఏటా ఐదులక్షల వరకూ ఉచిత వైద్యం అందేలా పథకాన్ని తెరపైకి తెచ్చింది. కానీ వాస్తవమెంటీ..? ఇండియాటుడే ఆర్టీఐ ద్వారా సేకరించిన వివరాల ప్రకారం.. మోడీ రాష్ట్రమైన గుజరాత్లో 0, పంజాబ్‌లో 0, బీహార్‌లో 19 మంది, ఉత్తరప్రదేశ్‌లో 975, జార్ఖండ్‌లో 1,419 మందికి మాత్రమే లబ్దిచేకూరింది.
ఆయుష్మాన్ భారత్ ఏ విధంగా అమలవుతున్నదో కేంద్రంలోని మోడీ సర్కార్ ఆర్టీఐకు వెల్లడించిన వాస్తవ వివరాలివి. కేవలం మూడు రాష్ట్రాలకు మాత్రమే లబ్దిదారులకు అందింది. మూడేండ్లకిందట ప్రారంభించిన ఆయుష్మాన్ భారత్ పనితీరు ఎలా ఉన్నదో..పేదల గురించి మాట్లాడే మోడీ సర్కార్ గరీబుల కోసం ఎంత ఖర్చుపెడుతున్నదో ఇట్టే అర్థమవుతున్నది.
ఇక కరోనా రెండుసార్లు విజృంభించింది. తొలివేవ్..సెకండ్‌వేవ్‌లోనూ బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరులో ఎలాంటి తేడా కనిపించటంలేదనటానికి ఈ ఉదాహరణ. ఆయిష్మాన్ భారత్ కింద తొలి విడత కరోనా కాలంలో ఎంతమందికి లబ్ది కలిగిందని ఆర్టీఐలో అడిగితే..అలాంటి సమాధానం మా వద్దలేదంటూ కేంద్రం సమాధానమిచ్చింది.
సెకండ్‌వేవ్‌ను సమర్థంగా ఎదుర్కొన్నామంటూ ప్రధాని మోడీ, కేంద్ర హౌంమంత్రి అమిత్‌షా, కేంద్ర ఆరోగ్యమంత్రి హర్షవర్థన్ ప్రకటించారు. అక్సిజన్లు అందక, పడకల్లేక కోవిడ్ రోగులు అవస్థలు పడుతున్న సమయంలో పై విధంగా స్పందించారు. జేపీ నడ్డాకు వచ్చే ఎన్నికల గురించి బెంగపట్టుకున్నది.
దేశ ప్రజల్ని ఎన్నాళ్లు మోసం చేస్తారు?
మత రాజకీయాలే మీ ఎజెండానా..! కరోనాతో జనం ప్రాణాలు విడుస్తున్నా.. పట్టదా..! అని ప్రముఖ విశ్లేషకులు మోడీ సర్కార్‌ను ప్రశ్నిస్తున్నారు. మరోవైపు సామాజిక మాధ్యమాలను కట్టడి చేయవద్దని సుప్రీంకోర్టు హెచ్చరికల్ని కూడా బీజేపీ సర్కార్ పట్టించుకోవటంలేదు. ధర్డ్‌వేవ్ ముప్పు పొంచిఉన్నదని ముందస్తుగా అప్రమత్తం చేస్తున్నా గతంలో నిర్లక్ష్యమే కనిపిస్తున్నది.