Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తిరువనంతపురం : లక్ష ద్వీప్‌కు న్యాయం జరిగే వరకూ తన పోరాటం కొనసాగుతుందని సినీ దర్శక నిర్మాత అయిషా సుల్తానా స్పష్టం చేశారు. ఇప్పటి వరకు తాను దేశానికి వ్యతిరేకంగా ఏమీ చేయలేదని, ఏమీ మాట్లాడలేదని ఆమె పేర్కొన్నారు. ఒక టివి చర్చలో భాగంగా లక్షద్వీప్ అడ్మినిస్ట్రేటర్‌ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై పోలీసులు ఆమెపై దేశద్రోహం కింద కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో కవరట్టి పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యేందుకు బయలుదేరే ముందు శనివారం కొచ్చి విమానాశ్రయంలో మీడియాతో సుల్తానా మాట్లాడారు. విచారణలో పోలీసులకు అన్నివిధాలుగా సహకరిస్తానన్నారు. తాను ఏ తప్పు చేయలేదనీ, తప్పక న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. టివి చర్చలో తాను చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారని, తాజా ఫేస్బుక్ పోస్టులో అన్ని వివరించానని చెప్పారు. '' దేశానికి వ్యతిరేకంగా నేనేం చేయలేదు. టివి చర్చలో నేను వినియోగించిన 'బయోలాజికల్ వెపన్' అనే పదం కావాలనే వివాదం సృష్టించారు. నేను ఏ తప్పు చేయలేదని నిరూపించుకోవాల్సిన బాధ్యత నాపై ఉంది.'' అని అయిషా పేర్కొన్నారు. ' నా భూమి(లక్షద్వీప్), అక్కడి ప్రజలు న్యాయం పొందే వరకు నా పోరాటం కొనసాగుతుందని పేర్కొన్నారు. కేరళ హైకోర్టు గురువారం సుల్తానాకు వారం రోజల పాటు మధ్యంతర ముందస్తు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఇదే సమయంలో కవరట్టి పోలీసులు ఇచ్చిన నోటీసులకు అనుగుణంగా ఈ నెల 20న విచారణకు హాజరు కావాలని ఆదేశించింది.