Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు తొలి అడుగు
శ్రీనగర్: జమ్ముకాశ్మీర్‌కు చెందిన రాజకీయ పార్టీ నేతలతో ప్రధాని మోడీ ఈనెల 24న అఖిలపక్ష సమావేశం నిర్వహించనున్నట్టు అధికారిక వర్గాలు పేర్కొన్నాయి. ఈ ప్రాంతంలో 2018, జూన్ నుంచి ఎన్నికైన ప్రభుత్వం లేని నేపథ్యంలో.. ప్రజాస్వామ్య ప్రక్రియను ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదనీ, ఈ సమావేశంలో పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన చర్చకు వచ్చే అవకాశం ఉన్నదని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఈ చర్చలు అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు మొదటి అడుగుగా విశ్లేషకులు భావిస్తున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా శుక్రవారం జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, జమ్ముకాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, భద్రతా, ఇంటెలిజెన్స్ అధికారులతో భేటీ అయ్యారు. కేంద్ర ప్రభుత్వం నిర్వహించే అఖిలపక్ష సమావేశానికి సంబంధించిన ఆహ్వానం అందిందని పీడీపీ అధినేత్రి, మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ వెల్లడించారు. అయితే పీపుల్స్ అలయన్స్ ఫర్ గుప్కర్ డిక్లరేషన్(పిఎజిడి)లోని సభ్యులు అందరూ ఈ సమావేశానికి హాజరవుతారనే దానిపై స్పష్టత లేదని ఆమె పేర్కొన్నారు. అఖిలపక్ష సమావేశంలో పాల్గొనే దానిపై చర్చిస్తున్నట్లు నేషనల్ కాన్ఫరెన్స్ పేర్కొంది. ఇటీవల జమ్ముకాశ్మీర్‌లో డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ కౌన్సిల్(డీడీసీ) ఎన్నికలు పూర్తైన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో గుప్కర్ కూటమి 100 కి పైగా స్థానాల్లో విజయం సాధించగా, బీజేపీ 74 సీట్లకు పరిమితమైంది. జమ్ముకాశ్మీర్ స్వయంప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేసిన కేంద్ర ప్రభుత్వం జమ్మూ కాశ్మీర్, లడఖ్ అనే రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించింది.
ముఫ్తీ పినతండ్రి విడుదల
ఆరు నెలల నిర్బంధం అనంతరం మెహబూబా ముఫ్తీ పిన తండ్రి సర్తాజ్ మదాని శనివారం విడుదలయ్యారు. సీఆర్పీసీ సెక్షన్ 107, 151 ప్రకారం మదాని నిర్భంద కాలం ముగిసిందని అధికారులు తెలిపారు. జమ్ముకాశ్మీర్‌కు చెందిన పార్టీలను ఈనెల ఆఖరులో చర్చల నిమిత్తం కేంద్ర ఆహ్వానించిన నేపథ్యంలో తాజా పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం. మదానిని నిర్బంధంలో ఉంచడం ఇది రెండోసారి. అంతకుముందు ఆయన్ను జమ్ముకాశ్మీర్ స్వయంప్రతిపత్తిని రద్దుకు పార్లమెంట్ ఆమోదం తెలిపిన 2019, ఆగస్టు 5న అరెస్టు చేశారు. అనంతరం గతేడాది విడుదల చేశారు. మళ్లీ గతేడాది డిసెంబర్ 20న అరెస్టు చేసని మదానిని శ్రీనగర్‌లోని ఒక నిర్బంధ క్యాంపులో ఉంచారు.