Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ప్రయివేటీకరణను ఆపండి
- లేదంటే..నిరవధిక సమ్మెకు దిగుతాం : ఓఎఫ్బీ ఉద్యోగులు
న్యూఢిల్లీ : రక్షణరంగాన్ని కాపాడాలని, ప్రయివేటీకరణను ఎంతమాత్రమూ అనుమతించ కూడదని దేశవ్యాప్తంగా పలు నగరాల్లో ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఉద్యోగులు ఆందోళనబాట పట్టారు. 246ఏండ్ల సుదీర్ఘ చరిత్ర ఉన్న ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డు(ఓఎఫ్బీ)ని ఏడు స్వతంత్ర కార్పొరేట్ సంస్థలుగా విడగొట్టాలని మోడీ సర్కార్ నిర్ణయిం చింది. దీనికి కేంద్రమంత్రివర్గం ఇటీవలే (జూన్ 16న) ఆమోదముద్రవేసింది. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ శనివారం దేశవ్యాప్త ఆందోళనకు ఓఎఫ్బీ ఉద్యోగ సంఘాలు పిలుపునిచ్చాయి. ప్రయివేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, లేదంటే 4 లక్షల మంది ఉద్యోగులు రోడ్లమీదకొచ్చి..నిరవధిక సమ్మె చేపడతామని 'ఆల్ ఇండియా డిఫెన్స్ ఎంప్లాయిస్ ఫెడరేషన్' (ఏఐడీఈఎఫ్) ప్రధాన కార్యదర్శి సి.శ్రీకుమార్ అన్నారు. రాబోయే రోజుల్లో చేపట్టబోయే నిరసనలు, ఆందోళనపై నేడు ఓఎఫ్బీ కార్మికులు, ఉద్యోగులతో చర్చించనున్నామని శ్రీకుమార్ చెప్పారు. మోడీ సర్కార్ ఎంచుకున్న విధానాలు దేశ రక్షణ, భద్రతను ప్రమాదంలో పడవేస్తాయని ఆయన హెచ్చరించారు. శనివారం కోల్కతాలో ఓఎఫ్బీ కార్యాలయ ఆవరణలో జరిగిన నిరసన కార్యక్రమంలో ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొనగా, ప్రధాని మోడీ, కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను ఉద్యోగ సంఘాల నాయకులు దగ్ధం చేశారు. ఓఎఫ్బీని ప్రయివేటీకరిస్తున్నారని, ఏడు కార్పొరేట్ సంస్థలుగా విడగొడుతున్నారనే ప్రకటన బయటకురాగానే, గురువారం నుంచి ఉద్యోగులు నిరసనబాట పట్టారు. వీరి ఆందోళనకు పలు కార్మిక సంఘాలు మద్దతు ప్రకటించాయి. ఈమేరకు మీడియాకు సెంట్రల్ ట్రేడ్ యూనియన్స్ (సీటీయూ) ఒక ప్రకటన కూడా విడుదలచేసింది.
ఓఎఫ్బీ ప్రయివేటీకరణను ఎంతమాత్రమూ అంగీకరించమని, కేంద్రం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఆ ప్రకటనలో సీటీయూ డిమాండ్ చేసింది. వ్యూహాత్మకంగా ఎంతో కీలకమైన రక్షణ, రక్షణ ఉత్పత్తులరంగంలో ప్రయివేటీకరణకు అనుమతిస్తే..దేశ ప్రయోజనాలు దెబ్బతింటాయని సీటీయూ ఆందోళన వ్యక్తం చేసింది. దీనిపై కేంద్రం వెంటనే తన విధానాన్ని మార్చుకోకపోతే కార్మికులు, ఉద్యోగులు ఆందోళనబాట పడతారని హెచ్చరించింది. మోడీ సర్కార్ కార్మిక, రైతు వ్యతిరేక విధానాల్ని అమలుజేస్తోందని ఆరోపించింది.
రక్షణరంగంలో పనిచేస్తున్న ఉద్యోగులంతా జాతీయస్థాయి పరీక్షలు రాసి ఎంపికయ్యారని, వారి జీతభత్యాలు, పింఛన్లకు రాజ్యాంగ బద్ధమైన హామీ ఉందని, ప్రయివేటీకరణతో ఇదంతా దెబ్బతింటుందని సీటీయూ ఆందోళనవ్యక్తం చేసింది.