Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్రాలకు కేంద్ర హోంశాఖ లేఖ
న్యూఢిల్లీ: క్షేత్ర స్థాయి పరిస్థితులను నిశితంగా పరిశీలించిన తర్వాత కోవిడ్ కట్టడి కోసం విధించిన ఆంక్షలను సమీక్షించాలని రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర ప్రభుత్వం నిర్దేశించింది. కార్యకలాపాలను పునఃప్రారంభించడంలో అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించింది. వైరస్ వ్యాప్తి అదుపులోకి వస్తోన్న వేళ.. నిబంధనల విషయంలో రాజీ పడొద్దని హెచ్చరించింది. ఈ మేరకు పలు సూచనలు చేస్తూ శనివారం కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజరు భల్లా లేఖ రాశారు.
క్షేత్రస్థాయిలో పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ కరోనా ఆంక్షల విధింపు లేక సడలింపు విషయంలో నిర్ణయం తీసుకోవాలని పేర్కొన్నారు. 'క్రియాశీల కేసులు తగ్గుతుండటంతో పలు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ఆంక్షలను సడలిస్తున్నాయి. క్షేత్రస్థాయిలో పరిస్థితిని సమీక్షించి ఆంక్షల విషయంలో నిర్ణయం తీసుకోవాలి. కరోనా ఉధృతిని నిశితంగా గమనించి, కార్యకలాపాలను జాగ్రత్తగా పునఃప్రారంభించాలి. టెస్టింగ్, ట్రాకింగ్, వైద్య సేవలు, టీకాలు, నిరంతర నిఘా వంటి నియమాలను తప్పక పాటించాలి. దేశంలో మరోసారి కరోనా వైరస్ విజృంభించకుండా నియమావళిని క్రమం తప్పకుండా పర్యవేక్షించాలి'' అని సూచించింది. అయితే కొన్ని రాష్ట్రాల్లో ఆంక్షల సడలింపులు మార్కెట్లను రద్దీగా మారుస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది.