Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మోడీది రెండు నాల్కల ధోరణి
- జీ..7లో ప్రధాని అన్నట్టుగా దేశంలో పరిస్థితులు ఉన్నాయా : విశ్లేషకులు
- భారత్‌లో ప్రజాస్వామ్యం, స్వేచ్ఛా స్వాతంత్య్రాల్లేవంటూ నివేదికలు
- దిగజారుతున్న దేశ విలువలు, ప్రతిష్ట
న్యూఢిల్లీ: విదేశీ ప్రతినిధుల సమావేశంలో మాట్లాడే అవకాశం వస్తే.. తమ దేశం గురించి దేశప్రజలందరి తరఫున ప్రధాని ప్రస్తావించటం సర్వసాధారణం. 130 కోట్లమంది ప్రతినిధిగా ప్రధాని మోడీ వాయిస్‌ను వినిపించాలి. గ్రూప్-7 సమావేశం బ్రిటన్‌లో జరిగితే.. మోడీ ప్రత్యేక ఆహ్వానితునిగా ఆన్లైన్ వీడియోద్వారా మాట్లాడే అవకాశం లభించింది. దేశంలో ఒక నీతి, విదేశాల్లో మరోనీతిని అనుసరిస్తారనటానికి తాజాగా జీ-7 దేశాల సదస్సులో మోడీ సంభాషించినతీరే ఓ ఉదాహరణ.
అయితే ఎందుకని ప్రధాని అబద్ధాలు చెబుతారు.? అది కూడా అంతర్జాతీయ వేదికలపై ఇలాంటి తప్పుడు మాటలు ఎవరిని ఉద్ధరిస్తాయి..? దేశంలో ఉన్న వాస్తవాలను కప్పిపెడితే..అవి కాలగర్భంలో కలిసిపోతాయా..?
జీ-7లో కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, యునైటెడ్ కింగ్డమ్, జపాన్, యునైటెడ్ స్టేట్స్ దేశాలున్నాయి. ప్రత్యేక ఆహ్వానితులుగా ఆస్ట్రేలియా, భారత్, సౌత్ కొరియా, సౌత్ ఆఫ్రికా దేశాలను భాగస్వామ్యం కల్పించింది. అయితే ఈ సదస్సులో మోడీ మాట్లాడిన తీరు చర్చనీయాంశంగా మారింది.
ఇంతకీ జీ..7 సమ్మిట్‌లో మోడీ ఏమన్నారంటే..
భారత్ ఓ ప్రజాస్వామ్య దేశం. స్వేచ్ఛా స్వాతంత్య్రాలకు కట్టుబడి ఉన్నది. ఇది దేశంలో అంతర్భాగమని చెప్పుకొచ్చారు. అంతర్జాతీయ వేదికపై ప్రధాని ప్రసంగించారు. వాస్తవంగా బీజేపీ పాలన వచ్చి ఏడేండ్ల కాలంలో దేశంలో ప్రజాస్వామ్యం, స్వేచ్ఛాస్వాతంత్య్రం అమలవుతున్నదా..! అంటే లేదనే చెప్పవచ్చు. మోడీ ప్రభుత్వం భారతరాజ్యాంగం కల్పించిన హక్కుల్ని కూడా దెబ్బతీసేవిధంగా అడుగులు వేస్తున్నది. ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించే నిర్ణయాలెన్నింటినో అమలుచేస్తున్నది. భారత్‌లో ప్రజాస్వామ్యం, స్వేచ్ఛా స్వాతంత్య్రం దిగజారిందని ఎన్నో అధ్యయనాలు తేల్చాయి. అంతేకాదు మీడియా ఫ్రీడమ్ మొదలుకుని కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకూ సోషల్‌మీడియాలో భావప్రకటనా స్వేచ్ఛను ప్రకటిస్తే దేశద్రోహమంటూ ఎఫ్ఐఆర్లు, కేసులు పెట్టి వేధిస్తున్నది. అంతర్జాతీయ పర్యటనకు వెళ్లినపుడు మాత్రం నియంతృత్వం, హింసకు తాను వ్యతిరేకమని మోడీ చెప్పుకుంటుంటారు. పైగా స్వేచ్ఛా స్వాతంత్య్రానికి అనుకూలమైనట్టు ఫోజులిస్తుంటారు. మరోవైపు జీ-7 సమావేశంలో స్వేచ్ఛా స్వాతంత్య్రం గురించి ప్రముఖంగా ప్రస్తావించింది. ఇది ఆన్లైన్ కానీ, ఆఫ్‌లైన్ ద్వారా కానీ ప్రస్తావించటం ప్రజాస్వామ్యానికి రక్షణ కవచంలాంటిదని అభిప్రాయపడ్డాయి. ఇలాంటి వ్యవస్థలేనపుడు ప్రజాస్వామ్యం పునాదులపై నిలబడలేదని ముక్తకంఠతో నొక్కివక్కానించాయి.
అంతర్జాతీయ వేదికలపై ప్రజాస్వామ్యం విలువల గురించి చర్చించి జీ-7 దేశాలు సంతకాలు చేశాయి. అలాంటి సందర్భంలో మోడీ ప్రభుత్వం కొత్తగా ఐటీ రూల్స్‌ను తెరపైకి తెచ్చింది. సోషల్ మీడియా, విలేకరులు, సాధారణ ప్రజలను బెదిరించే మార్గదర్శకాల తయారీలో బీజేపీ ప్రభుత్వం బిజీగా ఉన్నది. తమకు వ్యతిరేకంగా ఎక్కడ గళమెత్తినా..దేశద్రోహం కేసుపెట్టి కటకటాలవెనక్కి నెట్టే ప్రయత్నాలు చేస్తున్నది. జమ్మూకాశ్మీర్‌లో ఇంటర్నెట్ పూర్తిగా బంద్‌చేశారు. ఆందోళనలు, కోర్టులు మొట్టికాయలు వేశాక 17 నెలల తర్వాత 2-జి ఇంటర్నెట్ సేవల్ని పునరుద్ధరించింది. 2020లో ఇంటర్నెట్ షట్డౌన్లతో నాలుగుబిలియన్ల నష్టం వాటిల్లగా.. అందులో 70శాతం భారత్ నుంచే ఉండటం గమనార్హం. ఉద్యోగులు, నిరుద్యోగులకు ఇంటర్నెట్ అందుబాటులో లేకుండా చేసింది. మొత్తం మీద దేశ ఆర్థికవ్యవస్థపై 2.8 బిలియన్ డాలర్ల మేర ప్రభావం పడిందని ఆర్థిక నిపుణులు విశ్లేషించారు. ఇవే కాకుండా సీఏఏ, రైతు ఆందోళనలపై ఉక్కుపాదం మోపింది. సీఏఏకు వ్యతిరేకంగా పోస్టు చేసినపుడు నెట్‌ను షట్‌డౌన్ పెట్టింది. నల్లచట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఉద్యమించినపుడు కూడా హర్యానా, యూపీ, పంజాబ్ రాష్ట్రాల్లోనూ ఇంటర్నెట్ సేవలను నిలిపివేసింది. నిరసనలు, ఉద్యమాల కవరేజీని అడ్డుకునేందుకు.. ఢిల్లీ పరిసర రాష్ట్రాల్లో కూడా నెట్ స్పీడ్‌ను తగ్గించేసింది. టెలిఫోన్లు నెట్ కవరేజీ అందనంతా ఆంక్షలు పెట్టింది. ఇలా నో ఇంటర్నెట్, టెలిఫోన్ జోన్‌గా మార్చేసింది. శాంతిభద్రతలనో..దేశహితమనో చెప్పి మోడీ ప్రభుత్వం కట్టడిచేసే ప్రయత్నాలు చేస్తున్నది.డెమోక్రసీ ఆఫ్ ఇండియా సర్వే నిర్వహించినపుడు ఎక్కువమంది భావప్రకటనా స్వేచ్ఛ గురించి ప్రస్తావించారు. ప్రధాని మోడీ మన్‌కీ బాత్ ఎలా చెబుతారో..అలానే దేశ పౌరులు కూడా తమ మన్‌కీబాత్ చెప్పుకోవాలనుకుంటున్నారు. అది ఫేస్బుక్ ద్వారాకానీ, సోషల్ మీడియా ఫ్లాట్‌ఫాం మీద కానీ తన స్వేచ్ఛా స్వాతంత్య్రం గురించి పంచుకోవాలనుకుంటున్నాడు. కరోనా విజృంభిస్తున్నతీరు.. మోడీ సర్కార్ నిర్లక్ష్యం గురించి ప్రముఖ జర్నలిస్టులు, కార్టునిస్టులు, సినీయాక్టర్లు ట్విట్లు చేశారు. రాజకీయంగా వ్యంగ చిత్రాలను కూడా మోడీ ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంటున్నది. జర్నలిస్టులను బతకనివ్వరా అంటూ ప్రశ్నించిన మోడీ ఇపుడు అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. మాకు వ్యతిరేకంగా ట్విట్లు చేస్తారా..? అంటూ బీజేపీ సర్కార్ వారిపై వేధింపులకు దిగింది. కొందరు ఉద్యోగాలనుంచి తొలగించింది. మరికొందరి ట్విట్లు డిలిట్ చేసేలా ఒత్తిడికి గురిచేసింది. ఇంకొందరిపై దేశద్రోహం కేసులు పెట్టి జైళ్లవెనక్కి నెట్టింది. సోషల్ మీడియాపై వత్తిడి తెచ్చి.. తమ చెప్పుచేతల్లోకి తీసుకోవాలనుకుంటున్నది.
ఇంటర్నెట్ సేవలు ఒక్క కాశ్మీర్‌లోనే కాదు దేశవ్యాప్తంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళమెత్తుతారన్నచోటల్లా నిషేధం పెడుతున్నది. ఇలా ప్రజల హక్కుల్ని కాలరాయటంలో మాత్రం విశ్వగురు అయ్యారు. అయితే దేశంలో వాస్తవాలను దాచి.. అంతర్జాతీయ వేదికలపై దేశప్రజల ప్రతినిధిగా మాట్లాడే అవకాశం వస్తే.. మోడీ అబద్ధాలు చెబుతున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈడో రకం.. ఆడో రకం అన్నట్టు రెండునాల్కల ధోరణిని ప్రధాని అవలంబించటం దేశహితానికి తగదని పేర్కొంటున్నారు.