Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ధనిక రాష్ట్రాల్లో టీకా రేటు అధికం
- వెనుకబడ్డ పేద రాష్ట్రాలు
- పట్టణ ప్రాంతాల్లో కేంద్రీకృతమైన టీకా డ్రైవ్
న్యూఢిల్లీ : భారత్‌లో వ్యాక్సినేషన్‌కు సంబంధించి అసమానతలు కనిపిస్తున్నాయి. ఆయా రాష్ట్రాల మధ్య ఈ తేడా స్పష్టమవుతున్నది. దేశంలోని టీకా కార్యక్రమం ద్వారా ఈ విషయం వెల్లడవుతున్నది. ముఖ్యంగా ధనిక, పేద రాష్ట్రాల మధ్య ఈ తేడా కనిపిస్తున్నది. కొన్ని ధనిక రాష్ట్రాలు వాటి జనాభాలో ఎక్కువ శాతం పూర్తిగా టీకాలు (రెండు మోతాదులు) వేసినట్టు వ్యాక్సినేషన్ డ్రైవ్ గణాంకాలు తెలియజేస్తున్నాయి. కానీ, పేద రాష్ట్రాల్లో ఈ పరిస్థితి కనిపించకపోవడం గమనార్హం. అయితే, దీని వెనక ఆయా రాష్ట్రాల పాలనా విధానంతో పాటు పలు అంశాలు కారణమవుతున్నాయని నిపుణులు తెలిపారు. ఢిల్లీ, కేరళ, గుజరాత్, గోవా వంటి రాష్ట్రాలు తమ జనాభాలో ఎక్కువ శాతం టీకాలు వేశాయి. ఈ గణాంకాలు ఢిల్లీలో 7.3శాతం, కేరళలో 6.7 శాతం, గుజరాత్లో 6.7శాతం, గోవాలో 6.4శాతం గా ఉన్నాయి. మరోవైపు, బీహార్, యూపీ, జార్ఖండ్ వంటి రాష్ట్రాల పరిస్థితి ఇందుకు విరుద్ధంగా ఉన్నది. బీహార్, యూపీ రాష్ట్రాల జనాభాలో వరుసగా 1.6శాతం మంది, 1.7 శాతం మందికి మాత్రమే టీకా కార్యక్రమం పూర్తయింది. ఇక జార్ఖండ్‌లో ఇది 2.2శాతంగానే ఉన్నది. ఇక ధనిక, పేద రాష్ట్రాల్లోనూ పట్టణ, గ్రామీణ ప్రాంతాల మధ్య టీకా డ్రైవ్ అసమానతలు కనబడ్డాయి. ఈ రాష్ట్రాల్లో వ్యాక్సినేషన్ కార్యక్రమం పట్టణ ప్రాంతాల్లో మాత్రమే కేంద్రీకృతమై ఉండటం గమనించాల్సిన అంశం. ఇక గ్రామీణ ప్రాంతాల ప్రాబల్యం కారణంగా పేద రాష్ట్రాలు తక్కువ టీకా రేటును నమోదు చేశాయి. '' టీకా రేటు తక్కువగా నమో దు కావడమనేది ఆయా రాష్ట్రాల్లో పరిపాలన సమస్య. యూపీ, బీహార్ వంటి రాష్ట్రాలు మౌలిక సదుపాయాలు, మానవ వనరులు, జనాభాకు టీకాలు వేయడానికి కావల్సిన ఇతర సౌకర్యాలు చాలా తక్కువగా ఉన్నాయి. అలాగే, వ్యాక్సిన్ల సరఫరా పరిమితమైనప్పుడు పేద వర్గాల ప్రవేశం ప్రతికూలంగా ప్రభావితమవుతుంది. పాట్నా వంటి నగరాల్లో టీకా కార్యక్రమం చాలా మంచి రేటుతో సులభంగా జరుగుతుంది. అయితే అరారియా వంటి పేద జిల్లాల్లో ఇది చాలా సంక్లిష్టం'' అని బీహార్‌లోని జన స్వస్థ్య అభియాన్ కన్వీనర్ డాక్టర్ షకీల్-ఉర్-రెహ్మాన్ తెలిపారు. కాగా, విద్యా సూచికలో మెరుగైన స్కోరు సాధించిన రాష్ట్రాల్లో టీకా రేటు అధికంగా నమోదైంది. కేరళ, గోవా, ఢిల్లీ, హిమాచల్‌ప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో ఈ ట్రెండ్ అధికంగా ఉన్నది. విద్యా సూచికలో తక్కువ స్కోర్లు ఉన్న బీహార్, యూపీ, జార్ఖండ్, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో టీకా రేటు తక్కువగా ఉన్నది. విద్య, టీకా రేట్ల మధ్య సంబంధం చాలా సరళంగా ఉన్నదని డాక్టర్ షకీల్ చెప్పారు.