Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎపిడెమిక్ డిసీజెస్ యాక్ట్-2020 ప్రయోగించాలన్న కేంద్రం
న్యూఢిల్లీ: ప్రజల ప్రాణాలు నిలపడంలో ఎంతగానో కృషి చేస్తున్న వైద్యులు, ఆరోగ్య సిబ్బంది, కార్యకర్తలపై పలు చోట్ల దాడుల జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కేంద్రం... రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖ రాసింది. వైద్యులు, ఆరోగ్య కార్యకర్తలు, సిబ్బందిపై దాడులు చేసే వారిపై ఎఫ్ఐఆర్ కేసులు నమోదుచేయాలనీ, ఎపిడెమిక్ డిసీజెస్ యాక్ట్-2020 కింద కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర, కేంద్ర పాలిత ప్రభుత్వాలకు సూచించింది. దేశంలో పలు చోట్ల కరోనా రోగులకు చికిత్స అందిస్తున్న వైద్య సిబ్బందిపై తరచు దాడులు జరుగుతున్న ఘటనలను కేంద్రం తీవ్రంగా పరిగణించింది. దీనికి అనుగుణంగా కఠిన చర్యలు తీసుకోవాలంటూ కేంద్ర హౌం శాఖ కార్యదర్శి అజరు భల్లా లేఖలు రాశారు. వైద్యులపై దాడులకు పాల్పడే వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలనీ, ఇది ఫాస్ట్ట్రాక్లో కొనసాగేలా చర్యలు తీసుకోవాలని అందులో పేర్కొన్నారు. వైద్య బృందాలపై దాడులు జరగడం వల్ల వారి మనోస్థైర్యం దెబ్బతింటున్నదన్నారు. అభద్రతా భావం సైతం పెరుగుతున్నదనీ, దీంతో ఆరోగ్య వ్యవస్థపై ప్రభావం పడుతున్నదని తెలిపారు.
కాగా, ఎపిడెమిక్ డిసీజెస్ యాక్ట్-2020 ప్రకారం.. వైద్యులు, ఆరోగ్య సిబ్బందిపై దాడులకు సంబంధించిన కేసులను నాన్ బెయిలబుల్ కేసులుగా పరిగణిస్తారు. దాడులకు పాల్పడిన వారికి ఐదేండ్ల జైలు శిక్షతో పాటు రెండు లక్షల రూపాయల జరిమానా సైతం విధించే అవకాశం ఉంటుంది. ఈ దాడుల్లో వైద్యులు, ఆరోగ్య సిబ్బంది తీవ్రంగా గాయపడితే ఏడేండ్ల వరకు జైలు శిక్షపడే అవకాశముంది. రూ.5 లక్షల జరిమానా కూడా విధిస్తారు.