Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అలీఘర్ : సువిశాల భారతదేశంలో ఏదో ఓ మూల ఆకలి చావులు వెలుగు చూస్తూనే ఉన్నాయి. దీనికి తోడు కరోనా వైరస్ మహమ్మారి పేదల జీవితాలను అల్లకల్లోలం చేసింది. తాజాగా, ఉత్తరప్రదేశ్‌లోని అలీఘర్ జిల్లాలో తమ చుట్టూ మనుషులున్నా.. ఆదుకునే వారు లేక ఓ కుటుంబం ఆకలితో అలమటించింది. కొన్ని రోజులుగా తినడానికి తిండిలేక నీళ్లు మాత్రమే తాగుతూ ఉండటంతో చివరికి ఆస్పత్రి పాలైంది.
అలీఘర్ జిల్లా, మందిర్కా నగ్లా గ్రామానికి చెందిన విజయేంద్ర కుమార్ కరోనా మొదటి దశలో కరోనాతో మరణించాడు. విజయేంద్ర కుమార్ మరణించిన తర్వాత కుటుంబ పోషణ కోసం అతని భార్య గుడ్డీ దేవి ఓ ఎక్స్పోర్ట్ కంపెనీలో ప్యాకేజింగ్ సెక్షన్లో చేరినా కొద్ది రోజులకే కరోనా కారణంగా ఆ ఉద్యోగం కూడా పోయింది. ఈ నేపథ్యంలో పెద్ద కుమారుడు అజరు కూలీ పనికి వెళ్లి డబ్బులు తెచ్చేవాడు. అయితే, లాక్డౌన్ మరింత కఠినతరం చేయటంతో ఆ కూలీ పని కూడా పోయింది. దీంతో కుటుంబం పూట గడవక ఇబ్బందిపడేది. ఇది చూసిన పొరిగింటి వాళ్లు తినడానికి సహాయం చేసేవారు. దాదాపు 15 రోజుల నుంచి వాళ్లు కూడా తిండి పెట్టడం మానేశారు. రేషన్ షాపు డీలర్‌ను, ఊరి పెద్దను తిండి పెట్టమని అడిగ్గా వారు కుదరదన్నారు. ఇక అప్పటి నుంచి తినడానికి తిండి లేక అలమటిస్తున్నారు. నీళ్లు తాగి కడుపు నింపుకుంటున్నారు. మంగళవారం ఈ కుటుంబం గురించిన సమాచారం అందుకున్న ఓ ఎన్‌జిఒ సంస్థ కార్యకర్త చావు బతుకుల్లో ఉన్న వారిని ఆసుపత్రిలో చేర్పించాడు. వారికి ఆధార్ కార్డు, ఇతర ధ్రువీకరణ పత్రాలు లేకపోవటంతో ప్రభుత్వ సహాయం అందలేదని సదరు ఎన్‌జిఒ కార్యకర్త తెలిపాడు. దీనిపై స్పందించిన ఉన్నత అధికారులు వారికి అన్ని రకాలుగా సహాయం చేయటానికి ముందుకు వచ్చారు.