Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐటీ కొత్త నిబంధనలపై ఐరాస ఆందోళన
- అబ్బే అదేం లేదంటూ బుకాయించిన కేంద్రం
న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన నూతన ఐటీ నిబంధనలు అంతర్జాతీయ మానవ హక్కుల నియమావళిని పాటించలేదని ఐక్యరాజ్య సమితి పేర్కొంది. సామాజిక మాధ్యమాలను, స్ట్రీమింగ్ ఫ్లాట్‌ఫామ్‌లను, డిజిటల్ మీడియా సంస్థలను నియంత్రించేందుకు ఉద్దేశించిన ఐటీ కొత నిబంధనలు పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ ఐక్యరాజ్యసమితి మావన హక్కుల మండలి(యుఎన్‌హెచ్‌ఆర్‌సి)కి చెందిన ముగ్గురు ప్రత్యేక ప్రతినిధులు ఇరెనె ఖాన్ (భావ వ్యక్తీకరణ, ప్రకటన స్వేచ్ఛ హక్కు పరిరక్షణ ప్రతినిధి), క్లెమెంట్ యాలేత్పోస్సీ (శాంతియుతంగా సమావేశం అవ్వడం, ఆందోళన నిర్వహించే హక్కుల పరిరక్షణ ప్రతినిధి), జోసెఫ్ చెన్నటాసి ( వ్యక్తిగత గోప్యత హక్కు పరిరక్షణ ప్రతినిధి) కేంద్రానికి ఎనిమిది పేజీల లేఖ రాశారు. మావన హక్కులను కాలరాసే విధంగా ఉన్న సమాచార సాంకేతిక (ఇంటర్మీడియరీ మార్గదర్శకాలు, డిజిటల్ మీడియా నైతిక స్మృతి) నియమావళి 2021 లోని వెనక్కి తీసుకోవాలని, లేదా వాటిని పున:సమీక్షంచాలని వారు కోరారు. 'ఐటీ కొత్త నిబంధనల పట్ల చాలా ఆందోళన చెందుతున్నాం. ఇదే రూపంలో అవి అమలైతే మానవ హక్కుల నిబంధనలను ఉల్లంఘించడమే అవుతుంది' అని వారు పేర్కొన్నారు. ప్రధానంగా మొదట పోస్టు చేసినవారిని ట్రేస్ చేసేందుకు ప్రభుత్వానికి వీలుండాలనే నిబంధనపైనా, అలాగే డిజిటల్ మీడియాపై ప్రభుత్వ మితిమీరిన నిఘా వంటివి గోప్యతను, భావ ప్రకటనా స్వేచ్ఛను, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను హరించేవేనని ఆందోళన వ్యక్తం చేసింది. అంతర్జాతీయ పౌర, రాజకీయ హక్కుల రక్షణ నియమావళిని ఉల్లంఘించ డమే అవుతుందని పేర్కొన్నారు.
వినియోగదారుల సాధికారత కోసమే : కేంద్రం
ఐరాస ప్రతినిధులు తమ లేఖలో వ్యక్తం చేసిన ఆందోళనలపై కేంద్రం స్పందించింది. సామాజిక మాధ్యమాల్లో సాధారణ వినియోగదారుల సాధికారత కోసమే కొత్త నిబంధనలు తీసుకొచ్చినట్లు బుకాయించింది. నూతన నిబంధనల ద్వారా భావ ప్రకటన స్వేచ్ఛకు భంగం వాటిల్లుతుందనేది కేవలం వవ్రీకరణనేనని పేర్కొంది. ఈ మేరకు ఐక్యరాజ్యసమితి ప్రతినిధుల లేఖకు భారత పర్మినెంట్ మిషన్ ప్రతినిధి ప్రత్యుత్తరం పంపారని కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ సమాచార, సాంకేతిక మంత్రిత్వశాఖ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది. ఉగ్రవాదాన్ని ప్రేరేపించే సమాచారాన్ని, అసభ్యకర కంటెంటు, హింసాత్మక ఘటనలను రెచ్చగొట్టే సమాచారాన్ని, అలాగే ఆర్థిక మెసాలను అరికట్టాలని కొత్త నిబంధనలు అనివార్యమని ఆ లేఖలో వివరించారు. కెఎస్ పుట్టుస్వామి కేసులో సుప్రీంకోర్టు వెలువరించిన ఆదేశాలకు అనుగుణంగా వ్యక్తిగత గోప్యత హక్కును భారత్ పూర్తిగా గుర్తించి గౌరవిస్తుందని ఐక్యరాజ్యసమితికి భారత్ ప్రతినిధి హామీ ఇచ్చారు. అయితే అప్పటికే వ్యాప్తిలో ఉండి, నేర స్వభావం ఉన్న సందేశాలను, సమాచారాన్ని మాత్రమే ప్రభుత్వం కొత్త ఐటీ నిబంధనల ద్వారా సేకరిస్తుందని తెలిపారు. పైగా విస్తృత సంప్రదింపుల తర్వాతే వీటిని రూపొందించినట్లు పేర్కొనడం విశేషం.