Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హైదరాబాద్‌లో లీ.పెట్రోల్ రూ.101.04
- దేశవ్యాప్తంగా అనేక నగరాల్లో సెంచరీ మార్క్ దాటిన పెట్రోల్
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా పెట్రో ధరలు మరోసారి పెరిగాయి. ఆదివారం లీటర్ పెట్రోల్‌పై 29పైసలు, డీజిల్‌పై 28పైసలు పెంచుతూ దేశీయ చమురు విక్రయ సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. ఈనేపథ్యంలో హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ రూ.101.04కు, డీజిల్ రూ.95.89కు చేరుకున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో ఇంధన ధరలు వరుసగా రూ.97.22, రూ.87.97గా ఉన్నాయి. మే 4 తర్వాత పెట్రో ధరలు పెరగడం ఇది 27వసారి. ఈ 48 రోజుల్లో లీటర్ పెట్రోల్ రూ.6.82, లీటర్ డీజిల్ రూ.7.24 పెరిగాయి. అంతకుముందు ఐదు రాష్ట్రాల ఎన్నికల జరుగుతున్నవేళ దాదాపు 18 రోజులపాటు ధరల పెరుగుదల నిలిచిపోయింది.
ఆదివారం నాటి ధరల పెంపుతో..ముంబయిలో పెట్రోల్ రూ.103.36కు, డీజిల్ రూ.95.44కు చేరుకుంది. ఇక రాజస్థాన్‌లోని శ్రీగంగానగర్ జిల్లాలో అత్యధికంగా లీటర్ పెట్రోల్ ఏకంగా రూ.108.37కి ఎగబాకింది. ఇప్పటికే మొత్తం 7 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో లీటర్ పెట్రోల్ ధర రూ.100పైకి నమోదుకావటం తెలిసిందే. ఈ జాబితాలో రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, లద్దాక్, కర్నాటక ఉన్నాయి. అంతర్జాతీయంగా ముడి చమురు ధరల్లో మార్పులు, దేశీయంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన అధిక పన్నులే పెట్రోధరలు ఈ స్థాయికి చేరుకోవడదానికి ప్రధాన కారణమని తెలుస్తోంది. అయితే గతకొన్ని రోజులుగా అంతర్జాతీయ ధరలు కాస్త తగ్గినప్పటికీ దేశీయంగా ధరలు మాత్రం పెరగడం గమనార్హం.
పారిశ్రామికరంగంపై తీవ్ర ప్రభావం : టి.వి.నరేంద్రన్, సీఐఐ అధ్యక్షుడు
నిత్యం పెరుగుతున్న ఇంధన ధరలతో పారిశ్రామికరంగంపై తీవ్ర ప్రభావం పడుతోంది. ధరల్ని తగ్గించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే చర్యలు చేపట్టాలి. ధరల్ని తగ్గించే సమయం వచ్చింది. తద్వారా పరిశ్రమలకు, సామాన్య పౌరులకు ఉపశమనం కలుగుతుంది. పెట్రో ఉత్పత్తుల్ని జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలి. ఇందుకోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు ముందుకు రావటం లేదో నాకర్థం కావటం లేదు. ఉదాహరణకు విమానయాన సంస్థలు తమ ఆదాయంలో 60శాతం విమాన ఇంధనం కోసం ఖర్చు చేయాల్సివస్తోంది.