Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అఖిలపక్ష సమావేశానికి కేంద్రం ఆహ్వానంపై చర్చ
శ్రీనగర్/న్యూఢిల్లీ : ఈ నెల 24న ప్రధాని మోడీ నేతృత్వంలో నిర్వహించతలబెట్టిన అఖిలపక్ష సమావేశానికి సంబంధించిన వచ్చిన ఆహ్వానంపై చర్చించేందుకు మాజీ సిఎం ఫరూక్ అబ్ధుల్లా నేతృత్వంలోని ఐదు రాజకీయ పార్టీలతో కూడిన గుప్కర్ కూటమి మంగళవారం భేటీ కానుంది. మోడీతో సమావేశానికి హాజరుకావడంపై ఆయా పార్టీలకు చెందిన నేతలు చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. మరోవైపు అఖిలపక్ష సమావేశ ఆహ్వానంపై జమ్ముకాశ్మీర్‌కు చెందిన పార్టీలు విడిగా సమాలోచనలు జరుపుతున్నాయి. ఇందులో భాగంగా పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ(పిడిపి) అధ్యక్షురాలు, మాజీ సిఎం మెహబూబా ముఫ్తీ అధ్యక్షతన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ భేటీ అయింది. కేంద్ర ప్రభుత్వ ఆహ్వానంపై సభ్యులు తమ అభిప్రాయాలు పంచుకున్నారు. మోడీతో సమావేశానికి హాజరుకావడంపై తుది నిర్ణయం తీసుకునే అధికారాన్ని ముఫ్తీకి ఇస్తూ పిఎసి తీర్మానం చేసింది. గుప్కర్ కూటమి సమావేశంలో ముఫ్తీ తుది నిర్ణయం తీసుకుంటారని పిడిపి అధికార ప్రతినిధి సుహైల్ భుకారి పేర్కొన్నారు.
మోడీతో భేటీకి గుప్కర్ కూటమి నేతగా నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్ధుల్లాను పంపేందుకు ముఫ్తీ ప్రతిపాదించే అవకాశం ఉందని సమాచారం. జమ్ముకాశ్మీర్‌కు స్వయంప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ 2019, ఆగస్టు 5న పార్లమెంట్ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ఆ తరువాత జమ్ముకాశ్మీర్ నేతలతో ప్రధాని మోడీ అఖిలపక్ష సమావేశం నిర్వహించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. 24న జరిగే ఈ సమావేశానికి సంబంధించి కేంద్ర హోంశాఖ శనివారం 14 మంది నేతలకు ఆహ్వానాలు పంపింది. ఈ సమావేశంలో ప్రధానంగా జమ్ముకాశ్మీర్ పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనతో పాటు పలు ఇతర అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉందని అధికారిక వర్గాల సమాచారం. ఈ సమావేశానికి హాజరవుతామని ఇప్పటికే బిజెపి, జమ్ముకాశ్మీర్ అప్నీ పార్టీ ప్రకటించాయి.
రాష్ట్ర హోదాను పురుద్ధరించండి : కాంగ్రెస్
జమ్ముకాశ్మీర్‌కు రాష్ట్ర హోదాను కేంద్ర ప్రభుత్వం వెంటనే పునరుద్ధరించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. రాజ్యాంగబద్ధంగా, ప్రజా స్వామ్యానికి అనుగుణంగా నడుచుకోవాలని ప్రధాని మోడీకి ఆ పార్టీ అధికార ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా హితవు పలికారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ జమ్ముకాశ్మీర్‌కు స్వయంప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేయడం ద్వారా మోడీ సర్కార్ ప్రజాస్వామ్యం, రాజ్యాంగ విలువలపై చేసిన దాడి అని విమర్శించారు. జమ్ముకాశ్మీర్‌కు రాష్ట్ర హోదా ఇచ్చి, అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించడం ద్వారానే.. ఢిల్లీ పాలన కాకుండా అక్కడి ప్రజలకు సొంతంగా పాలించుకునే అవకాశం ఉంటుందని అన్నారు. అయితే ఈ సమావేశానికి కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి హాజరయ్యేదానిపై ఆయన స్పష్టత ఇవ్వలేదు.