Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సెకండ్‌వేవ్ సమయంలోనే.. కరోనా మరణాలేనా?
పాట్నా: దేశంలో కరోనా ప్రభావం కొనసాగుతూనే ఉంది. అయితే, పలు రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా కేసులు, మరణాలకు సంబంధించిన పక్కా సమాచారం అందించడం లేదని ఆరోపణలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల బీహార్ ప్రభుత్వం సైతం కరోనా మరణాను దాచిపెడుతోందని సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం జోక్యం చేసుకోవడంతో.. అప్పటివరకు ఉన్న కరోనా మరణాలను సవరించి వెల్లడించింది. అయినప్పటికీ.. నిజమైన సమాచారం వెల్లడించలేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. తాజాగా ఈ ఆరోపణలకు బలం చేకూరేలా.. ఇదివరకు కరోనా మరణాలు 5 వేలు కాదు 9 వేలకు పైనే అంటూ సవరించిన బీహార్‌లో.. ప్రస్తుతం లెక్కలోకి రాని మరణాలు ఏకంగా 75 వేలకు పైగా సంభవించినట్టు తెలిసింది. దీనికి తోడు ఈ మరణాలకు కారణాలు ఎంటనేది కూడా అధికారిక రికార్డులో చేర్చలేదు. అంటే ప్రస్తుతం బీహార్ చూపించిన కరోనా మరణాలు 7,717కు దాదాపు 10 రెెట్లు అధికంగా ఉండటం గమనార్హం. రాష్ట్రంలో 2019లో జనవరి-మే మధ్య 1.3 లక్షల మరణాలు సంభవించాయి. అదే 2021లో మాత్రం వీటి సంఖ్య 2.2 లక్షలుగా ఉంది. అంటే 82,500 (62 శాతం) ఎక్కువ. వీటిలోనూ సగానికిపైగా మరణాలు మే నెలలోనే సంభవించాయి. దీంతో బీహార్ రాష్ట్ర కరోనా మరణాలపై అనేక సందేహాలు, అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, ప్రభుత్వం ఈ నెలలో కోవిడ్ మరణాలను సవరిస్తూ.. 3,951 మరణాలను అదనంగా చేర్చింది. ప్రభుత్వం చూపించిన కరోనా మరణాలను తీసేసినా 74,808 మరణాలు ఎప్పుడు, ఏ కారణంతో సంభవించాయన్నది మాత్రం తెలియలేదు.
కాగా, మధ్యప్రదేశ్, ఢిల్లీ, ఏపీ, తమిళనాడు, కర్నాటక రాష్ట్ర ప్రభుత్వాలు సైతం కరోనా మరణాలను తక్కువ చేసి చూపిస్తున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. లెక్కలోకి రాని మరణాలు ఈ ఐదు రాష్ట్రాల్లో 4.8 లక్షల వివరించలేని మరణాలు ఉన్నాయని ఎన్డీటీవీ విశ్లేషణ పేర్కొంది. ఇక బీహార్‌లో కరోనా సెకండ్ వేవ్ సమయంలోనే ఏ కారణాలను పేర్కొనకుండా సంభవించిన 75 వేలకు పైగా మరణాలు ఉండటం పట్ల సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. దేశంలో కరోనా మరణాలు ప్రభుత్వాలు సరిగా వెల్లడించడం లేదనే ఆరోపణలకు ఇవి మరింత బలం చేకూరుస్తున్నాయి.