Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కూలి చెల్లింపులోనూ కులం కుంపటి
- ఎస్సీ, ఎస్టీలకు వేరుగా
ఇవ్వాలని నిర్ణయం
- ఏడేండ్ల నుంచి క్రమంగా చట్ట నిర్వీర్యం
- మోడీ సర్కారు విధానాలతో నివ్వెరపోతున్న ఉపాధి కూలీలు
- నేడు రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయ కార్మిక, దళిత, ప్రజా సంఘాల ఆందోళనలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఉపాధి హామీ కూలీలకు వేతనాల చెల్లింపులో కులం కుంపటిని రాజేసే కుట్రకు కేంద్ర ప్రభుత్వం పూనుకున్నది. గ్రామాల్లో సామాజిక, ఆర్థిక అంతరా లను రూపుమాపి అందర్నీ సమానంగా చూడాలనే ఉపాధి హామీ చట్టం మూలసూత్రాలకే తూట్లు పొడుస్తున్నది. ఇతరుల నుంచి వేరు చేసి ఎస్సీ,ఎస్టీ సామాజిక తరగతికి చెందిన కూలీల వేతనాలను సబ్‌ప్లాన్ నిధుల కింద ఇవ్వజూస్తున్నది. ఈ నేపథ్యంలో వ్యవసాయ కార్మిక, గిరిజన, ఆదివాసీ గిరిజన, కేవీపీఎస్, ఇతర ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టనున్నారు. కరోనా కాలంలో పనుల్లేక గతేడాది, ఈసారీ పట్టణాల నుంచి సొంతూర్లకు తిరిగి వెళ్లిపోయిన ప్రజలకు అక్కున చేర్చుకుని ఉపాధి కల్పించింది మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టమే. యూపీఏ-1 ప్రభుత్వ హయాంలో కామన్ మినిమమ్ ప్రోగ్రాంలో భాగంగా వామపక్ష పార్టీల ఒత్తిడితో ఈ చట్టం పురుడుపోసుకున్నది. గ్రామీణ ప్రాంతాల్లో పేద ప్రజల కొనుగోలు స్థాయిని పెంచడం, పేద, ధనిక, సామాజిక అంతరాలను తగ్గించడం చట్టం ప్రధాన ఉద్దేశం. మోడీ సర్కారు వచ్చాక క్రమంగా ఈ చట్టాన్ని నిర్వీర్యం చేస్తున్నది. పనిప్రదేశాల్లో కూలీలకు కనీస సౌకర్యాలు కల్పించాల్సి ఉండగా ఏడున్నరేండ్ల కాలంలో గడ్డపార, పార, తట్ట ఇలాంటి పరికరాలేమీ ఇవ్వలేదు. పనిప్రదేశాల్లో నీటి సౌకర్యాన్ని కల్పించాలనే నిబంధనను గాలికొదిలేసింది. టెంటు వేయడం, కూలీల పిల్లల పర్యవేక్షణ, ఇలాంటివన్నీ అమలైతే ఒట్టు. కూలీలు కనీస వేతనాలు అందకపోయినా, సకాలంలో చెల్లించకపోయినా చర్యలు తీసుకోవాలని చట్టంలో స్పష్టంగా ఉంది. కానీ, నెలల తరబడి కూలీలకు వేతనాలను పెండింగ్‌లో పెడుతున్నది. యాంత్రీకరణ పనులకు నిధులు పెంచుతూ పోతున్నది.
కూలి చెల్లింపులోనూ వివక్ష
ఉపాధి హామీ చట్టంలో ఒకటుంటే మరోటి చేస్తూ పోతున్న మోడీ సర్కారు ఇప్పుడు ఏకంగా కులాల పేరుతో ఉపాధి హామీ కూలీలను నిలువునా చీల్చే ప్రయత్నానికి పూనుకున్నది. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ కింద ఎస్సీ, ఎస్టీ కూలీలకు బిల్లులను చెల్లించే ప్రయత్నం జరుగుతున్నది. వాస్తవానికి ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులను దళిత, గిరిజన, ఆదివాసీ గ్రామాల్లో, వాడల్లో అభివృద్ధికి ఉపయోగించాలి. తాజాగా ఆ నిధులను ఉపాధి హామీ పనులకు మళ్లించాలనుకోవడం దారుణమనీ, ఇక్కడ రెండు చట్టాలూ ఉల్లంఘనకు గురవుతున్నాయని ప్రజా సంఘాలు విమర్శిస్తున్నాయి. ఎస్సీ, ఎస్టీ కూలీలకు 8 నుంచి 11 వారాల బిల్లులు చాలా గ్రామాల్లో పెండింగ్‌లో పెట్టగా వ్యవసాయ కార్మిక సంఘం, దళిత, గిరిజన, ఆదివాసీ గిరిజన సంఘాలు ఆందోళన బాట పట్టడంతో ప్రస్తుతానికి కొన్ని చోట్ల కూలీలకు డబ్బులు ఖాతాల్లో పడ్డాయి. కొన్ని చోట్ల ఇంకా రావాల్సి ఉంది. వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు ఉన్నతాధికారుల వద్ద ఆరా తీస్తే 'బడ్జెట్ కేటాయింపులో ఎస్సీ, ఎస్టీ, అదర్స్ అని డివైడ్ చేశారు. ఇక నుంచి ఎస్సీ, ఎస్టీలకు సపరేట్గా ఇస్తారు. సాఫ్ట్‌వేర్‌లో ఎంట్రీలు జరుగుతున్నాయి. ఆ సమస్య తీరగానే యూనిఫామ్‌గా వస్తాయి' అని చెప్పారు. పాలకుల నిర్ణయం వల్ల దాదాపు రాష్ట్రంలోని యాక్టివ్ కూలీల్లో 17 లక్షల మంది ఎస్సీ సామాజిక తరగతి, 14,50,000 వేల మంది ఎస్టీ సామాజిక తరగతి కూలీలు ఇబ్బందులు ఎదుర్కొంటారు. కులాల ఆధారంగా అకౌంట్లు ఏర్పాటు చేసి ఆ నెలకు సంబంధించిన డబ్బులను ఆయా అకౌంట్లలో వేస్తామని అధికారులు చెప్పడం హాస్యాస్పదంగా ఉందని సామాజిక వేత్తలు అభిప్రాయపడుతున్నారు.
కులాలవారీగా వేతనాల చెల్లింపు చట్టవిరుద్ధం
గ్రామీణ ఉపాధి హామీ చట్టం ప్రకారం కులాల ఆధారంగా డబ్బులివ్వడం నిబంధ నలకు విరుద్ధం. కూలీల మధ్య అనైక్యతకు ఇది దారి తీస్తుంది. ఎక్కువ, తక్కువ అనే భావనలు బయలుదేరుతాయి. సామాజిక, ఆర్థిక అంతరాలను తగ్గించాలనే చట్ట మూల సూత్రానికి విఘాతం కలిగిస్తుంది. సమాన పనికి సమాన వేతనం వంటి లక్ష్యాలకు తూట్లు పొడవటమే అవుతుంది.
- బుర్రి ప్రసాద్, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు