Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 'కరోనా మరణం'పై 1163 క్లెయిమ్‌లు
- కోవిడ్ సమయంలో పథకం అమలు తీరిది
- లబ్దిదారుల కుటుంబీకుల ఇక్కట్లు : ఆర్టీఐ
పేదలను ఆదుకుంటామంటూ లెక్కలేనన్నీ పథకాలను మోడీ ప్రభుత్వం తెరపైకి తెచ్చింది. వీటిలో సగానికి పైగా పథకాలు అడ్రస్‌లేకుండా పోయాయి. కనీసం ఉన్న స్కీంలు ఏమైనా సాయపడుతున్నాయా.. అంటే లేదనే అంటున్నారు. తాజాగా పీఎం జీవనజ్యోతి బీమా పథకం అమలైన తీరు చూస్తే..బీజేపీ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు లబ్దిదారులకు అందక ఆ కుటుంబాలు పడుతున్న ఆవేదన అరణ్యరోదనగా మారుతున్నది.
న్యూఢిల్లీ : దేశంలో కరోనా మహమ్మారి సెకండ్ వేవ్‌తో ఎందరో ప్రజలు తమ విలువైన ప్రాణాలను కోల్పోయారు. దీంతోమృతుల కుటుంబాలు, ముఖ్యంగా పేదరికంలో మగ్గుతున్నవారు తీవ్ర కష్టాలను ఎదుర్కొంటున్నారు. కుటుంబ పెద్దను కోల్పోయినవారి పరిస్థితి అయితే వర్ణనాతీతం. వారంతా ప్రభుత్వ పరిహారం కోసం వేచి చూస్తున్నారు. ఇదిలా ఉండగా, తాము చనిపోయినప్పటికీ తమ కుటుంబీకులకు ఆర్థికంగా ఇబ్బందులు తలెత్తకుండా ఉండటానికి ఎందరో ప్రజలు ప్రధాన మంత్రి జీవన జ్యోతి బీమా యోజన (పీఎంజేజేబీవై) కింద చేరారు. అయితే, దేశంలో ఈ స్థాయిలో కరోనా మహమ్మారి విజృంభించి వేలాది మంది ప్రాణాలను హరిస్తున్న తరుణంలో అండగా నిలవాల్సిన పీఎంజేజేబీవై మాత్రం వారికి అంతగా విశ్వాసాన్ని కలిగించటం లేదు. సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ)కింద దాఖలు చేసిన దరఖాస్తుకు సమాధానంగా ఈ విషయం వెల్లడైంది. ఇందులో పలు ఆసక్తికర అంశాలు వెలుగుచూశాయి.
ఐఆర్డీఏఐ, కేంద్రం గణాంకాల మధ్య వ్యత్యాసం..!
కేంద్ర పాలసీని ఎంచుకున్న లబ్దిదారుల కుటుంబాలు ఈ పథకం నుంచి తక్కువ క్లెయిమ్స్ పొందుతుండటం గమనార్హం. 2021 మార్చి 30 వరకు కరోనా వైరస్‌కు సంబంధించిన మరణంపై 1163 మందికి మాత్రమే క్లెయిమ్‌లు వచ్చాయని ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఐఆర్డీఏఐ) వెల్లడిచింది. అయితే, దీని కింద రూ. 23.26 కోట్లు మాత్రం చెల్లింపులకు నోచుకోవడం గమనార్హం. పాలసీ పరిధిలో మరణించిన వారి సంఖ్యతో పోల్చుకుంటే ఈ సంఖ్య చాలా తక్కువ.ఐఆర్డీఏఐ ఆర్టీఐ స్పందన ప్రకారం.. ఈ ఏడాది మార్చి 31 వరకు పీఎంజేజేబీవై పరిధిలో మొత్తం వ్యక్తుల సంఖ్య 4.94 కోట్లు. అదే సమయంలో బీమా పథకం పరిధిలో 10 కోట్లకు పైగా వ్యక్తులు ఉన్నారని ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిధిలోని ఆర్థిక సేవల విభాగం సమాచారం. అయితే, ఐఆర్డీఏఐ, ఆర్థిక మంత్రిత్వ శాఖల గణాంకాల మధ్య విసృత వ్యత్యాసం ఉండటం ఇక్కడ గమనించాల్సిన అంశం. అయితే, బీమా పాలసీని పునరుద్దరించని వారి పేర్లను కేంద్రం తొలగించకపోవడం కారణంగానే లబ్దిదారుల విషయంలో ఈ రెండు విభాగాల గణాంకాలు భిన్నంగా ఉన్నాయి. అయితే, లబ్దిదారుల సంఖ్యను అధికంగా చూపెట్టి ప్రశంసలు పొందాలన్నదే మోడీ సర్కారు ఉద్దేశంగా కనిపిస్తున్నదని విశ్లేషకులు ఆరోపించారు.
పథకం కింద ఐదు కోట్ల మంది మాత్రమే..!
2015-16లో మొత్తం 2.73 కోట్ల మంది బీమా పాలసీని తీసుకున్నారు. అయితే, వీరిలో 2.25 కోట్ల మంది 2016-17లో పాలసీని పునరుద్ధరించారు. అయితే, 48.5 లక్షల మంది మాత్రం దీనిని పునరుద్ధరించలేదు. అయితే, ఇదే ఏడాది మొత్తం 28.7 లక్షల మంది కొత్తగా బీమా పాలసీలోకి వచ్చారు. ఈ కారణంగా మొత్తం లబ్దిదారుల సంఖ్య కిందటేడాదితో పోలిస్తే 2.53 కోట్లకు తగ్గింది. ఈ ప్రక్రియ కారణంగా, 2017-18లో మొత్తం నమోదు కూడా 2.53 కోట్లుగా ఉన్నది. ఐఆర్డీఏఐ ప్రకారం.. మొత్తం నమోదు సంఖ్య 2018-19లో 2.98 కోట్లు, 2019-20లో 3.76 కోట్లు, 2020-21లో 4.94 కోట్లకు పెరిగింది. అయితే, దాదాపు 140 కోట్ల జనాభా ఉన్న భారతదేశంలో పీఎంజేజేబీవైలో మొత్తం లబ్దిదారుల సంఖ్య దాదాపు ఐదు కోట్లుగానే ఉండటం గమనార్హం. దేశంలోని సామాన్యప్రజలకు, ముఖ్యంగా పేదలకు, నిరుపేదలకు సార్వత్రిక సామాజిక భద్రతా వ్యవస్థను సృష్టించే లక్ష్యంతో గత ఏడేండ్లలో ' అభివృద్ధి' అని పిలువబడేది ప్రభావవంతంగా ఉండటంలో విఫలమైందని ఈ సమాచారం ద్వారా తెలుస్తోంది.
2020-21లో అత్యధికంగా 1.83 కోట్ల మంది చేరిక
కరోనా తీవ్రత పెరిగాక..తాము చనిపోయినా కనీసం తమ కుటుంబీకులకు కష్టకాలంలో ఎంతో కొంత ఊరట కలుగుతున్నదని దేశప్రజలు భావిస్తున్నారు. ఈ పథకం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు 2020-21 ఏడా దిలో అత్యధికంగా 1.83 కోట్ల మంది ఇందులో చేరారు. ఇందుకోసం ఇప్పటివరకు వారు అత్యధికంగా రూ. 1309 కోట్ల రూపాయలు ప్రీమింగా చెల్లించారు. అయితే, 2020-21లో మాత్రం 65,322 మంది మాత్రమే బీమా క్లెయిమ్‌ల కోసం దరఖాస్తు చేసుకోవడం గమనించాల్సిన అంశం. ఇందులో 60,908 మందికి రూ. 1218 కోట్లు క్లెయిమ్ కింద పంపిణీ జరిగింది. అయితే, ఈ ఏడాదిలో క్లెయిమ్ కేసులు పెరగడానికి గల ప్రధాన కారణం కోవిడ్- 19 అని చెప్పొచ్చు. అయితే, 1163 మంది మాత్రమే కరోనా కారణంగా మరణించారని క్లెయిమ్ కోసం దరఖాస్తు లు రావడం గమనార్హం. దీని కోసం అయిన రూ. 23.26 కోట్ల విలువైన క్లెయిమ్‌లు వచ్చాయని ఆర్టీఐ సమాధానం.
4,414 మందికి ఇంకా అందని బీమా నగదు
పీఎంజేజేబీవై ప్రారంభం నుంచి 2021 మార్చి 31 వరకు మొత్తం 2.83 లక్షల మంది బీమా క్లెయిమ్‌ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. అందులో 2.70 లక్షల మందికి రూ. 5,396 కోట్ల పంపిణీ జరిగింది. ఇంకా 13వేల మంది క్లెయిమ్ అమౌంట్‌ను అందుకోవాల్సి ఉన్నది. ఇందులో 4,414 మంది 2020-21 మహమ్మారి కాలంలో దరఖాస్తు చేసుకున్నవారే కావడం గమనార్హం. ఇక ఇందులో విశేషమేమంటే, ఈ పథకం కింద పేరు నమోదు చేసుకున్న పేదవారు ఎందరో ఉన్నారు. అయితే, వీరిలో ఎందరు ఈ పథకం కింద ఉన్నారన్న విషయం మృతుల కుటుంబాలకు సమాచారం లేకపోవడంతో వారు బీమా క్లెయిమ్ కోసం దరఖాస్తు చేసుకోలేకపోతున్నారు.