Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : పేదరికంలో ఉన్న ప్రజలకు జాతీయ ఆహార భద్రత పథకం (ఎన్ఎఫ్హెచ్ఎస్) హామీనివ్వడం లేదు.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అలసత్వం కారణంగా అర్హులైన ప్రజలు పథకం ప్రయోజనాలను పొందలేకపో తున్నారు. దీంతో దేశంలో చాలా మంది ప్రజలు ఆకలి కష్టాలను ఎదుర్కొం టున్నారు. దాదాపు 45 శాతం మంది భారతీయులు ఈ ఆహార భద్రత నుంచి మినహాయింపునకు గురైనట్టుగా గణాంకాలు తెలియజేస్తున్నాయి. రైతుల నుంచి కాలానుగుణ పంటలను క్రమపద్ధతిలో సేకరించి నిల్వ చేయడానికి, ప్రతి నెలా గృహాలకు తిరిగి పంపిణీ చేయడానికి జాతీయ ఆహార భద్రతా చట్టం హామీనిస్తుంది. యూపీఏ హయాంలో 2013లో ఈ చట్టం ఆమోదం పొందిన విషయం తెలిసిందే. అయితే, చట్టం యొక్క తుది సంస్కరణ భారతీయులందరికీ సార్వత్రిక కవరేజీని నిర్ధారించలేదు. అలాగే, రైతులకు వారి పంటలకు కనీస మద్దతు ధరను హామీనీ ఇవ్వలేదు. బదులు గా, చట్టపరమైన హామీ గ్రామీణ ప్రాంతాల్లోని 75 శాతం భారతీయులకు, పట్టణ ప్రాంతాల్లోని 50 శాతం మందికి సబ్సిడీ ధరలకు 5 కిలోల ఆహార ధాన్యాలకు మాత్రమే విస్తరించింది. మహమ్మారిని తట్టుకోవడంలో భాగంగా 2020 మార్చిలో ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజనను ప్రకటించారు. ఇప్పటికే ఆహార చట్టం నుంచి లబ్ది పొందిన అదే 80 కోట్ల మంది భారతీయులకు అదనంగా 5 కిలోల ఉచిత ఆహార ధాన్యాన్ని అందించాలని ప్రభుత్వం ప్రకటించింది. ఇటీవలే దీనిని దీపావళి వరకు పొడిగించిన విషయం విదితమే. అయితే, ఇది అసమానతను తగ్గించడం కంటే దానిని మరింత తీవ్రతరం చేస్తుందని నిపుణులు ఆవేదన వ్యక్తం చేశారు. కారణం.. ఎన్ఎఫ్హెచ్ఎస్ రేషన్ కార్డులు లేని లక్షలాది కుటుంబాలు దేశవ్యాప్తంగా చాలా ఉన్నాయనీ, ఈ కుటుంబాలకు ఆహారధాన్యాలు అందక ఆకలి కష్టాలను ఎదుర్కొంటున్నాయని చెప్పారు.
సాధారణంగా పట్టణల్లో ఉండే వలసదారులు రేషన్ కార్డులను కలిగి ఉండకపోవడం లేదా కలిగి ఉన్నా.. వాటిని వారు తమ వెంట తీసుకురాకపోవడం వంటి సమస్యలు ఉంటాయి. అయితే, ఇలాంటి అంశాలే గతేడాది లాక్డౌన్ సమయంలో వారిని తీవ్ర ఇబ్బందులకు గురి చేశాయి. అయితే, 2021లో దేశ జనాభా 130 కోట్లను దాటి నమోదవుతుందని అంచనాలు ఉన్నాయి. అయినప్పటికీ, గత దశాబ్దకాలంగా ఎన్ఎఫ్ఎస్ఏ రేషన్ కార్డు జాబితాలు నవీకరించ బడకపోవడం గమనార్హం. ఇదిలా ఉండగా, ఈ పథకం కింద అర్హులైన ఎందరో ప్రజల పేర్లు నమోదుకు నోచుకోలేదు. ముఖ్యంగా పదేండ్లలోపు పిల్లలను ఇందులో చేర్చడం జరగలేదు. ప్రస్తుతం భారత జనాభాలో 45 శాతం మంది జాతీయ ఆహార భద్రతా చట్టం నుంచి మినహాయించబడ్డారని సాధారణ గణాంకాలు చెప్తున్నాయి. ఇక రాష్ట్రాలవారీగా చూసుకుంటే ఈ పరిస్థితి తీవ్రత అర్థమవుతుంది. ప్రస్తుతం ప్రధాని మోడీ సొంత రాష్ట్రం గుజరాత్లో సగం జనాభా ఎన్ఎఫ్ఎస్ఏ జాబితా నుంచి తొలగింపునకు గురయ్యారు. అలాగే, ఆంధ్రప్రదేశ్, తెలంగాణల నుంచి 49 శాతం మంది చొప్పున, ఉత్తరాఖండ్ నుంచి 48 శాతం మంది, పశ్చిమబెంగాల్ నుంచి 39 శాతం మంది, ఉత్తరాఖండ్ నుంచి 36 శాతం మంది ఎన్ఎఫ్ఎస్ఏ కు నోచుకోవడంలేదు. దీంతో ఈ కుటుంబాలు ఇటు ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన బొనాంజా నుంచి కానీ, కేంద్రం అధిక ప్రచారం కల్పించిన 'వన్ నేషన్ వన్ రేషన్' పథకం నుంచి కానీ పొందే అవకాశం కూడా ఉండదు. మరోపక్క, 80 కోట్ల మంది లబ్దిదారులు ఉన్నారని మోడీ ప్రభుత్వం చెప్తోంది. కానీ, ప్రభుత్వ పోర్టల్లో ఈ సంఖ్య 79.30 కోట్లుగానే ఉన్నది. ఈ కారణంతోనే అర్హులైన పేద ప్రజలకు ఎన్ఎఫ్ఎస్ఏ రేషన్ కార్డులు అందించాలని ఈనెల 2న రాష్ట్రాలను కేంద్రం ఆదేశించింది. కాగా, దేశంలో 'ఆకలి మరణాల'పై నిపుణులు, విశ్లేషకులు ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రంలో మోడీ సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా ఆకలి మరణాలు ఎక్కువయ్యాయని చెప్పారు. జార్ఖండ్, యూపీ, బీహార్, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో నమోదైన పలు ఘటనలను వారు ఉదహరించారు. అయితే, జాబితా నుంచి అర్హుల పేర్లను తొలగించడమే 'ఆకలి మరణాలకు' కారణమని చెప్పారు. ఈ మరణాల్లోనూ అధికం దళితులు, ఆదివాసీలు, ముస్లిం లు ఉండటం గమనార్హం. ఇక మహమ్మారి కాలంలో ఈ పరిస్థితి ఇంకా దారుణంగా తయారైందని కొన్ని గణాంకాలను ఉదహరిస్తూ విశ్లేషకులు వివరించారు.