Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- త్రిపుర మూకదాడిలో ముగ్గురు యువకులు మృతి
అగర్తల: పశువులను దొంగిలించినట్టు అనుమానిస్తున్న ముగ్గురు యువకులపై జరిగిన మూకదాడి త్రిపురలో చోటుచేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురు యువకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడి గురించి పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. సెపాహిజాలా జిల్లాలోని సోనమురా సబ్ డివిజన్ గ్రామాలకు చెందిన యువకులు ఖోవాయి జిల్లాలోని ఉత్తర మహారాణిపూర్ వద్ద పశువులను దొంగిలించి మినీ ట్రక్కులో రవాణా చేస్తున్నారని ఆరోపిస్తూ.. ఆ యువకులపై ఓ ముక దాడి చేసింది. ఈ దాడిలో ముగ్గురు యువకులు బిల్లాల్ మియా, జాయిద్ హుస్సేన్, సైఫుల్ ఇస్లాం ప్రాణాలు కోల్పోయారు. ఈ గుంపు బిల్లాల్, జాయిద్లను ఘటనా స్థలిలోనే చెట్టుకు కట్టి కర్రలతో తీవ్రంగా కొట్టింది. సైపుల్ ఇస్లాం పారిపోగా.. మరో గ్రామం వద్ద అతన్ని పట్టుకుని కొట్టడంతో చనిపోయాడు. విషయం తెలుసుకున్న పోలీసులు యువకులను ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే వారు చనిపోయినట్టు వైద్యులు తెలిపారు. ఒక మినీ ట్రక్కును, ఐదు పశువులను స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు వెల్లడించారు. అలాగే, ఉత్తర మహారాణిపూర్ సమీపంలోని నమన్జోరుపారాలో పశువులు దొంగిలించబడినట్టు.. దీనిపై ఫిర్యాదులు అందినట్టు తెలిపారు. ప్రస్తుత దాడిపై కేసు నమోదు చేశామనీ, దర్యాప్తు కొనసాగుతున్నదని వివరించారు.