Authorization
Mon Jan 19, 2015 06:51 pm
లక్నో: దేశంలో పెట్రోల్ డీజీల్ ధరల పెరుగుదల ఓ పెండ్లి కుమారుడిని వధువు ఇంటికి ఎండ్ల బండిపై వెళ్లేలా చేసింది. ఒకటి రెండు కిలో మీటర్లు కాదు.. ఏకంగా 35 కిలో మీటర్లు ఎండ్ల బండ్లపై వరుడి తరఫు వారు వధువు గృహానికి ఊరేగింపుగా వెళ్లారు. వివరాల్లోకెళ్తే.. దేశంలో గతంలో ఎన్నడూ లేనంతగా ప్రధాని మోడీ నేతృత్వంలోని బీజేపీ పాలనలో పెట్రోల్, డీజీల్ ధరలు భారీగా పెరుగుతున్నాయి. ఇదిరకు ఉన్న రికార్డులను చెరిపేస్తూ.. చమురు ధరలు కొత్త రికార్డులు నెలకొల్పుతున్నాయి. మే 4 నుంచి ఇప్పటివరకు దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు 27 సార్లు పెరుగగా, ఒక్క మే నెలలోనే 16 సార్లు పెరిగాయి. గత 48 రోజుల్లో లీటర్ పెట్రోల్ పై రూ.6.82, లీటర్ డీజిల్ పై రూ.7.24 పెరిగింది. దేశంలోని చాలా రాష్ట్రాల్లో లీటరు పెట్రోల్ ధర సెంచరీ దాటింది. డీజిల్ సైతం వంద రూపాయల దిశగా పరుగులు పెడుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి. అత్యధికంగా రాజస్థాన్లోని గంగానగర్లో లీటరు పెట్రోల్ రూ.108.37, డీజిల్ రూ.101.12 ఉండగా, దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో పెట్రోల్ ధర రూ.103.36గా ఉంది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఈ నేపథ్యంలోనే ఉత్తరప్రదేశ్లోని డియోరియా ప్రాంతానికి చెందిన ఓ వరుడి కుటుంబం చమురు ధరల పెరుగుదల నేపథ్యంలో 35 కిలో మీటర్ల దూరంలో ఉన్న వధువు గృహం ఉన్న కుషారి గ్రామంలోని పఖ్రీ బజార్లో ఉన్న వివాహ వేదికకు ఎండ్లబండ్లపై వెళ్లారు. బంధువులు సైతం ఆ బండ్లల్లోనే ఊరేగింపుగా వెళ్లడం గమనార్హం. దీనిపై వరుడు ఛోటే లాల్ పాల్ మీడియాతో మాట్లాడుతూ.. ''ఇంధన ధరలు పెరుగుతున్నాయి. వాహనాలు కాలుష్యాన్ని కలిగిస్తాయి. కాబట్టి నా వివాహం కోసం ఎండ్లబండల్లపై ఊరేగింపుగా వెళ్లాలనుకున్నాను. ఇది మన పాత సంప్రదాయం కూడాను'' అంటూ పేర్కొన్నారు.