Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏపీలో మార్కుల కోసం ఉన్నతస్థాయి కమిటీ
- సుప్రీం ఆదేశాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం
అమరావతి :పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలను రద్దు చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. జులై 31వ తేది లోపు పరీక్షలు నిర్వహించి, ఫలితాలు ప్రకటించాలంటూ సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. గురువారం సాయంత్రం జరిగిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ ఈ విషయం చెప్పారు. సుప్రీంకోర్టు ఇచ్చిన సమయం పరీక్షలు నిర్వహించి, ఫలితాల వెల్లడికి సరిపోదని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన తెలిపారు. పరీక్షల నిర్వహణకు 15 రోజులు ముందుగా షెడ్యూల్ విడుదల చేస్తామని గతంలో చెప్పామని, పరీక్షల నిర్వహణ, ఫలితాలు విడుదల చేసేందుకు మరో 45 రోజుల సమయం పడుతుందని ఆయన వివరిం చారు. సుప్రీంకోర్టు అంత సమయం ఇవ్వలేదని అన్నారు. పరీక్షల విషయంలో ప్రభుత్వం నుంచి ఎలాంటి లోపం లేదని, అన్ని నిబంధనలు పాటిస్తూ నిర్వహణకు ప్రయత్నించామన్నారు. ఇతర రాష్ట్రాల్లో అడ్మిషన్లు రాష్ట్ర విద్యార్ధులకు ఆటంకం కలగకూడదని ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. టెన్త్, ఇంటర్ పరీక్షల మార్కులు ఏ విధంగా ఇవ్వాలో అనే అంశంపై విధివిధానాలు రూపకల్పనకు ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. మూల్యాంకనం విధి విధానాలను కూడా కోర్టుకు పది రోజుల్లో సమర్పిస్తా మన్నారు. ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం విద్యార్ధుల ప్రాక్టికల్స్ మాత్రమే అందుబాటులో ఉన్నా యని తెలిపారు. ఇతర రాష్ట్రాల బోర్డులు, సిబిఎస్ఇ అనుసరించిన విధానాలపై కూడా అధ్యయనం చేస్తామన్నారు. కమిటీ చేసిన సిఫార్సులను బట్టి నిర్ణయం తీసుకుంటామన్నారు. సుప్రీంకోర్టు అవ కాశం ఇస్తే కరోనా నిబంధనలు పాటిస్తూ గదికి 15 మందిని కూర్చొపెట్టి పరీక్షలు నిర్వహిస్తామని విలేక రులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. రాష్ట్రంలో 10.20లక్షల మంది ఇంటర్మీడియట్, 6.40లక్షల మంది పదో తరగతి విద్యార్ధులు ఉన్నారు.
ఒక్కరు చనిపోయినా కోటి పరిహారం : సుప్రీం హెచ్చరిక
అంతకుముందు పరీక్షలు నిర్వహించాల్సిందే నంటూ రాష్ట్ర ప్రభుత్వం చేసిన వాదనపై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. ఒక్క విద్యార్థి మరణించినా కోటి రూపాయల పరిహారం ఇవ్వాల్సిఉంటుందని ఒక దశలో హెచ్చరించింది. సుప్రీం కోర్టు న్యాయ మూర్తులు జస్టిస్ ఎ.ఎం ఖన్విల్కర్, జస్టిస్ దినేష్ మహేశ్వరితో కూడిన ద్విసభ్య ధర్మాసనం గురువారం ఉదయం పరీక్షల నిర్వహణ అంశపై విచారణ జరిపింది. పరీక్షల నిర్వహణకు సంబంధించి పక్కా సమాచారం ఇవ్వాలని ఆదేశించినా అఫిడవిట్లో ఎక్కడా కనిపించలేదని పేర్కొంది. ప్రభుత్వం ఇచ్చే లెక్కల ప్రకారం చూస్తే సుమారు 28 వేల గదులు అవసరమవుతాయని వ్యాఖ్యానించింది. 'పరీక్ష తరు వాత వాటిని మూల్యాంకనం చేయాలి, ఆ తరువాత చాలా ప్రక్రియ ఉంటుంది.. ఇవేమీ అఫిడవిట్లో కనిపించలేదు' అని పేర్కొంది. పరీక్షలు జరుగుతున్న సమయంలోనే మూడో వేవ్ వస్తే అప్పుడు ఏం చేస్తారని అత్యున్నత న్యాయస్థానం ప్రశ్నించింది. దీనికి సంబంధించి ప్రభుత్వ నిర్ణయాన్ని గురువారం సాయంత్రమే కోర్టుకు తెలియచేయాలని, శుక్రవారం తుది తీర్పునిస్తామని ప్రకటించింది
జులై 31లోగా ఇంటర్ ఫలితాలు
దేశ వ్యాప్తంగా ఇంటర్, 12వ తరగతి పరీక్షా ఫలితాలను జులై 31వ తేదిలోగా ప్రకటించాలని కూడా సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది.పది రోజుల్లోగా బోర్డులు మూల్యాంకన విధానాలను రూపొందించి కోర్టుకు సమర్పించాలని సూచించింది. ఇప్పటికే చాలా రాష్ట్రాలు పరీక్షలను రద్దు చేసినందున అంతర్గత మార్కుల ఆధారంగా మూల్యాంకనం చేపట్టాలని సూచించింది.