Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- యోగి సర్కార్‌పై బీజేపీ మద్దతుదారుల నుంచే ఆగ్రహం
- మరికొద్ది నెలల్లో అసెంబ్లీకి ఎన్నికలు
- హిందూత్వ ఎజెండా, ధనబలంతో యోగి వ్యూహం : రాజకీయ విశ్లేషకులు
న్యూఢిల్లీ : ఉత్తరప్రదేశ్‌లో కరోనా మహమ్మారితో వేలాది మంది ప్రాణాలు కోల్పోవటం, సంక్షోభాన్ని ఎదుర్కోలేక యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం చేతులెత్తేయటం వార్తల్లో నిలిచింది. మరికొద్ది నెలల్లో యూపీ అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్నవేళలో ఈ పరిణామాలు చోటుచేసుకోవటం బీజేపీ అధినాయకత్వంలో కలవరం సృష్టించింది. ప్రస్తుతం ఆ రాష్ట్ర అసెంబ్లీ గడువు 14 మార్చి, 2022తో ముగియనున్నది. వచ్చే ఏడాది ఫిబ్రవరి-మార్చి మధ్యకాలంలో అసెంబ్లీ ఎన్నికలు జరపాల్సి వుంటుంది. కరోనా ముప్పుపూర్తిగా పోనప్పటికీ ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉన్నామని కేంద్ర ఎన్నికల సంఘం ఇదివరకే ప్రకటించింది. ఈనేపథ్యంలో మోడీ సర్కార్‌కు అత్యంత కీలకమైన యూపీలో అసెంబ్లీ ఎన్నికలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
కష్టసమయంలో చేతులెత్తేసిన యోగి
అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో బీజేపీయే అధికారంలో ఉంది. అయినప్పటికీ కరోనా సంక్షోభ సమయాన వారిని ఆదుకునేందుకు ఏ చిన్న ప్రయత్నమూ జరగలేదని ప్రజల్లో ఆగ్రహం బలంగా కనపడుతోంది. కరోనా మృతదేహాలు నదులు, వాగుల్లో కొట్టుకురావటం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. కరోనా బాధితుల్ని యోగి ప్రభుత్వం గాలికి వదిలేసిందని, సంక్షోభ సమయాన ప్రజల గోడు వినే నాథుడే రాష్ట్రంలో లేడని మీడియాలో వార్తా కథనాలు వచ్చాయి. ఈనేపథ్యంలో ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్, ఆయన మంత్రివర్గ సహచరుల పనితీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. రాష్ట్రంలో పాలన అంతా పడకేసిందని, సీఎం యోగిని లేదా ఆయన మంత్రివర్గంలో కొంతమందిని మార్చబోతున్నారని రాజకీయ వర్గాల్లో చర్చసాగింది.
గుజరాత్ ఫార్ములాతో...
అయితే తెరవెనుక ఏమైందో తెలియదుగానీ, సీఎం యోగిని, ఆయన మంత్రివర్గంలో మార్పులకు బీజేపీ అధినాయకులు వెనుకడుగు వేశారు. అసెంబ్లీ ఎన్నికలకు చాలినంత సమయం లేకపోవటం, యోగిని లేదా ఆయన సహచరుల్ని తప్పిస్తే...హిందూత్వ ఎజెండా బలహీనమవుతుందని బీజేపీ భావించినట్టు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. గుజరాత్లో సుదీర్ఘకాలం అధికారం నిలబెట్టుకోవడానికి హిందూత్వ ఎజెండా, మత రాజకీయాలు, ముస్లిం వ్యతిరేకత బీజేపీకి ఉపయోగపడ్డాయి. ఇప్పుడు అదే వ్యూహంతో యూపీలో 2022 అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ వెళ్తోందని ఢిల్లీ రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. అంతేగాక ధనికులు, కార్పొరేట్ల అండదండలతో, ఆర్థిక సాయంతో ఎన్నికల్లో గెలువొచ్చని బీజేపీ బలంగా భావిస్తోంది.
గుజరాత్లో సీఎంగా నరేంద్రమోడీ పగ్గాలు(2001లో) చేపట్టాక, ధనికులకు, కార్పొరేట్లకు అధిక ప్రాధాన్యత ఇచ్చారు. వారికి ప్రభుత్వ కాంట్రాక్ట్‌లు పెద్ద ఎత్తున కట్టబెట్టారు. హిందూత్వ ఎజెండా, మత ఏకీకరణ, ఉన్నత వర్గాల ఆర్థిక సంబంధాలతోనే 2002, ఆ తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రత్యర్థుల్ని మోడీ దెబ్బకొట్టారని సమాచారం. ఇప్పుడు అదే వ్యూహంతో యోగి ఆదిత్యనాథ్ 2022 ఎన్నికలకు వెళ్తున్నారని తెలిసింది.
ప్రజల దృష్టి మరలించటం ఎలా?
యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వ పనితీరుపై బీజేపీ మద్దతుదారులే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టు స్థానిక మీడియాలో వార్తలు వస్తున్నాయి. కరోనా సంక్షోభాన్ని ఎదుర్కొన్న తీరుతో వారి ఆగ్రహం మరింత పెరిగిందని, ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొందని సమాచారం. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజాగ్రహం వ్యక్తమైంది. అయితే ప్రజల దృష్టి మరల్చడానికి యోగి ఆదిత్యనాథ్, అక్కడి బీజేపీ నాయకులు అనేక వ్యూహాలు సిద్ధం చేసుకున్నారని విశ్లేషకులు చెబుతున్నారు. అయోధ్యలో మందిర నిర్మాణం, మత ఏకీకరణ, హిందూత్వం..వంటి అంశాలను తెరమీదకు తీసుకొచ్చేందుకు బీజేపీ శతవిధాలా ప్రయత్నం చేస్తుందని విశ్లేషకులు అంచనావేస్తున్నారు.