Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బ్రెజిల్-కోవాగ్జిన్ ఒప్పందంలో బట్టబయలు
- ప్రజలకు అందని దేశీయ టీకా
- బ్రెజిల్-కోవాగ్జిన్ ఒప్పందంలో బట్టబయలు
- ప్రజలకు అందని మన దేశ ఉత్పత్తి
- కమీషన్ల కోసం విదేశాలకు ఎగుమతి
అమరావతి : కరోనాను కట్టడి చేసేందుకు ఏకైక మార్గంగా వ్యాక్సిన్లే ప్రపంచం ముందు కనిపిస్తున్నాయి. దీంతో వ్యాక్సిన్లకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ఈ డిమాండ్‌ను సొమ్ము చేసుకునేందుకు వ్యాక్సిన్ కంపెనీలు ప్రభుత్వ పెద్దలతో కుమ్మక్కయ్యాయి. దేశ అవసరాలు తీర్చడం కన్నా తమ జేబులు నింపుకోవడమే పరమావధిగా విదేశాలకు వ్యాక్సిన్లను ఎగుమతి చేస్తున్నారు. అక్కడ ప్రభుత్వ పెద్దలకు కూడా కమీషన్లు ఇచ్చి మిలియన్ డోసుల ఆర్డర్లు తెచ్చుకుంటున్నారు. మన దేశీయ కంపెనీ భారత్ బయోటెక్ తయారు చేసిన కోవాగ్జిన్ సరఫరాకు బ్రెజిల్ ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందంలో అవినీతి చోటు చేసుకుందని ది వైర్ వెబ్సైట్ ఒక కథనాన్ని ప్రచురించింది. ప్రస్తుతం కోవాగ్జిన్ కొనుగోలుకు బ్రెజిల్ అధ్యక్షుడు బోల్సనారో ప్రభుత్వం చేసుకున్న ఒప్పందంపై ఆ దేశంలోని పార్లమెంటరీ కమిషన్ ఆఫ్ ఎంక్వయిరీ(పిసిఐ) విచారణ జరుపుతోంది. ఈ విచారణలో విస్తుపోయే విషయాలు బయట పడ్డాయి.
భారత్ బయోటెక్ భాగస్వామిగా డొల్ల కంపెనీ
భారత్ బయోటెక్ నుండి రెండు కోట్ల డోసులను ఒక్కో డోసు 15 డాలర్ల చొప్పున కొనుగోలు చేసేందుకు బ్రెజిల్ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఈ రేటు చాలా ఎక్కువని, ఇంతకన్నా తక్కువ రేటుకు ఫైజర్ కంపెనీ సరఫరా చేస్తామని చెప్పినా పెడచెవిన పెట్టి భారత్ బయోటెక్‌తో ఒప్పందం చేసుకున్నారని పిసిఐ అంటోంది. ఈ ఒప్పందంలో పెద్ద ఎత్తున డబ్బు చేతులు మారిందని, అందుకనే అంత అధిక రేటు పెట్టి కోవాగ్జిన్ కొనేందుకు ఒప్పందం జరిగిందని చెబుతోంది. ఒప్పందం ప్రకారం డబ్బు చెల్లించాల్సింది భారత్ బయోటెక్‌కు కాగా మూడో కంపెనీ సీన్లోకి వచ్చిందని, 2020లో సింగపూర్‌లో రిజిస్టర్ అయిన మాడిసినో బయోటెక్ కంపెనీకి డబ్బు చెల్లించాల్సిందిగా బోల్సనారో ప్రభుత్వ ప్రతినిధుల నుండి ఉద్యోగులపై ఒత్తిడి వచ్చిందని తెలిపింది. అది కూడా మూడు లక్షల డోసుల సరఫరాకు గాను 45 మిలియన్ డాలర్లు అంటే దాదాపు రూ.300 కోట్లను అడ్వాన్స్‌గా ఇవ్వాలనే ఇన్వాయిస్పైన సంతకం పెట్టాలనే ఒత్తిడి వచ్చినట్లు దిగుమతుల విభాగంలో పనిచేసిన మాజీ అధికారి పిసిఐ ముందు వాంగ్మూలం ఇచ్చారు. ఈ మాడిసినో కంపెనీ ద్వారా భారత్ బయోటెక్ పన్ను ఎగ్గొట్టే పన్నాగం పన్నినట్లు బ్రెజిల్ సెనెటర్లు ఆరోపిస్తున్నారు. ఈ మాడిసన్ కంపెనీ పేర్కొన్న అడ్రసు పనామా పేపర్లు ప్రచురించిన డొల్ల కంపెనీల జాబితాలో కనిపించిందని చెబుతున్నారు. పరాగ్వేలో కూడా ఇలాగే మాడిసన్ కంపెనీకి చెల్లింపులు జరిపారని, ఆ దేశంలో ఇదో పెద్ద కుంభకోణంగా వెలుగు చూసిందని సెనెటర్లు గుర్తు చేస్తున్నారు. భారత్ బయోటెక్ నేరుగా అమ్మకుండా మధ్యలో మాడిసన్ కంపెనీని పెట్టుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నిస్తున్నారు. 2 కోట్ల డోసులు.. ఒక్కో డోసు 15 డాలర్ల చొప్పున అంటే దాదాపు రూ.2,250 కోట్ల ఒప్పందం. ఇంత భారీ ఒప్పందంలో భారీగానే ముడుపులు ముట్టాయని, అందుకునే అధిక రేటు పెట్టి కొనడమే కాక, ఒక డొల్ల కంపెనీకి నిధులు మళ్లిస్తున్నారని బ్రెజిల్ సెనెటర్లు ఆరోపిస్తున్నారు. బ్రెజిల్లో వెలుగుచూసిన ఈ కుంభకోణం భారత్‌లో ఉన్న పరిస్థితికి అద్దం పడుతోంది.
వ్యాక్సిన్ల అదృశ్యం వెనుక కుంభకోణం దేశంలో అత్యవసర
వినియోగానికి జనవరి మూడో తేదీనే కోవీ షీల్డ్, కోవాగ్జిన్ వ్యాక్సిన్లకు భారత ప్రభుత్వం ఆమో దం తెలిపింది. ఆ రోజున కోవిషీల్డ్ ను ఉత్పత్తి చేసే సీరం సంస్థ సామర్ధ్యం నెలకు 6.5 కోట్ల డోసులు, కోవాగ్జిన్ ఉత్పత్తి సామర్ధ్యం భారత్ బయోటెక్‌కు నెలకు కోటి డోసులు. మార్చి నాటికి భారత్ బయో టెక్ తన సామర్ధ్యాన్ని రెండు కోట్లకు పెంచుకుంది. మే నాటికి మరో కోటి డోసులకు ఉత్పత్తి సామ ర్ధ్యాన్ని పెంచుకుంటామని తెలిపింది. ఎలా చూసు కున్నా నెలకు తొమ్మిది కొట్ల డోసుల ఉత్పత్తి సామ ర్ధ్యాన్ని రెండు కంపెనీలు కలిగిఉన్నాయి. మొదటి రెండునెలలు కొంచెం తక్కువగానే ఉత్పత్తి జరిగిం దని భావించినా జనవరి నుంచి జూన్ మాసం వరకు దాదాపు 50 కోట్ల డోసుల వరకు ఉత్పత్తి జరిగి ఉంటుంది. ఈనాటి వరకు దేశంలో పంపిణీ చేసింది 30 కోట్ల డోసుల చిల్లర మాత్రమే. మిగిలిన 16 నుండి 20కోట్ల డోసులు ఏమయ్యాయి? అంటే కంపెనీలు వీటిని దాచి పెట్టి విదేశాలకు అధిక రేటుకు అమ్ముకుంటున్నాయా? అయితే రోజుకు ఇన్ని డోసులు వేశామని లెక్కలు చెబుతున్న మోడీ ప్రభుత్వం మొత్తం ఉత్పత్తి ఎంత? అది ఎక్కడకు వెళుతుందనే వివరాలు ఎందుకు వెల్లడించడం లేదు. ఈ డోసులను అధిక రేట్లకు విదేశాలకు అమ్ముతున్నారనేది వాస్తవం. వ్యాక్సిన్ తయారీ క్రమంలో ఒక్కో డొసు ధర వాటర్ బాటిల్ రేటు కన్నా తక్కువగానే ఉంటుందని చెప్పిన భారత్ బయోటెక్ ఎమ్‌డి కృష్ణ ఇప్పుడు మాత్రం దేశంలో రేటును రూ.1200గా ఎలా నిర్ణయించారు. విదేశాలకు ఒక్కో డోసుకు 15 డాల్లర్లకు అంటే అటోఇటుగా రూ.1200కు విక్రయిస్తున్నారు. పేద దేశాలకు ఇచ్చేందుకు డబ్య్లుహెచ్వోకు సరఫరా చేసేందుకు మాత్రం ఈ కంపెనీలు ముందుకు రావడం లేదు. విదేశాలకు నేరుగా అధిక రేటుకు అమ్ముకుంటున్నాయన్న అభిప్రాయాన్ని బ్రెజిల్ ఉదంతం బలపరుస్తోంది.