Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జర్నలిస్టులను నేరగాళ్లుగా చూపే ప్రయత్నమిది : 'ద వైర్' వెల్లడి
న్యూఢిల్లీ : మోడీ సర్కార్, యూపీలో యోగి పాలనకు వ్యతిరేకంగా వార్తా కథనాలు రాస్తున్న 'ద వైర్' ఆన్లైన్ న్యూస్ పోర్టల్‌పై ప్రతీకార దాడులు మొదలయ్యాయి. ఒక వర్గానికి చెందిన ప్రార్థనా మందిరాన్ని అక్రమంగా కూల్చివేస్తున్న ఘటనకు సంబంధించి వీడియోను 'ద వైర్' ప్రసారం చేసిందని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కేసు నమోదుచేసింది. మే 17న బారాబంకీలోని ఒక ప్రార్థనా మందిరాన్ని యూపీ స్థానిక ప్రభుత్వ అధికారులు కూల్చివేశారు. ప్రభుత్వ అధికారులు అక్రమంగా ఈ కూల్చివేతకు పాల్పడుతున్నారని, మత గ్రంథాల్ని మురుగునీటి కాల్వలో పడేశారని స్థానికులు కొంతమంది ఆగ్రహం వ్యక్తం చేయటం ఆ వీడియోలో కనపడింది. 'ద వైర్' చూపిన వీడియో ఇండియాలో, ఇతర దేశాల్లోనూ ప్రసారమైంది.
ఈ వీడియోను 'ద వైర్' జర్నలిస్టులు సిరాజ్ అలీ, ముకుల్ సింగ్ చౌహాన్లు ట్విట్టర్లో పోస్ట్ చేశారు. దీనిపై యూపీ పోలీసులు స్పందిస్తూ, సమాజంలో మత ఉద్రిక్తతలను ప్రేరేపించే వీడియోను పోస్ట్ చేశారని ఎఫ్ఐఆర్లో ఆరోపణలు నమోదుచేశారు. ప్రార్థనా మందిరం సెక్రటరీ, మరో స్థానికుడిపైనా కేసులు పెట్టారు. అయితే ఈ ఆరోపణల్ని 'ద వైర్' ఖండించింది. రాష్ట్రంలో జర్నలిస్టులను నేరగాళ్లుగా చూపేందుకు యూపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేసింది. పది రోజుల క్రితం (జూన్ 14న) ఘజియాబాద్‌లో ఒక ఘటనపై 'ద వైర్' తప్పుడు వార్తా కథనం చూపిందని అక్కడి పోలీసులు కేసు నమోదుచేశారు.