Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : సోషల్ మీడియా సమాచార రంగాన్ని, ప్రజల ఆలోచనలను చాలా శక్తివంతంగా ప్రభావితం చేస్తున్న రోజులివి. దానితోబాటు మరో సమస్య కూడా ముందుకొచ్చింది. అదే ఫేక్ న్యూస్ సమస్య.
పూర్వం రోజుల్లో పత్రికలోనో రేడియోలోనో వార్త వచ్చిందంటే అది వాస్తవం అని నమ్మవచ్చని ప్రజలు భావించేవారు. ఇప్పుడు ఒక వార్త వాస్తవమా కాదా అన్నది మళ్ళీ నిిర్ధారించుకోవలసివస్తోంది. బిజెపి ప్రభుత్వం తాజాగా జారీ చేసిన ఐటి నిబంధనలు భావ ప్రకటనా స్వేచ్ఛకు ఆటంకంగా ఉన్నాయని దేశీయ, అంతర్జాతీయ హక్కుల వేదికలు గగ్గోలు పెడుతున్నాయి, కాని ఫేక్ న్యూస్‌ను అరికట్టడానికే ఆ విధంగా చేశామని కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు తమ విధానాన్ని సమర్ధించుకోడానికి ప్రయత్నిస్తున్నారు.
ఇంతకీ ఈ ఫేక్ న్యూస్ ఎక్కడినుండి ప్రధానంగా బయలుదేరుతోంది ?
ఇటీవల రాయిటర్స్ సంస్థ జరిపిన అధ్యయనంలో కొన్ని గమ్మత్తయిన విషయాలు వెల్లడయ్యాయి. ఆ విశేషాలను 'ది హిందూ' పత్రిక ప్రచురించింది. ''కరోనా వైరస్ కు సంబంధించి ఫేక్ న్యూస్ కాని, తప్పుదోవ పట్టించేవిధంగా ఉండే న్యూస్ కాని ఎక్కువగా ఎక్కడినుంచి వస్తోంది అని మీరు భావిస్తున్నారు ?'' అని ఇంగ్లీషు తెలిసిన ఇంటర్నెట్ వాడకందారులను కొందరిని అడగ్గా వారు ఆసక్తికర సమాధానాలు ఇచ్చారు.
ప్రభుత్వం, రాజకీయ నాయకులు చెప్పేవి విశ్వసనీయంగా లేవు
సర్వేకు స్పందించిన వారిలో .ప్రతి నలుగురిలో ఒకరు (23 శాతం) ప్రభుత్వం, రాజకీయనాయకులు చెప్పేవి నమ్మదగ్గవిగా లేవన్నారు. దానితో పోల్చితే సామాజిక కార్యకర్తలు చెప్పేవి నమ్మలేమని అన్నవారు 9 శాతం, కొన్ని పత్రికల్లో వచ్చేవార్తలు, కొన్ని చానెళ్ళు ప్రసారం చేసే కథనాలు నమ్మదగ్గవి కావని అన్నవారు 13 శాతం, ట్విట్టర్ లో వచ్చేవి నమ్మలేమని అన్నవారు 4 శాతం ఉన్నారు.
వాట్సప్ ద్వారా ఎక్కువగా తప్పుడు సమాచారం వస్తోందని చెప్పినవారు 28 శాతం ఉంటే, ఫేస్ బుక్ ద్వారా వస్తోందని చెప్పినవారు 16 శాతం, యూ ట్యూబ్ ద్వారా వస్తోందని చెప్పినవారు 14 శాతం ఉన్నారు.
ఫేక్ న్యూస్ నెట్వర్క్
రాజకీయనాయకులు గాని, సెలిబ్రిటీస్ కాని, ప్రముఖ వ్యక్తులు కాని ఫేక్ న్యూస్ ప్రచారంలో, తప్పుదోవ పట్టించే ప్రచారంలో నేరుగా చేస్తున్నది తక్కువగానే ఉన్నట్టు కనపడినా, వారు చెప్పి విషయాలను విపరీతంగా ప్రచారంలో పెట్టడంలో వారికి అనుకూలంగా బాహాటంగానే వ్యవహరిస్తున్న కొన్ని న్యూస్ మీడియాలు, సోషల్ మీడియాలో ఒక పథకం ప్రకారం పనిచేస్తున్న వారి అనుయాయుల బృందాలు ముందున్నాయి. కొన్ని సందర్భాలలో ప్రభుత్వ అధికారులు సైతం ఈ నెట్వర్క్ కు తోడవుతున్నారు. తాజాగా కోవిడ్ మరణాల సంఖ్యను బాగా తక్కువ చేసి ప్రకటించడంలో అధికారుల పాత్ర స్పష్టంగానే బైటపడింది.
నిరాధార ప్రకటనలు
ఎటువంటి శాస్త్రీయతా లేని ఔషధాలను కరోనా మహమ్మారి కాలంలో ప్రచారంలో పెట్టిన ప్రముఖులలో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సనారో ఉన్నారు. మనదేశంలో కూడా ప్రముఖ రాజకీయ నాయకులే గోమూత్రం తాగితే కరోనాను అరికట్టవచ్చునని ప్రచారం చేశారు. దానితో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ రంగంలోకి దిగి అది ఏవిధంగానూ నిరూపణ కాని విషయం అని స్పష్టం చేయవలసివచ్చింది. స్వయానా కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులే శాస్త్రీయంగా నిరూపించబడని ఔషధాలను కొన్నింటిని గత సంవత్సరం సిఫార్సు చేసి, ఆ తర్వాత విమర్శలను ఎదుర్కొన్నారు. సోషల్ మీడియాలో సైతం పలువురు వ్యక్తులు నిపుణుల పేరుతో కొన్ని వైద్య సలహాలను ప్రచారం చేస్తున్నారు. ఐతే ప్రభుత్వంలో బాధ్యతలలో ఉన్నవారు, ప్రజాజీవితంలో ప్రముఖులు ఈ విధంగా చేస్తే దానివలన కలిగే నష్టాలు, హానికర పర్యవసానాలు ఎక్కువగా ఉంటాయి.
మన దేశంలో ఉదాహరణలు
బిజెపి నేతృత్వంలోని హర్యానా ప్రభుత్వం కరోనా రోగులకు ఉచితంగా ఒక లక్ష కరొనిల్ కిట్లు పంచనున్నట్టు ప్రకటించింది. ఈ కరొనిల్ మందును బాబా రాందేవ్ కు చెందిన పతంజలి ఆయుర్వేద సంస్థ గత జూన్ లో విడుదల చేసింది. కరొనిల్ సేవించినవారు ఏడే ఏడు రోజుల్లో కరోనానుండి కోలుకుంటారని రాందేవ్ ఆ సందర్భంగా ప్రెస్ మీట్ లో ప్రకటించాడు. ఆ తరువాత కొన్ని గంటలలోపే, కరొనిల్ మందుకు సంబంధించిన ఆ ప్రకటనను నిలుపుచేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. ఆ మందు ఉత్పత్తికి లైసెన్సు ఇచ్చిన ఉత్తరాఖండ్ ప్రభుత్వ ఆయుర్వేద విభాగం తాము కరొనిల్ ను ఒక ఔషధంగా అనుమతించలేదని, కేవలం రోగనిరోధకశక్తి ని పెంచేది గా మాత్రమే అనుమతించామని ప్రకటించింది.
ఈ ఏడాది ఫిబ్రవరిలో కరొనిల్ కు ప్రపంచ ఆరోగ్యసంస్థ సర్టిఫికెట్ ఇచ్చిందంటూ రాందేవ్ సంస్థ ప్రకటించింది. ఆ వెంటనే దానిని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఖండిస్తూ అటువంటి సర్టిఫికెట్ ఏదీ ఇవ్వలేదని స్పష్టం చేసింది. ఈ రాందేవ్ తో కలిసి కేంద్ర ఆరోగ్యమంత్రి హర్షవర్ధన్ ''కోవిడ్ రోగులకు ప్రత్యామ్నాయ వైద్య విధానాలు'' అన్న చర్చలో పాల్గొన్నారు. దేశాన్ని మొత్తంగా తప్పుదోవ పట్టించేలా అనైతిక పద్ధతులలో, తప్పుడు మందులను ప్రచారం చేయడం ఏవిధంగా ఒక కేంద్ర మంత్రికి, అందునా వైద్య, ఆరోగ్యమంత్రికి తగును ? అని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ బహిరంగంగానే ప్రశ్నించింది.
అధికారులు గనుక తప్పుడు సమాచారాన్ని, ఫేక్ న్యూస్‌ను అరికట్టాలని నిజంగా భావిస్తున్నట్టైతే వారు సామాజిక ఉద్యమ కార్యకర్తలను వేధించడం మానేసి, కేంద్రం నుంచే, ప్రభుత్వం నుంచే, అధికారులనుంచే దిగువకు ఫేక్ న్యూస్ ప్రవహిస్తున్నదని గుర్తించి తగు చర్యలు తీసుకోవాలని రాయిటర్ ప్రతినిధి ప్రొఫెసర్ రాస్మస్ క్లీస్ నెల్సన్ అన్నారు.