Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కోర్టును ఆశ్రయించిన ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా
- మద్రాస్ హైకోర్టులో పిటిషన్ వేసిన టైమ్స్ ఆఫ్ ఇండియా, ఎన్డీటీవీ, దైనిక్ భాస్కర్..
న్యూఢిల్లీ : మోడీ సర్కార్ తీసుకొచ్చిన నూతన ఐటీ నిబంధనావళి, 2021పై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ఐటీ నిబంధనల పేరుతో దేశంలో పత్రికా స్వేచ్చ, భావ ప్రకటనా స్వేచ్ఛను అణచివేయాలని చూస్తోందని 'ద డిజిటల్ న్యూస్ పబ్లిషర్స్ అసోసియేషన్' (డీఎన్పీఏ) మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది. టైమ్స్ ఆఫ్ ఇండియా, ఇండియా టుడే, ఎన్డీటీవీ, ఇండియన్ ఎక్స్ప్రెస్, దైనిక్ భాస్కర్, దైనిక్ జాగారన్, అమర్ ఉజాలా..మొదలైన మీడియా సంస్థలు కోర్టులో పిటిషన్ దాఖలుచేశాయి. ఐటీ (డిజిటల్ మీడియా ఎథిక్స్ కోడ్) రూల్స్, 2021 రాజ్యాంగ విరుద్ధమని, ఆర్టికల్ 14, ఆర్టికల్ 19(1)(ఎ), (జి)లను ఉల్లఘిస్తోందని పిటిషన్లో ఆరోపించాయి. దీనిపై న్యాయస్థానం కేంద్ర సమాచారశాఖకు నోటీసులు జారీచేసింది.
పిటిషన్లో డీఎన్పీఏ పేర్కొన్న విషయాలు ఈ విధంగా ఉన్నాయి. కేంద్రం తీసుకొచ్చిన నూతన ఐటీ నిబంధనావళి, 2021 మొత్తం డిజిటల్ మీడియా, ప్రత్రికారంగాన్ని నియంత్రిం చేలా ఉంది. పబ్లిషర్ అనుమతి లేకుండానే వార్తా సమాచారాన్ని తొలగించే అధికారాల్ని ప్రభుత్వ వర్గాలకు కల్పిస్తోందని ద వైర్, ద క్వింట్, ఆల్ట్న్యూస్, లైవ్ లా..మొదలైనవి కూడా న్యాయస్థానాన్ని ఆశ్రయించాయి. పాలకవర్గాలు పత్రికాస్వేచ్ఛను ఈ తీరుగా అణచివేయటం భారతదేశ చరిత్రలో ఇదే మొదటిసారి. 1975 అత్యవసర పరిస్థితులకు వ్యతిరేకంగా పోరాడిన జయప్రకాశ్ నారాయణ్ తమకు ఆదర్శ మని చెప్పుకుంటున్న మోడీ సర్కార్ ఇలాంటి ఐటీ నిబంధనావళి తీసుకు రావటం దారుణమని మీడియా సంస్థలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
కేంద్రం వినే పరిస్థితిలో లేదు..
నూతన ఐటీ నిబంధనావళిపై మీడియా సంస్థల అభ్యంతరాల్ని కేంద్రం వినే పరిస్థితిలో లేదని, తమను సంప్రదించకుండా ఏకపక్షంగా నిబంధనావళి రూపొందించారని పిటిషన్లో డీఎన్పీఏ ఆరోపించింది. కేంద్ర సమాచార శాఖకు తమ ఆందోళన వ్యక్తం చేశామని, ఇది రాజ్యాంగ వ్యతిరేకమని డీఎన్పీఏ పేర్కొంది. ప్రజాస్వామ్య వ్యవస్థలు, సంస్థలని అణచివేయాలనే ధోరణితో కేంద్రం ఉందన్న సంగతి అర్థమవుతోందని, సరైన సంప్రదింపులు జరిపి నిబంధనావళి రూపొందించాలని కోరుతూ కోర్టును ఆశ్రయించినట్టు డీఎన్పీఏ తెలిపింది.