Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మెహబూబా ముఫ్తీ
న్యూఢిల్లీ : జమ్మూకాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆర్టికల్ 370, 35ఏని పునరుద్ధరించేవరకు తాను ఎన్నికల్లో పోటీ చేయనని స్పష్టం చేశారు. జమ్మూకాశ్మీర్ భవిష్యత్ ప్రణాళికపై చర్చించడానికి ఈ నెల 24న ప్రధానమంత్రి అధ్యక్షతన జరిగిన అఖిలపక్ష సమావేశం అనంతరం ముఫ్తీ ఎన్నికలు, నియోజకవర్గాల పునర్వవస్థీకరణ కన్నా ముందు ఈ ప్రాంత ప్రజల విశ్వాసం గెలవటం ముఖ్యం అన్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ...'' జమ్మూకాశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి, ఆర్టికల్ 370, 35ఏని పునరుద్ధరించే వరకు నా పోరాటం కొనసాగుతుంది..అప్పటివరకు నేను ఎన్నికల్లో పోటీ చేయను. స్వయం ప్రతిపత్తి కోసం గుప్కార్ కూటమి కలిసికట్టుగా పోరాడుతుంది. నా పార్టీ పీడీపీ ఎన్నికల్లో పోటీ చేస్తుంది. సీఎం అభ్యర్థులకు కొరత లేదు.'' అని అన్నారు. '' భారత రాజ్యాంగం కాశ్మీర్‌కు కల్పించిన ప్రత్యేక ప్రతిపత్తినే మేం కోరుతున్నాం. వేరే కొత్త డిమాండ్లేమీ తెరమీదకు తీసుకురాలేదు. ఇది వేర్పాటువాదం కాదు. ఇది మా రాజకీయ డిమాండ్. స్వార్థ రాజకీయాల కోసం ఆర్టికల్ 370ని కేంద్రమే రద్దు చేసింది. భారత రాజ్యాంగం ప్రకారమే మా పార్టీ నడుచుకుంటుంది. అందుకే ప్రధాని ఆహ్వానం మేరకు మేం ఢిల్లీ వచ్చి మోడీతో సమావేశం అయ్యాము. కానీ ప్రస్తుత రాజకీయ పార్టీలతో సమావేశం కావడం ముఖ్యం కాదు. ప్రజలతో కలిసిపోయి..వారిలో విశ్వాసం నింపాలి. వారి నమ్మకాన్ని గెల్చుకోవాలి. అందుకు తగిన చర్యలు తీసుకోవడం ముఖ్యం'' అని మెహబూబా ముఫ్తీ అన్నారు.