Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉత్పత్తి రంగానికి నిరాశే
- రిలయన్స్‌లోకి మెజారిటీ పెట్టుబడులు
న్యూఢిల్లీ : ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కరోనా వైరస్ తీవ్ర ప్రతికూలతకు గురి చేయగా.. భారత్‌కు అనూ హ్యాంగా భారీగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ)లు వచ్చి చేరాయని ప్రభుత్వ వర్గాలు పదే పదే గొప్పలు చెప్పుకుంటున్నాయి. కాగా.. వచ్చిన ఎఫ్‌డీఐలు ఏ రంగానికి.. ప్రజలకు ఎంత వరకు ఉపయో గపడ్డాయనేది ప్రశ్నర్థకంగా ఉంది. గడిచిన ఆర్థిక సంవత్సరం (2020-21)లో 81.72 బిలియన్ డాలర్ల ఎఫ్‌డీఐలు వచ్చాయని.. 2019-20 నాటి 74.39 బిలియన్ డాలర్లతో పోల్చితే 10 శాతం అదనమని వాణిజ్య మంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపాయి. అత్యధికంగా సింగపూర్, అమెరికా, మారిషియస్ నుంచి ఎఫ్‌డీఐలు వచ్చి చేరాయి. వీటిలో అత్యధికంగా గుజరాత్ కంపెనీల్లో 37 శాతం, ఆ తర్వాత మహరాష్ట్రకు 27 శాతం, కర్నాటకకు 13 శాతం చొప్పున వచ్చాయి. ప్రభుత్వం ప్రవేశపెట్టిన సులభతర వ్యాపార విధానం ద్వారా విదేశీ పెట్టుబడులు భారీగా వస్తున్నాయని బీజేపీ నేతలు చెప్పుకొస్తున్నారు. 2021 మార్చితో ముగిసిన ఏడాదిలోని మొత్తం ఎఫ్‌డీఐల్లో 86 శాతం కేవలం మూడు త్రైమాసికాల్లోనే వచ్చాయి. ఇక.. ఇందులో 57శాతం లేదా 27 బిలియన్ డాలర్లు ఒక్క రిలయన్స్ గ్రూపులోకి వచ్చాయి. ఇందులోనూ ఫేస్బుక్, గూగుల్ తదితర 14 విదేశీ కంపెనీల నుంచి 20 బిలియన్ డాలర్ల నిధులు కేవలం రిలయన్స్ గ్రూపులోని కంపెనీల్లోని వాటాల కొనుగోళ్లకు ఉపయోగించినవే.
ఉద్యోగాలెక్కడా...?
ఆర్బీఐ రిపోర్ట్ ప్రకారం ఎఫ్‌డీఐలలో 80శాతం సమాచార, సాంకేతిక రంగాలలోకే వచ్చాయి. ఇందులో 47శాతం రిలయన్స్ జియోకు చేరాయి. ఇది కూడా యాజమాన్య వాటా కొనుగోలుకు సంబంధించినది. మొత్తం విదేశీ పెట్టుబడులలో 17శాతం మాత్రమే ఉత్పాదక రంగంలోనే వచ్చాయి. ఈ రంగానికి విదేశీ పెట్టుబడులు వస్తే, వ్యాపారం పెరగాలి. ఉద్యోగాల కల్పన జరగాలి. కానీ ఎక్కడా ఎలాంటి పురోగతి కనిపించలేదు. ముఖ్యంగా ఒక కంపెనీలో విదేశీ కంపెనీలు వాటాలు కొనుగోలు చేయడం ద్వారా కొత్తగా ఉద్యోగాలు సృష్టించబడవు. రిలయన్స్ జియోలో ఫేస్బుక్ వాటాను కొనుగోలు చేయడం ద్వారా కొత్త వాటాదారులు వచ్చి చేరుతారు తప్పా జియో వ్యాపారం విస్తరించబడలేదని.. దీంతో ఉద్యోగాల సృష్టి జరగలేదని నిపుణులు భావిస్తున్నారు.
తయారీకి గడ్డు కాలం
కరోనాకు ముందు నుంచే దేశ ఆర్థిక వ్యవస్థలో మందగమనం చోటు చేసుకుంది. ప్రభుత్వ విధానాలతో ప్రజల కొనుగోలు శక్తి హరించుకుపోవడంతో ఆర్థిక కార్యకలాపాలు కుంచించుకుపోయి... మార్కెట్లో సరుకులకు డిమాండ్ లేకుండాపోయింది. ముఖ్యంగా 2016 నవంబర్‌లో మోడీ సర్కార్ చేపట్టిన నోట్ల రద్దు తర్వాత పరిస్థితి గందరగోళంగా మారింది. ఆ తర్వాత జీఎస్టీ ప్రజల కొనుగోలు శక్తిని హరించి వేయగా.. కరోనా.. అనుహ్య లాక్డౌన్ నిబంధనలు ప్రజల ఆర్థిక పరిస్థితిని మరింత దిగజారేలా చేశాయి. ఈ పరిణామాలతో దాదాపుగా ఐదేళ్ల నుంచి దేశంలో ఉత్పాదక రంగం సంక్షోభంలో పడింది. దీంతో ఈ విభాగంలో పెట్టుబడులు డీలా పడ్డాయి. కాగా.. మోడీ సర్కార్ ప్రతినిధులు దేశంలోకి విస్తృత ఎఫ్‌డీఐలు వచ్చి చేరాయని పదే పదే పేర్కొంటున్నప్పటికీ తయారీ రంగానికి పెద్దగా ఒరింగిందేమీ లేదని గణంకాలు చెబుతున్నాయి. గత ఐదేండ్లలో ఉత్పాదక రంగం కనిష్ట పెట్టుబడులతో డీలా పడింది. ఎఫ్‌డీఐలు ఉరకలెస్తున్నాయని.. ప్రభుత్వ వర్గాలు పేర్కొంటుంటే.. మరోవైపు డిమాండ్ లేక అనేక తయారీ పరిశ్రమలు మూతపడుతున్నాయి. కొన్నేమో కార్యకలాపాలను తగ్గించుకున్నాయి.
దీంతో ఉన్న ఉద్యోగాలకు ఎసరు పడుతోంది. ఉపాధి కోల్పోయి అనేక మంది రోడ్డున పడ్డారని అంతర్జాతీయ, జాతీయ ఎజెన్సీలు పలు రిపోర్టుల్లో పేర్కొన్న విషయం తెలిసిందే. ఇలాంటి అనిశ్చితి పరిస్థితుల్లో నిజాలను దాచిపెట్టి అబద్దపు ఎఫ్‌డీఐల మాయతో ఆర్థిక వ్యవస్థకు ఆక్సిజన్ ఎక్కించాలని మోడీ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు నిష్పలమేనని నిపుణులు విమర్శిస్తున్నారు.