Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సాంకేతిక లోపాలతో ఇబ్బందులు పడుతున్నాం
- కేంద్రానికి చండీగఢ్ ప్రభుత్వాస్పత్రుల లేఖ
న్యూఢిల్లీ : పీఎం-కేర్స్ ఫండ్ కింద ప్రభుత్వ ఆస్పత్రులకు కేటాయించిన వెంటిలేటర్లు సరిగ్గా పనిచేయడంలేదు. వాటిలో తలెత్తుతున్న సాంకేతికలోపాలు ఆస్పత్రుల్లోని వైద్యులను ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. రోగులకు చికిత్స అందించే విషయంలో వారి విధులకు ఆటంకాన్ని కలిగిస్తున్నాయి. ఇదే విష యంపై చండీగఢ్‌లోని మూడు ప్రభుత్వ ఆస్పత్రులు ఆందోళనను లేవనెత్తాయి. దీనిపై కేంద్రానికి ఫిర్యాదును చేశాయి. మే నెలలో దేశంలో కరోనా సెకండ్‌వేవ్ కేసులు, మరణాల సంఖ్య తీవ్రంగా పెరుగుతున్న సమయంలోనే ఈ మూడు ఆస్పత్రులకు పీఎం-కేర్స్ ఫండ్ కింద ఈ వెంటిలేటర్లు అందాయి. మొత్తం 44 వెంటిలేటర్లకు గానూ 20 పరికరాలను పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్, 10 వెంటిలేటర్లను గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పటల్, 14 వెంటిలేటర్లను గవర్నమెంట్ మల్టీ-స్పెషాలిటీ ఆస్పత్రికి కేటాయించారు. కాగా, తమకు అందిన 10 వెంటిలేటర్లలో ఐదు వెంటిలేటర్లు ''సరిగ్గా పని చేయలేదు'' అని గవర్నమెంట్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పటల్ డైరెక్టర్ తెలిపారు. అయితే, ఈ వెంటిలేటర్లన్నీ గుజరాత్‌కు చెందిన సంస్థ జ్యోతి సీఎన్సీ ఆటోమేషన్ నుంచి అందడం గమనార్హం. ఈ సంస్థకు చెందిన 'ధామన్-1' వెంటిలేటర్లు గతేడాది వివాదానికి కేంద్ర బిందువుగా మారిన విషయం తెలిసిందే. ఈ వెంటిలేటర్లు ''ఆశించినస్థాయిలో ఫలితాలను ఇవ్వలేకపోతున్నాయి'' అంటూ రాష్ట్ర ప్రభుత్వ మెడికల్ సర్వీసెస్ ప్రొవైడర్‌కు అహ్మదాబాద్ సివిల్ హాస్పటల్ సూపరింటెండెంట్ జేవీ మోడీ లేఖ రాయడంతో ఈ విషయం బయటకొచ్చింది. అయితే, కొన్ని కథనాల ప్రకారం.. జ్యోతి సీఎన్సీ ఆటోమేషన్‌కు చెందిన ప్రస్తుత, గత ప్రమోటర్లు బీజేపీ అగ్రనాయకులతో సత్సంబంధాలను కలిగి ఉండటం గమనార్హం. చండీగఢ్‌లోని ఆస్పత్రులు.. హామీల్టన్ మెడికల్ కంపెనీ నుంచి వెంటిలేటర్ల కోసం కేంద్రాన్ని డిమాండ్ చేశాయని ఆరోగ్య విభాగానికి చెందిన సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. అయితే, సంబంధిత మంత్రిత్వ శాఖ మాత్రం ఎలాంటి బ్రాండ్‌ను పేర్కొనకుండా తాజా ప్రతిపాదనలు పంపాలని కోరింది. ఈ వెంటిలేటర్లను మూడు ప్రభుత్వ ఆస్పత్రులు పరిశీలించాయి. వీటిని ఆపరేట్ చేసే విషయంలో సాంకేతిక సమస్యలను గుర్తించాయి'' అని అధికారి చెప్పారు. కాగా, పీఎం-కేర్స్ ఫండ్ కింద గతేడాది అందిన ఇవే రకం వెంటిలేటర్లు ఇలాంటి సమస్యలనే ఎదుర్కొన్నాయని చండీగఢ్ ఆస్పత్రులు వెల్లడించాయి. కరోనా మహమ్మారిని ఎదుర్కొనే క్రమంలో మోడీ ప్రభు త్వం అనేక విషయాల్లో పాఠాలు నేర్వలేదనీ, ఫలితంగా ఇలాంటి సమస్యలు ఎదురవుతున్నా యని ఆరోగ్య నిపుణులు ఆరోపించారు.