Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డెల్టా వేరియంట్ అత్యంత ప్రమాదకరం
- టీకా అసమానతలు మానవాలికి ముప్పు: ప్రపంచ ఆరోగ్య సంస్థ
న్యూఢిల్లీ: ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) టీకా అసమానతలపై మరోసారి గళం విప్పింది. తీవ్ర ఆందోళనకర పరిస్థితుల్లో ఉన్న వారికి టీకాలు అందివ్వడంలో ప్రపంచ సమాజం విఫలమైందని తెలిపింది. కరోనా మహమ్మారి టీకాల అసమానతలను బహిర్గతం చేసిందని పేర్కొంది. తాజాగా డబ్ల్యూహెచ్వో చీఫ్ టెడ్రోస్ అథనోమ్ గెబ్రియేసెస్ మీడియాతో మాట్లాడుతూ.. అత్యంత ప్రమాదకరమైన డెల్టా వేరియంట్ విజృంభించకముందే పేద దేశాలకు కరోనా టీకాలు అందేలా చూడాలని టీకా ఉత్పత్తి దేశాలను కోరారు. కరోనా ముప్పులేని యువతకు సైతం ధనిక దేశాలు టీకాలు అందిస్తున్నాయి కానీ పేద దేశాల్లో రిస్క్ ఉన్న వారికి సైతం టీకాలు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆఫ్రికా దేశాల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉందని తెలిపారు. గత వారంతో పోలిస్తే ప్రస్తుతం కరోనా కేసులు, మరణాలు 40 శాతం పెరిగాయని తెలిపారు. ప్రపంచ దేశాలకు వ్యాక్సిన్లు అందించాలన్న ఉద్దేశంతో తాము ప్రారంభించిన కోవాక్స్ కార్యక్రమానికి కూడా టీకాల సరఫరాలో జాప్యం జరుగుతోందన్నారు. ఆస్ట్రాజెనికా, సీరం, జాన్సన్ అండ్ జాన్సన్ సంస్థల నుంచి ఈ నెలలో ఒక్క డోసు కూడా అందలేదన్నారు.
కాగా, ఇప్పటివరకు గుర్తించిన కరోనా మ్యూటెంట్లలో డెల్టా వేరియంట్ అత్యంత ప్రమాదకరమైనదని డబ్ల్యూహెచ్వో పేర్కొంది. ఇప్పటికే చాలా దేశాలకు ఈ వేరియంట్ విస్తరించిందని ఆందోళన వ్యక్తం చేసింది. డెల్టా వేరియంట్ ప్రపంచ వ్యాప్తంగా వేగంగా వ్యాప్తి చెందుతోందని వెల్లడించింది. డెల్టా వేరియంట్ విజృంభణకు ముందే పేద దేశాలకు టీకాలు అందించాలని ధనిక దేశాలను కోరింది.